క్రికెట్‌లో రికార్డులు బద్దలు కొట్టడానికే ఉంటాయి. ప్రతిరోజూ ఎన్నో రికార్డులు సృష్టించబడుతాయి, మరెన్నో బ్రేక్ అవుతుంటాయి. అయితే కొన్ని రికార్డులు అస్సలు బద్దలవవు. ఆ రికార్డుల గురించి ఆలోచించడం కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏ ఆటగాడు ఎప్పటికీ బద్దలు కొట్టలేని నాలుగు రికార్డులు ఉన్నాయి. ఆ రికార్డులు ఏంటో ఓసారి చూద్దాం.
జాక్ హాబ్స్:
ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాట్స్‌మన్ జాక్ హాబ్స్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేశారు. క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా హాబ్స్ రికార్డుకు దగ్గరగా రాలేకపోయారు. హాబ్స్ క్రికెట్ కెరీర్ 29 సంవత్సరాలు కొనసాగింది. అతను 834 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి.. 61760 పరుగులు చేశారు. ఇందులో 199 సెంచరీలు, 273 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఏ బ్యాట్స్‌మన్ కూడా ఇన్ని సెంచరీలు చేయలేదు. ఆయన 1905 నుంచి 1934 వరకు క్రికెట్ ఆడారు. అతని అత్యుత్తమ స్కోరు 316 నాటౌట్. 1908లో టెస్ట్ అరంగేట్రం చేసిన హాబ్స్.. 61 మ్యాచ్‌ల్లో 56 సగటుతో 5,410 పరుగులు చేశారు. ఇందులో 15 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. హాబ్స్ రికార్డును బద్దలు కొట్టడం నేడు ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మన్‌కైనా అంత తేలిక కాదు.
Also Read: Fastest Fifty: 6,6,6,6,6,6,6,6.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ, వరల్డ్ రికార్డు!
డాన్ బ్రాడ్‌మాన్:
సర్ డాన్ బ్రాడ్‌మాన్ టెస్ట్ క్రికెట్‌లో 99.94 సగటును కలిగి ఉన్నారు. ఆస్ట్రేలియన్ లెజెండ్ ఈ గొప్ప రికార్డుకు ఎవరూ దగ్గరగా రాలేదు. బ్రాడ్‌మాన్ తన చివరి ఇన్నింగ్స్‌లో ఇంకా 4 పరుగులు చేసి ఉంటే.. అతని టెస్ట్ బ్యాటింగ్ సగటు 100 అయ్యేది. కానీ బ్రాడ్‌మాన్ తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యారు. 52 టెస్ట్ మ్యాచ్‌లలో 99.94 సగటుతో 6996 పరుగులు చేశారు.
రోహిత్ శర్మ:
వన్డేల్లో భారీ ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును కలిగి ఉన్నారు. హిట్‌మ్యాన్ వన్డేల్లో 264 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. 2014లో శ్రీలంకపై ఈ ఇన్నింగ్స్ ఆడారు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ప్రపంచ రికార్డు రోహిత్ సొంతం. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్ అతడే. రోహిత్ తప్ప వన్డేల్లో మరే ఇతర బ్యాట్స్‌మన్ కూడా రెండుసార్లు డబుల్ సెంచరీలు సాధించలేకపోయారు.
జిమ్ లేకర్:
ఇంగ్లాండ్ మాజీ బౌలర్ జిమ్ లేకర్ ఒకే టెస్ట్ మ్యాచ్‌లో 19 వికెట్లు తీసి సంచలనం సృష్టించారు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్ అతనే. 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో లేకర్ మొదటి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టారు. జిమ్ లేకర్ రికార్డును బద్దలు కొట్టాలంటే.. ఒక బౌలర్ రెండు ఇన్నింగ్స్‌లలో 10 వికెట్లు తీయాలి. ఇది సమీప భవిష్యత్తులో జరిగేది అసాధ్యమే.