TTD: నేడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో పలు నిర్ణయాలను ( key decisions ) టీటీడీ ( TTD ) తీసుకుంది. ఈ సందర్భంగా స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకోగా.. టీటీడీలోని అన్ని కళాశాలల్లో సిఫారస్సు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం అదనంగా భవనాలు నిర్మాణానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2014వ సంవత్సరానికి ముందు టీటీడీలో నియమింపబడిన కాంట్రాక్టు, పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫారస్సు చేసింది. యాత్రి సముదాయంలో లిఫ్ట్ లు ఏర్పాటుకు 1.88 కోట్ల రూపాయలను కేటాయించింది. అలాగే, బాలాజీ నగర్ సమీపంలో ఫెన్సింగ్ ఏర్పాటుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇక, 14 కోట్ల రూపాయలతో టీటీడీలోని 188 క్వార్టర్స్ ఆధునికరణ పనులకు శ్రీకారం చుట్టింది.
Read Also: N.V Ramana : వెంటాడి మరీ నాకు సన్మానం చేశారు ఎందుకో అర్ధం కాలేదు
ఇక, గోవిందరాజ స్వామి ఆలయంలో బాష్యాకర్ల సన్నిధిలో మకరతోరణం ఏర్పాటుకు తిరుమల తిరుపతి పాలకమండలి ( TTD ) ఆమోదం తెలిపింది. ఐటీ సేవల కోసం 12 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాల మరమ్మతులకు ఆమోదం తెలిపింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్ కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.