NTV Telugu Site icon

Telangana BJP: అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి.. పవన్ ను కోరిన తెలంగాణ బీజేపీ..!

Janasena Pawan Kalyan

Janasena Pawan Kalyan

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని జనసేన పార్టీని బీజేపీ కోరింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు పవన్‌ను కోరారు. అయితే ఈ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ వారికి చెప్పినట్లు సమాచారం.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఎన్.డి.ఎ.లో జనసేన కొనసాగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై సావధానంగా చర్చలు చేశారు. జనసేన నాయకుల మనోగతాన్ని పవన్ కళ్యాణ్ బి.జె.పి. నేతలకు వివరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని, బీజేపీ అగ్ర నాయకుల కోరిక మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి విరమించుకుని బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశామని, ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కి ..పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియచేశారు. ఉమ్మడిగా పోటీ చేసే విషయమై ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తన కార్యాలయానికి విచ్చేసిన బీజేపీ నేతలను పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా తెలంగాణ జనసేన నాయకులు పవన్‌తో మాట్లాడుతూ.. రాజకీయ గందరగోళం జరగకూడదనే ఉద్దేశ్యంతో 2018లో కొత్త రాష్ట్రంలో పోటీ చేయకూడదన్న అభిప్రాయాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చేందుకే పోటీ నుంచి తప్పుకున్నామని, అయితే ఈసారి తప్పక పోటీ చేయాలని కోరారు. చాలా రోజులుగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని నేతలు అభిప్రాయపడ్డారు. ఈసారి పదవీ విరమణ చేస్తే భవిష్యత్‌లో ప్రజల ముందుకు బలంగా వెళ్లడం కష్టమని, క్యాడర్‌కు నిరాశ తప్పదని స్పష్టం చేశారు. నేతల అభిప్రాయాలు విన్న పవన్ కళ్యాణ్.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తానే అర్థం చేసుకోగలనని, అయితే తనపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని, అయితే నాయకులు, ప్రజా సైనికులు, వీర వనితల అభిప్రాయాలను గౌరవిస్తానని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఒకటి రెండు రోజులు ఆగాల్సిందేనని పవన్ చెప్పినట్లు సమాచారం.


MLA Raja Singh: నామీద పోటీచేసే దమ్ముందా..? అసదుద్దీన్ ఓవైసీ కి రాజాసింగ్ సవాల్..!