Ayodhya: అయోధ్య ఆలయానికి భక్తజనాన్ని నియంత్రించడం ఇప్పుడు ఒక కొత్త సమస్యగా మారింది. ఉన్న పరిమిత సమయంలోనే వేలాది మందికి రాములవారి దర్శనభాగ్యాన్ని కల్పించడం.. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరం ట్రస్ట్ టీటీడీ సహకారాన్ని కోరింది. ఈ క్రమంలో అయోధ్య ట్రస్ట్ ఆహ్వానం మేరకు టీటీడీ కార్యనిర్వాహణాధికారి ఏవీ ధర్మారెడ్డి శనివారం సాయంత్రం అయోధ్యకు వెళ్లారు. మూడు రోజులు క్రితమే అయోధ్యకు టీటీడీ ప్రతినిధులును ఈవో ధర్మారెడ్డి పంపారు.
Read Also: Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు
శనివారం సాయంత్రం అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకున్న ఏవీ ధర్మారెడ్డి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయోధ్య ట్రస్టు ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ అనిల్ మిశ్రా, గోపాల్ జి, జగదీష్ ఆఫ్లే, గిరీష్ సహస్ర భోజని, విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి రాఘవులు, డీఎస్ఎన్ మూర్తి ఇందులో పాల్గొన్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, క్యూ లైన్ల నిర్వహణ, ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ బాలరాముడి దర్శన భాగ్యాన్ని కల్పించడం.. వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించారు. మరోరెండు రోజుల పాటు టీటీడీ అధికారుల బృందం అయోధ్యలోనే ఉండనుంది. త్వరలోనే పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించే అవకాశం ఉంది.