TTD Adulteration Ghee Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ముగిసింది. ఈ మేరకు అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో సాగిన ఈ విచారణతో కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం సిట్‌ను నియమించింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
Read Also: Karnataka: పిల్లలు లేరన్న కోపంతో భార్యను చంపిన భర్త.. హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించి చివరికీ..
ప్రారంభంలో ఈ కేసు మూలాలు తమిళనాడులో ఉన్నట్టుగా దర్యాప్తు బృందాలు భావించాయి. అయితే విచారణలో కీలక మలుపు తిరగడంతో బోలోబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లు ఈ స్కాంలో ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. ఈ కల్తీ నెయ్యి నెట్‌వర్క్‌లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా సహా మొత్తం 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నట్టు అధికారులు తేల్చారు. కేసు విచారణలో సీబీఐకి చెందిన డీఎస్పీలు, సీఐలతో పాటు రాష్ట్రానికి చెందిన సుమారు 30 మంది అధికారులు పాల్గొన్నారు. దర్యాప్తులో భాగంగా దాఖలు చేసిన తొలి ఛార్జిషీట్‌లో 24 మందిని నిందితులుగా పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో మరో 12 మంది పాత్ర కూడా ఉన్నట్టు కోర్టుకు స్పష్టంగా వివరించారు. కల్తీ నెయ్యి ద్వారా ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లిన ఈ కేసులో మరింత లోతైన విచారణ కొనసాగుతుందని, అవసరమైతే అదనపు ఛార్జిషీట్లు కూడా దాఖలు చేసే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.
