తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను అర్చకులు మూసివేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగిశాయి. వైకుంఠ ద్వారాలు తిరిగి డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశికి తెరుచుకోనున్నాయి. ఈఏడాది రెండుసార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది.
శ్రీవారి ఆలయంలో పది రోజులు పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు. పది రోజుల వ్యవధిలో 6 లక్షల 83 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ 6.83 లక్షల మంది భక్తులకు ఉచిత సర్వదర్శన టోకెన్లను టీటీడీ జారీ చేసింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భారీగా హుండీ కానుకలు వచ్చాయి.
Also Read: CM Chandrababu: నేటి నుంచి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.. పెట్టుబడులే టార్గెట్!
2023-24లో 6 లక్షల 47 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2022-22లో 3 లక్షల 78 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగా.. 2020-21లో 4 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇక 2025లో 6.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.