తన నియోజకవర్గం నుంచి మరొకరికి తెలుగు దేశం పార్టీ టికెట్ ఇస్తుందనే ప్రచారంతో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు కంటతడి పెట్టుకున్నారు. ఇవాళ (ఏప్రిల్9) కార్యకర్తల ఆత్మీయ సమావేశం తర్వాత రామరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘నా నియోజకవర్గం నుంచి వేరొకరికి టికెట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుంటాను అని పేర్కొన్నారు. కార్యకర్తలే తన కుటుంబ సభ్యులు అని చెప్పుకొచ్చారు. వారు చెప్పినట్టుగానే చెస్తాను.. రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి త్వరలోనే తుది నిర్ణయం ప్రకటిస్తా అని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు వెల్లడించారు.
Read Also: Memantha Siddham Bus Yatra: మేమంత సిద్ధం బస్సుయాత్ర.. రేపటి షెడ్యూల్ ఇదే..!
కాగా, ఉండి నుంచి కాకుండా ఎమ్మెల్యే మంతెన రామరాజుకు మరో చోట తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ప్రచారం జోరుగా కొనసాగుతుంది. సీటు మార్పు ఉంటుందనే అనుమానంతో ఎమ్మెల్యే రామరాజు వర్గం ఆందోళనకు గురౌతుంది. దీంతో రామరాజు సీటు మార్చొద్దంటూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎంపీ రఘురామకృష్ణం రాజు పోటీ చేస్తారని ఇటీవల పాలకొల్లులో ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో మంతెన రామరాజు వర్గంలో టెన్షన్ మొదలైంది. ఇక, టీడీపీ తొలి విడుతలో ఎమ్మెల్యే మంతెన రాజరాజు పేరును ప్రకటించిన తర్వాత ఇప్పుడు సీటు మార్పు చేయడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురి కావడంతో మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యాడు.