Site icon NTV Telugu

Dubai Floods: ఇంకా నీళ్లల్లోనే దుబాయ్.. స్తంభించిన జనజీవనం

Cars

Cars

గత మంగళవారం కురిసిన భారీ వర్షానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ అతలాకుతలం అయింది. ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షం కురిసింది. ఏడాదిన్నర వర్షమంతా కొన్ని గంటల్లోనే కురిసి దుబాయ్‌ను దడదడలాడించింది. పలుచోట్ల రోడ్లు, ఇళ్లు ఏకమైపోయాయి. మరికొన్ని కోతకు గురయ్యాయి. భారీ నీటి ప్రవాహానికి కార్లు, బైకులు, వస్తువులు కొట్టుకుపోయాయి. దాదాపు నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ పరిస్థితులు చక్కబడలేదు. ఓ వైపు అధికారులు.. సహాయ బృందాలు పని చేస్తున్నా.. వర్షపు నీరు ఇంకా రోడ్లు, ఇళ్ల మధ్య నిలిచిపోయి ఉన్నాయి. దీంతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలు తీరక అల్లాడిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా వీడియోలు పెడుతున్నారు. అంటే వర్షం ఎంతగా కురిసిందో దీని బట్టి చెప్పొచ్చు.

 

ఏప్రిల్ 15 సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. మొదట చినుకులతో నెమ్మదిగా ప్రారంభమై.. అనంతరం ఒక్కసారిగా తీవ్ర ప్రభావం చూపించింది. విపరీతంగా వర్షం కురిసింది. 1949 తర్వాత అంతటి వర్షం కురవడం మళ్లీ ఇదే కావడం విశేషం. ఇక వర్షపునీరు అపార్ట్‌మెంట్ల కింద నిలిచిపోవడంతో కార్లు వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో ఉద్యోగులంతా ఇళ్లకే పరిమితమైపోయారు. మరోవైపు వర్షపునీరు బయటకు పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే పలు కార్యాలయాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి.

ఇది కూడా చదవండి: IPL 2024: హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీపై మహ్మద్ నబీ అసంతృప్తి.. పోస్ట్ వైరల్..!

ఇక భారీ వర్షానికి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వర్షపునీటితో నిండిపోయింది. దీంతో ఆయా దేశాలకు చెందిన విమాన సర్వీస్‌లన్నీ నిలిచిపోయాయి. మరోవైపు అధికారులు వేగంగా పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడలేదు. దీంతో చీకట్లోనే ప్రజలు మగ్గుతున్నారు. విద్యుత్ అధికారులు కూడా విద్యుత్ లైన్లను సరి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది సహజంగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కృత్రిమ వర్షాలతో పని ఉండదని సాధారణంగా వర్షాలు పడొచ్చని సూచించింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: Rajnath Singh: బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ అవినీతి ప్రభుత్వాలే.. ఖమ్మంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రచారం

Exit mobile version