Grain Storage Capacity: దేశవ్యాప్తంగా గిడ్డంగుల సామర్థ్యం పెంపునకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార రంగంలో పెద్ద ఎత్తున గోదాములు ఏర్పాటు చేసేందుకు కేంద్రం రూ.లక్ష కోట్లతో గిడ్డంగుల కోసం కొత్త పథకాన్ని రూపొందించనుండగా.. 700 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను నిల్వ ఉంచే లక్ష్యంతో ఈ పథకం ఉండనుంది. ఇందులో భాగంగా సహకార రంగంలో పెద్ద ఎత్తున గోదాములను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే దీనిపై సబ్ కమిటీ ఏర్పాటు కానున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
Read Also: Rahul Gandhi: బీజేపీని ఓడించొచ్చు.. అమెరికాలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
దేశంలో ప్రస్తుతం గిడ్డంగుల సామర్థ్యం 1450 లక్షల టన్నులుగా ఉందని.. రాబోయే ఐదేళ్లలో దాన్ని 2,150 లక్షల టన్నులకు పెంచాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సహకార రంగంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమంగా దీన్ని మంత్రి అభివర్ణించారు. ప్రతి జిల్లాలో 2 వేల టన్నుల సామర్థ్యంతో గోదాములు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆహార పదార్థాల వృథాను తగ్గించేందుకు ఈ కార్యక్రమం తీసుకొచ్చినట్లు చెప్పిన మంత్రి.. గిడ్డంగులు లేక చాలా వరకు ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయన్నారు. ఇక మీదట అలా కాకుండా గిడ్డంగుల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ గిడ్డంగుల కారణంగా రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ఆహార భద్రతకు ఏ ఢోకా ఉండదని కేంద్ర మంత్రి వివరించారు.