NTV Telugu Site icon

Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ..

Bandi Sanjay

Bandi Sanjay

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. విద్య, వైద్యం విషయంలో కాంగ్రెస్ తీరు కోట్లాది మంది ప్రజలను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు. ‘ఆరోగ్యశ్రీ’, ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ‘నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లుందని విమర్శించారు. ఒకవైపు ‘ఆరోగ్యశ్రీ’ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు, ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించారు.. కానీ అసలు బిల్లులే చెల్లించకుండా, ఆరోగ్యశ్రీ సేవలే ప్రజలకు అందకుండా చేస్తుండటం ఎంతవరకు సమంజసం..? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Read Also: Chhattisgarh: కూలిన చిమ్మీ.. నలుగురి మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న 30 మంది

మీ ఏడాది పాలనా నిర్వాకం వల్ల రూ.వెయ్యి కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయాయి.. మీ చేతగానితనం, నిర్లక్ష్యం ఫలితంగా ఆరోగ్యశ్రీ సేవలందక పేదలు అల్లాడుతున్నారని బండి సంజయ్ తెలిపారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని కూడా మీరు ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్‌తోపాటు మీ ప్రభుత్వ నిర్వాకంవల్ల రూ.7 వేల కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయి.. ఫీజు రీయంబర్స్‌మెంట్ అందక కాలేజీ యాజమాన్యాలు మూతపడే దుస్థితి నెలకొందని తెలిపారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించనిదే విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వబోమని కాలేజీ యాజమాన్యాలు తెగేసి చెబుతుంటే ఏం చేస్తున్నారు..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మీ చేతగానితనం, నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని పేర్కొన్నారు.

Read Also: RBI: ఖాతాదారులకు RBI గుడ్ న్యూస్.. ఇకపై బ్యాంకులు మీకు రోజుకు రూ. 100 చెల్లింపు!

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వన్‌టైం సెటిల్‌మెంట్‌ పద్ధతిలో క్లియర్‌ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం సిగ్గు చేటు అని బండి సంజయ్ ఆరోపించారు. అవేమైనా బ్యాంకు లోన్లా? వడ్డీలతో కలిపి బకాయిలు పెరిగిపోతే వన్ టైం సెటిల్ మెంట్ చేసుకోవడానికి..? అని దుయ్యబట్టారు. ఇవ్వాల్సిన సొమ్మును సకాలంలో చెల్లించకపోవడమే కాకుండా.. ఓటీఎస్ పేరుతో కోత విధిస్తామని చెప్పడం దుర్మార్గం అని పేర్కొన్నారు. పేదలకు విద్య, వైద్యం అందించే విషయంలో మీరు చేతులెత్తేయడం దారుణం అని తెలిపారు. 2 లక్షల 75 వేల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ నుండి రూ.8 వేల కోట్లు చెల్లించి లక్షలాది మంది రోగులను, విద్యార్థులను ఆదుకోలేరా..? అని ప్రశ్నించారు. విదేశీ పర్యటనలు, ఢిల్లీ పర్యటనలు, మూసీ పునరుజ్జీవం, ఫోర్త్ సిటీ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న మీకు రూ.8 వేల కోట్లు చెల్లించేందుకు మనసు రావడం లేదా? అని అన్నారు. పేదల ప్రాణాలంటే మీకెంత చులకన ఉందో, విద్యార్థుల భవిష్యత్తుపట్ల మీకెంత చిన్నచూపు తేటతెల్లమవుతోందని అన్నారు. తక్షణమే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలి.. లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థుల, పేదలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బండి సంజయ్ తెలిపారు.

Show comments