NTV Telugu Site icon

Ugadi Pachadi: ఉగాది పచ్చడిలో పేరుకే ఆరు రుచులు.. లాభాలేమో అనేకం!

Ugadhi

Ugadhi

Ugadi Pachadi: తెలుగు సంవత్సరాది అంటేనే ఉగాది. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. ప్రతీ సంవత్సరం వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున ఈ పండుగ కొత్త ఏడాది ఆరంభానికి సంకేతం. ఉగాది అనేది ‘యుగాది’ అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. ‘యుగ’ అంటే నక్షత్ర గమనం లేదా కాలం. ‘ఆది’ అంటే మొదలు. అంటే ఒక కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచించే గొప్ప రోజు. ఈ రోజున తెలుగువారు పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు ఉదయాన్నే తలంటుకుని కొత్త బట్టలు ధరించి భక్తి భావంతో దేవుని పూజలు చేస్తారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో ప్రత్యేకమైన వంటకాలు తయారు చేస్తారు. వాటిలో అత్యంత ప్రాముఖ్యం కలిగింది ‘ఉగాది పచ్చడి’. మరి ఉగాది పచ్చడి ప్రత్యేకత విషయానికి వస్తే.. ఉగాది అంటే ముందుగా గుర్తుచ్చే వంటకం “షడ్రుచుల పచ్చడి”. ఇది తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు అనే ఆరు రుచులతో తయారవుతుంది. ఈ ఆరు రుచులు మన జీవితంలోని భావోద్వేగాలను సూచిస్తాయి. మన జీవితంలో ఉన్న కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి మనకు తెలియచేస్తుంది. అయితే, ఈ షడ్రుచులలో ఉపయోగించే పదార్థాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మరి వాటి ప్రయోజనాలు ఏమిటో ఒకసారి చూద్దామా..

Read Also: Airtel: దేశవ్యాప్తంగా 2000 నగరాల్లో IPTV సేవలు తీసుకరానున్న ఎయిర్‌టెల్.. ప్లాన్స్ లిస్ట్ ఇదే!

తీపి (బెల్లం):
ఉగాది పచ్చడిలో తీపి రుచిని అందించేందుకు కొత్త బెల్లాన్ని వాడుతారు. ఇది మనసును ఆనందాన్ని అందించడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెల్లం శరీరంలో కొత్త కణాలను నిర్మించేందుకు సహాయపడుతుంది. ఇది రక్త శుద్ధిని కూడా చేస్తుంది. అలాగే, చక్కెర మాదిరిగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచకుండా.. హానికరమైన ప్రభావాలను కలిగించకుండా సహాయపడుతుంది.

చేదు (వేప పువ్వు):
వేప పువ్వులు శరీరానికి డిటాక్స్ చేసేవిగా పనిచేస్తాయి. అవి రక్తాన్ని శుద్ధి చేసి, హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తాయి. వేప పువ్వు తినడం ద్వారా జ్వరం, చర్మ సమస్యలు, లివర్ సమస్యలు తగ్గుతాయి. దీని వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లి శరీరం తేలికగా అనిపిస్తుంది.

కారం (మిర్చి పొడి):
కారం అనేది జీవక్రియను మెరుగుపరిచే ముఖ్యమైన పదార్థం. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచి, కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది. మితంగా తీసుకుంటే ఇది శరీరంలో మలినాలను బయటికి పంపి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే, ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగించవచ్చు.

పులుపు (చింతపండు):
చింతపండు శరీరానికి చాలా ఆరోగ్యకరం. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, కడుపులో సమస్యలు రాకుండా చేస్తుంది. ఇందులో ఉండే యాసిడ్స్, ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను బలపరుస్తాయి. చింతపండు రుచిగా ఉండటమే కాకుండా, దీనిని తినడం ద్వారా మలబద్దకం సమస్యలు కూడా తగ్గుతాయి.

Read Also: Punjab: ‘‘ పాకిస్తాన్‌లో నివసిస్తున్నట్లు ఉంది’’.. సొంత ప్రభుత్వంపై ఆప్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..

ఉప్పు:
ఉప్పు మన జీవితం రుచిగా ఉండేందుకు అవసరమైన అంశం. ఇది శరీరానికి అవసరమైన సోడియం, ఇతర ఖనిజాలను అందిస్తుంది. ఇది ఆకలిని పెంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అయితే, మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రావచ్చు. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు ఉప్పును తక్కువగా తీసుకోవడం మంచిది.

వగరు (మామిడి కాయ):
మామిడి కాయల్లో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. మామిడి కాయలు ఎండాకాలంలో శరీరాన్ని వేడికి తట్టుకునేలా చేస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, లివర్ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఉగాది పచ్చడి కేవలం ఒక ఆహారం మాత్రమే కాదు. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ప్రతి పదార్థం శరీరానికి ఉపయోగకరంగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరంలోని మలినాలను తొలగించడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక ప్రయోజనాలు ఈ పచ్చడిలో దాగి ఉన్నాయి. ఈ ఉగాది రోజున మనం కొత్త ఆరంభానికి స్వాగతం పలుకుదాం.