Site icon NTV Telugu

Gandhi Hospital : గాంధీ హాస్పిటల్ మృతదేహం కేసులో పురోగతి.. హత్యగా నిర్ధారణ

New Project (5)

New Project (5)

Gandhi Hospital : గాంధీ దవాఖానలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వదిలివెళ్లిన కేసులో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ నెల 9న అర్ధరాత్రి 1:40 గంటలకు ముగ్గురు వ్యక్తులు విగత జీవిగా ఉన్న ఓ వ్యక్తిని స్ట్రెచర్‌పై తీసుకువచ్చారు. ఓపీ చిట్టీ తీసుకొని వస్తామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటికి విధి నిర్వహణలో ఉన్న క్యాజువాలిటీ వైద్యులు పరిశీలించగా స్ట్రేచర్‌పై ఉన్న వ్యక్తి అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.

Read Also:MS Dhoni: సీఎస్కే, కేకేఆర్ మ్యాచ్‌లో అద్భుత దృశ్యం.. సునీల్ గవాస్కర్ చొక్కాపై ధోనీ ఆటోగ్రాఫ్

మృతుడి ముఖం, చేతులు, తలపై గాయాలున్నాయి. మృతుడికి 30 నుంచి 35 ఏండ్ల వయస్సు ఉంటుందని, కుడి చేతిపై హిందీలో ‘జితేందర్‌-ఖుషి’ అని పచ్చబొట్టు ఉండటంతో అతడు బెంగాల్‌ లేదా ఒడిశాకు చెందిన వ్యక్తి అయి ఉంటాడని పోలీసులు అనుమానించారు. పోలీసులు గాంధీ దవాఖాన నుంచి గచ్చిబౌలి వరకు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. మృతుడు అదే పరిసరాలలో ఏదైన నిర్మాణంలో ఉన్న భవనంలో కార్మికుడిగా పనిచేస్తూ ఉండవచ్చని, తోటి కూలీలతో ఏదైన గొడవ జరిగి ఉంటుందని అనుమానించారు. ఆదివారం చిలకలగూడ పోలీసులు సీసీటీవీలో రికార్డు అయిన మృతదేహాన్ని వెంట తీసుకువచ్చిన సమయంలో అతడి వెంట ఉన్న వ్యక్తి ఫొటోను విడుదల చేశారు.

Read Also:Langar House : భార్యను 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించాడు.. పక్కింటి వాళ్లతో మాట్లాడిందని చంపేశాడు

ఈ కేసును పరిశీలించిన పోలీసులు హత్య కేసుగా నిర్ధారించారు. గచ్చిబౌలిలో జితేందర్‌పై ఐదుగురు వ్యక్తులు దాడి చేసి చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. అయితే అతడు చనిపోయాడని తెలుసుకున్న నిందితుడు గాంధీ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. ఆటోడ్రైవర్‌కు ఇచ్చిన గూగుల్ పే నంబర్ ఆధారంగా.. డబ్బు విషయంలో జితేందర్‌తో గొడవపడి తపస్ అనే వ్యక్తి అతన్ని కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. చిలకలగూడ పోలీసులు ఈ హత్య కేసును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం వెతకడం ప్రారంభించారు.

Exit mobile version