NTV Telugu Site icon

Asia Cup 2024: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. సెమీస్‌కు భారత్!

Vaibhav Suryavanshi And Ayush Mhatre

Vaibhav Suryavanshi And Ayush Mhatre

అండర్-19 ఆసియా కప్‌ 2024లో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం షార్జా క్రికెట్ స్టేడియంలో యూఏఈతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యువ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యూఏఈ నిర్ధేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలోనే ఛేదించింది. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (76; 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ ఆయుష్‌ మాత్రే (67; 51 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. డిసెంబరు 6 జరిగే సెమీస్‌లో శ్రీలంకతో టీమిండియా తలపడనుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 44 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్‌ అయింది. యూఏఈ ఓపెనర్ ఆర్యన్ సక్సేనా (9) ఆరంభంలోనే పెవిలియన్ చేరాడు. యాయిన్ రాయ్ డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో అక్షత్ రాయ్ (26), ఏతాన్ డిసౌజా (17)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో అవుట్ కాగా.. రాయన్ ఖాన్ (35; 48 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టు స్కోరును పెంచాడు. రాయన్ అనంతరం ఉద్దీష్ సూరి (16) డిఫెన్స్ ఆడేందుకే ప్రయత్నించాడు. అయితే మరో ఎండ్‌లో క్రీజులో నిలబడేవారే కరువయ్యారు. దాంతో యూఏఈ స్వల్ప స్కోరుకే పరిమితం అయింది. భారత బౌలర్లలో యుధజిత్ 3, చేతన్ శర్మ 2, హర్దిక్ రాజ్‌ 2 వికెట్స్ పడగొట్టారు.

Also Read: Champions Trophy 2025: తగ్గేదేలే.. పీసీబీ డిమాండ్‌కు బీసీసీఐ కౌంటర్‌!

138 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్‌ మాత్రేలు ఆడుతూ పాడుతూ ఛేదించారు. యూఏఈ బౌలర్లకు అవకాశమే ఇవ్వకుండా దంచికొట్టారు. గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశపర్చిన 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సిక్సులతో రెచ్చిపోయాడు. ఏకంగా ఆరు సిక్సులు బాదాడు. మరోవైపు మాత్రే కూడా బౌండరీల వర్షం కురిపించాడు. దాంతో భారత్ సునాయాస విజయం సాధించింది. షార్జాలో భారత్, శ్రీలంక మధ్య సెమీస్ మ్యాచ్ శుక్రవారం ఉదయం 10.30కు ఆరంభం అవుతుంది.

Show comments