Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ముంబయిలో సల్మాన్ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున 5 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. క్రైం బ్రాంచితో పాటు స్థానిక పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Also: Murder Express: అనువాదం తెచ్చిన తంటా.. హటియాను హత్య చేశారుగా..
కాగా, గత ఏడాది మార్చిలో సల్మాన్ ఖాన్ ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు ఈ- మెయిల్స్ వచ్చాయి. దీనిపై విచారణ చేసిన ముంబయి పోలీసులు.. గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా.. వీరు టార్గెట్ చేసిన లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ పేరున్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. అయితే, కృష్ణ జింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న టైంలో బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్ దెబ్బ తీశారంటూ 2018లో లారెన్స్ బిష్ణోయ్ కామెంట్స్ చేశారు. ఇదే విషయంపై ఆయనకు ఈ- మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే, 2023 ఏప్రిల్‌లోనూ ఇదే తరహా బెదిరింపుల రావటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ‘ఎక్స్’ గ్రేడ్ భద్రతను ‘Y+’గా అప్‌గ్రేడ్ చేయగా.. దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్‌కు భద్రత ఇస్తున్నారు.
