Aadhaar Card: దేనికైనా ఆధార్ కార్డు నంబరే ఆధారంగా తయారైంది పరిస్థితి.. ఇక, ఎప్పటికప్పుడు ఆధార్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI).. పదేళ్లు దాటితో ఆధార్ తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాల్సిందేనని నిర్ణయించిన విషయం విదితమే.. దీంతో కొంతమంది దగ్గరలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్‌డేట్ చేసుకుంటుండగా.. మరికొందరు ఆన్‌లైన్‌లో లింక్‌లు వెతికి అప్‌డేట్ చేసుకుంటున్నారు.. పనిలో పనిగా సైబర్ నేరగాళ్లు.. ఆధార్ అప్‌డేట్ మాటున పంజా విసురుతున్నారట.. దీంతో.. అప్రమత్తమైన UIDAI.. ఆధార్ కార్డు హోల్డర్లకు వార్నింగ్ ఇచ్చింది.. ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి పత్రాలను షేర్ చేయవద్దని యూఐడీఏఐ వినియోగదారులను హెచ్చరించింది.
మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి మీ గుర్తింపు రుజువు (POI) లేదా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (POA) పత్రాలను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా షేర్ చేయమని మిమ్మల్ని అడగడం లేదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా, తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసే ఉద్దేశ్యంతో వారి గుర్తింపు లేదా చిరునామా రుజువు పత్రాలను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంచుకోవద్దని ప్రజలను హెచ్చరించింది. అలాంటి అభ్యర్థలను UIDAI ఎప్పుడూ చేయదని.. ఒకవేళ అలాంటి మెసేజ్‌లు మీకు వచ్చాయంటే మోసపూరితంగా ఉండే అవకాశం ఉందని UIDAI అధికార యంత్రాంగం పేర్కొంది.
UIDAI ఎప్పుడూ ముఖ్యమైన డాక్యుమెంట్లను పంచుకోమని అడగదు.. UIDAI మీ ఆధార్‌ని ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా అప్‌డేట్ చేయడానికి మీ POI/POA పత్రాలను షేర్ చేయమని మిమ్మల్ని ఎప్పుడూ కోరదు.. my Aadhaar Portal ద్వారా ఆన్‌లైన్‌లో మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయండి లేదా మీకు సమీపంలోని ఆధార్ కేంద్రాలను సందర్శించండి అని సూచించింది. కాగా, గత ఏడాది ప్రారంభంలో, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), ప్రజలు తమ ఆధార్ కార్డుల ఫోటోకాపీలను ఏ సంస్థలతోనూ పంచుకోవద్దని సూచించింది. ఎందుకంటే ఆధార్ కార్డ్‌లో దుర్వినియోగం అయ్యే సున్నితమైన వ్యక్తిగత సమాచారం ఉంది. బదులుగా, ప్రజలు తమ ఆధార్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను మాత్రమే ప్రదర్శించేలా ఉపయోగించవచ్చు అని పేర్కొంది. ఇక, ఆధార్ కార్డ్ గుర్తింపును రుజువు చేయడానికి మరియు లావాదేవీలు చేయడానికి ఉపయోగించబడాలి, కానీ, Twitter, Facebook మొదలైన పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లలో ఉంచకూడదు కూడా వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే.
ఆధార్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, మీరు ఇతర ID కార్డ్‌ల విషయంలో చేసే విధంగానే శ్రద్ధ వహించాలి.. ఎక్కువ కాదు, తక్కువ కాదు.. అంటూ UIDAI తన వెబ్‌సైట్‌లో తన భద్రతా నోటీసును పేర్కొంది. మరోవైపు.. 10 సంవత్సరాల క్రితం తమ ఆధార్ కార్డులను పొంది, తమ వివరాలను అప్‌డేట్ చేసుకోని వ్యక్తులను వీలైనంత త్వరగా అప్‌డేట్ చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సూచించింది. UIDAI ప్రకారం, నవీకరించబడిన ఆధార్ కార్డ్ ప్రభుత్వ సేవలను సులభంగా యాక్సెస్ చేయడం, బ్యాంక్ ఖాతాలను తెరవడం మరియు ప్రయాణాన్ని సులభతరం చేయడం ద్వారా జీవన సౌలభ్యాన్ని సులభతరం చేయడానికి సహాయపడుతుందని చెబుతోంది.