తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే… విద్యాశాఖలో భారీగా ఖాళీలు ఉండడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత టెట్ నిర్వహించింది. ఈ సారి టెట్‌కు ఉపాధ్యాయ అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 12న టెట్ పరీక్షను అధికారులు నిర్వహించారు. ఉదయం పేపర్ -1, మధ్యాహ్నాం పేపర్ -2 నిర్వహించారు అధికారులు. అయితే.. ముందుగా జూన్ 27న ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అయితే.. జూన్ 15 న ప్రాథమిక కీ ని విడుదల చేయడంతో.. 18 వ తేదీ వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించిన అధికారు.. టెట్ పరీక్షా పేపర్లలో చాలా తప్పులు దొర్లినట్లు గుర్తించారు. దీంతో అభ్యర్థుల నుంచి భారీగానే అభ్యంతరాలు రావడంతో వాటిని పరిశీలించి తుది కీ ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే.. ఫైనల్ కీ వచ్చాకే ఫలితాలు విడుదల చేస్తారు. కానీ అధికారులు ఇప్పటి వరకూ టెట్ ఫైనల్ కీ విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను జూలై 1వ తేదీన విడుదల చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరును సమీక్షించారు మంత్రి సబితా. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. టెట్ ఫలితాలు వెల్లడిలో జాప్యానికి ఆస్కారం లేకుండా జూలై 1న ఫలితాలను విడుదల చేయాలని పేర్కొన్నారు.