మునుగోడు ఉపఎన్నిక టీటీడీపీ పోటీ చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. మునుగోడు పోటీలో నిలబడేందుకు అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్ పేరును పార్టీ ఖరారు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. నేడు మునుగోడు టీటీడీపీ తరుఫున అభ్యర్థిని ప్రకటిస్తారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. అందుకు భిన్నంగా టీటీడీపీ నుంచి వార్త వెలువడింది. మునుగోడు ఉపఎన్నికలో పోటీకి దూరంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు వెల్లడించారు.
Also Read : Spicejet Fire: స్పైస్‌జెట్ విమానంలో పొగలు.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
నాయకులు, కార్యకర్తలందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న టీడీపీ.. పోటీకి దూరంగా ఉండాలని, సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మునుగోడు ఉపఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఉపఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని, పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి పెట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం జరిగిందని బక్కని నర్సింహులు పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికే బీజేపీ తరుఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, టీఆర్‌ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలు మునుగోడు ఉప ఎన్నికల బరిలో ఉన్నారు. నామినేషన్లకు రేపే చివరి రోజు. అలాగే ఈ నెల 17వరకు నామినేషన్ల విత్‌డ్రా ప్రక్రియ కొనసాగుతుంది. వచ్చే నెల 3 పోలింగ్, 6న ఓట్లలెక్కింపు నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు.