Trump Tariffs: ఇరాన్ ప్రజాతిరుగుబాటు నేపథ్యంలో, ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను విధిస్తామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇరాన్ టాప్-5 వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఉంది. ఒక వేళ ఇరాన్‌తో భారత్ వాణిజ్యం చేస్తే, ఇప్పుడున్న 50 శాతం సుంకాలకు తోడు మరో 25 శాతం పెరిగి, 75 శాతానికి పెరగవచ్చు. భారత్‌కు ఇరాన్ దీర్ఘకాలిక వాణిజ్య, వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. ఇరాన్ నుంచి దిగుమతులతో పోలిస్తే, భారత్ ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. ఇదే కాకుండా చైనా పాకిస్తాన్‌లో నిర్మిస్తున్న గ్వాదర్ ఓడరేవుకు కౌంటర్‌గా ఇరాన్‌లో ఇండియా చాబహార్ పోర్టును నిర్మిస్తుంది. దీని ద్వారా, పాకిస్తాన్ అవసరం లేకుండా మధ్య ఆసియాలోకి భారత్ సులువుగా చేరవచ్చు.
Read Also: Giriraj Singh: ‘‘పందుల పెంపకం’’ అంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. ఒక వర్గాన్ని అవమానించారని విమర్శలు..
చైనా ఇరాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయినప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం టాప్-5లో చోటు దర్కించుకుంది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం, 2024–25లో ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $1.68 బిలియన్లు, భారత ఎగుమతులు $1.24 బిలియన్లు, దిగుమతులు $440 మిలియన్లు. ఇరాన్‌కు భారత్ సేంద్రీయ ఎరువులు, బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఔషధాలు, పండ్లు, పప్పు ధాన్యాలు, మాంసం ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. దిగుమతుల్లో మిథనాల్, పెట్రోలియం బిటుమెన్, లిక్విఫైడ్ ప్రొపేన్, ఆపిల్స్, ఖర్జూరం, రసాయనాలు ఉన్నాయి. ఆంక్షలు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల రెండు దేశాల వాణిజ్యం మధ్య హెచ్చుతగ్గులు కనిపించాయి.
అమెరికన్ సుంకాల నేపథ్యంలో, భారత కంపెనీలు యూఎస్ మార్కెట్‌ను కాపాడుకోవడానికి ఇరాన్‌తో వాణిజ్యనాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా, భారతదేశ వ్యూహాత్మక అవసరాలనున కూడా ట్రంప్ చర్యలు ప్రభావితం చేస్తున్నాయి. 2015 ఒప్పందం నుండి భారతదేశం మరియు ఇరాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన చాబహార్ పోర్టు ప్రాజెక్ట్, భారతదేశ ప్రాంతీయ కనెక్టివిటీ ప్రణాళికలు మరియు మానవతా సరఫరా మార్గాలకు కేంద్రంగా ఉంది. గతంలో చాబహార్ విషయంలో భారత్‌కు అమెరికా మినహాయింపులు ఇచ్చినప్పటికీ, ఇటీవల ట్రంప్ ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికా నిర్ణయం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది.
