బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు ఈ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తిచేసినందుకు మోడీకి ధన్యవాదాలు చెబుతూ తీర్మానం.. వికసిత భారత్ సాకారం చేయడానికి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.. ఏమైంది..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర అని దుయ్యబట్టారు. కేసీఆర్ అవినీతి పాలన పోవాలని ఓడించారు అంతేనని అన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. భూములకు సంబంధించిన లావాదేవీలపై బెదిరింపులకు పాల్పడుతోందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు డబ్బులు సమకూర్చడానికి బిల్డర్స్, భూ వ్యాపారులను బెదిరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అవినీతి కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రజలను చైతన్యం చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయి. ఆ రెండు పార్టీలను ఒక్కటిగానే చూడాలని కిషన్ రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన అవినీతి మంత్రులపై అధికారంలోకి వస్తేనే చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు.. ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది.. రోడ్ మ్యాప్ లేదని ఆరోపించారు. ఇచ్చిన హామీల అమలు పై క్లారిటీ ఇవ్వడం లేదని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.