తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్ అందించింది ఇంటర్ బోర్డు. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన పరీక్షల ఫీజు గడువును ఈనెల 21వరకూ పొడిగించింది. ఈనెల 21 వరకూ 5వేల రూపాయల అపరాధ రుసుముతో దరఖాస్తులు చేసుకోవచ్చు. గతంలో తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ముందుగానే ప్రకటించింది. ఆ తర్వాత జేఈఈ పరీక్షల తేదీలు వచ్చాయి. దీంతో తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలతో క్లాష్ కావడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్ష తేదీలను సవరించింది.
ఇంటర్ బోర్డు (Telangana Inter Board) తెలిపిన వివరాల ప్రకారం మే 6 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ (TS Inter Exams) ప్రారంభం అవుతాయి. మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీలలో ఇంటర్ సెకండియర్, మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనుంది.
మరో వైపు ఇంటర్ విద్యార్ధులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఇంటర్ బోర్డు సూచించింది. అందుకు అనుగుణంగా ఇంటర్ బోర్డు సైకాలజిస్టుల్ని నియమించింది. కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులు బాగా నడిచాయి. దీంతో అధ్యాపకులతో ఇంటరాక్షన్ లేక వత్తిడికి గురయ్యారు. కొందరిని ప్రమోట్ చేశారు. తమమీద తమకు నమ్మకం తగ్గి పరీక్షలంటే మరింత భయం ప్రారంభమైంది.
త్వరలో పరీక్షలు ప్రారంభం కానున్న వేళ విద్యార్థుల సమస్యను దృష్టిలో పెట్టుకొని వారికి సైకాలజిస్టు (Psychologist) సహాయాన్ని అందించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ తెలిపారు. పరీక్షల సమయంలో ఆందోళన చెందే విద్యార్థులు వారి సమస్యలను ఫోన్ ద్వారా సైకాలజిస్టులకు చెప్పుకోవచ్చు. ఇందుకోసం సైకాలజిస్టు ప్యానల్‌ను బోర్డు ఏర్పాటు చేసింది.