NTV Telugu Site icon

Ugadi 2024 : ‘ఉగాది’ ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా?

Ugadi

Ugadi

Ugadi 2023 : ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండుగకు యుగం+ఆది ‘యుగాది’ లేదా ‘ఉగాది’ అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృత యుగం ప్రారంభమైంది కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజును మనం ఉగాదిగా జరుపుకుంటాం. కాలక్రమేణా అదే పండుగగా మారింది. ఇక ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. సోమవారంతో శ్రీ శోభకృత్​ నామ సంవత్సరం ముగుస్తుంది. మంగళవారం నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. వసంతమాసంలో వస్తుందీ పండుగ. వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది.

భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమినాడే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతీ తెలుగు సంవత్సరాదికి ఓ పేరు ఉంటుంది. అలా ఈ 2024వ సంవత్సరం ఉగాది పేరు ‘క్రోధి నామసంవత్సరం’.. ఉగాది రోజునే సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడం ప్రారంభించారని చెబుతారు. ప్రభవ నామ ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని చెబుతారు.

Read Also: Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశిఫలాలు

ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ‘ఉగాది’పేరుతో జరుపుకుంటారు. మరి భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఏఏ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారో తెలుసా?.. ఎందుకంటే భారతదేశం విభిన్నజాతులు,మతాలు,కులాలు,సంస్కృతి,సంప్రదాయాల మేలు కలయిక.అలాగే ఎన్నో భాషలు భారత్‌లో వాడుకలో ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గుజరాతీ, బెంగాలీ ఇలా ఎన్నో భాషల కలయికగా విరాజిల్లుతోంది మన భారతదేశం. అందుకే దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగలు కూడా ఆయా ప్రాంతాలు, రాష్ట్రాలను బట్టి పేర్లు మార్పుతో భారతీయులు జరుపుకుంటుంటారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఉగాది పండుగను ఉగాది పేరుతోనే జరుపుకుంటారు. అదే మహారాష్ట్రలో గుడి పడ్వాగా, కేరళలో విషు, తమిళనాడులో పుత్తాండు, సిక్కులు వైశాఖి, బెంగాలీలు పోయ్ లా బైశాఖ్ పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక ఉగాది అంటే అర్థం ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం ‘ఆది’ అంటే మొదలు అని అర్థం. అంటే ఈ సృష్టి, ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి రోజు ఉగాది. జనవరి ఒకటవ తేదీన పాశ్చాత్తులు కొత్త సంవత్సరంగా భావిస్తే, తెలుగువారు మాత్రం ఉగాది రోజునే కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తారు. తెలుగు వారికీ కొత్త సంవత్సరం..వసంత ఋతువు, చైత్ర మాసంలోని పాడ్యమి రోజునుంచి ప్రారంభమవుతుంది.