Site icon NTV Telugu

TSSPDCL CMD: విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఉండొద్దు.. మరింత అప్రమత్తంగా ఉండండి

Tsspdcl Cmd

Tsspdcl Cmd

ప్రస్తుత వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్ మరియు వినియోగాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రతి విద్యుత్ శాఖ ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో.. చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఈ సీజన్లో ఇప్పటికే 4214 మెగావాట్ల అత్యధిక డిమాండ్ నమోదయ్యిందని తెలిపారు.

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానం అత్యవసర ల్యాండింగ్.. 160 మంది సేఫ్

(నిన్న) శుక్రవారం 89.71 మిలియన్ యూనిట్ల అత్యధిక వినియోగం నమోదయ్యిందని.. గతేడాది నమోదయిన 58.34 మిలియన్ యూనిట్ల వినియోగంతో పోల్చుకుంటే ఇది 53.7 % అధికం అని అన్నారు. ఈరోజు కూడా 4209 మెగావాట్ల డిమాండ్ నమోదయ్యిందని, వినియోగం సైతం 90 మిలియన్ యూనిట్లకు మించిందన్నారు. ఈ సీజన్లో మే నెల ముగిసేవరకు డిమాండ్ అనూహ్యంగా మరింతగా పెరిగే అవకాశముందని తెలిపారు. ఈ సీజన్ ముగిసే వరకు ప్రతి 11 కేవీ ఫీడెర్కు ఇంచార్జిగా ఒక ఇంజినీర్ను షిఫ్ట్ల వారీగా నియమించాలన్నారు. దీనికి సంబంధించి సంస్థ ప్రధాన కార్యాలయంలో.. ఇతర సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో పని చేస్తున్న దాదాపు 300 ఇంజినీర్లను సైతం ఆపరేషన్ విధుల్లో నియమించారు.

T20 World Cup 2024: హార్దిక్‌ పాండ్యా బదులుగా.. అతడిని తీసుకుంటే బాగుండేది!

దీనికి తోడు సర్కిల్ కార్యాలయాల్లో పని చేసే అకౌంటింగ్ సిబ్బందికి సైతం ఆపరేషన్ విధులు అప్పగించాల్సిందిగా సీఎండీ ఆదేశించారు. వేసవి డిమాండ్ల నేపథ్యంలో ఇప్పటికే 4353 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందకని తెలిపారు. వీటికి అదనంగా మరో 250 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు క్షేత్ర స్థాయి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అవసరమైన చోట విద్యుత్ సిబ్బంది వాటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.

Exit mobile version