రంజాన్ వేళ ఇరాన్‌తో యుద్ధం వేళ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై తమ లక్ష్యం నెరవేరిందని.. యుద్ధం కూడా ముగియబోతోందని ట్రంప్ కీలక సంకేతం ఇచ్చారు. తమ లక్ష్యాలను సాధించేందుకు చాలా దగ్గరగా ఉన్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఇరాన్‌పై మూడు వారాలుగా కొనసాగుతున్న సైనిక చర్యలను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని, రక్షణ పరిశ్రమను పూర్తిగా నాశనం చేయడం అమెరికా లక్ష్యాల్లో ఒకటి అని.. అలాగే మధ్యప్రాచ్యంలో మిత్రదేశాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు.
ప్రముఖ్యంగా ఐదు లక్ష్యాలను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేశారు.
1. ఇరాన్ క్షిపణి సామర్థ్యాలు, ప్రయోగ వాహనాలు, వాటికి సంబంధించిన ప్రతిదానిని పూర్తిగా నాశనం చేయడం.
2. ఇరాన్ రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని నాశనం చేయడం.
3. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం నుంచి విమాన నిరోధక ఆయుధాలను తొలగించడం.
4. ఇరాన్ అణు సామర్థ్యాన్ని చేరుకోకుండా నిరోధించడం, అటువంటి పరిస్థితి తలెత్తితే అమెరికా త్వరితగతిన, సమర్థవంతంగా స్పందించగల స్థితిలో ఎల్లప్పుడూ ఉండటం.
5. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్, ఇతరులతో సహా మధ్యప్రాచ్య మిత్రదేశాలను అత్యున్నత స్థాయిలో రక్షించడం.
హోర్ముజ్..
ఇక హోర్ముజ్ జలసంధికి సంబంధించి కూడా ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ కీలకమైన సముద్ర మార్గాన్ని అమెరికా స్వయంగా ఉపయోగించనందున.. దాని భద్రత, నిఘా బాధ్యతను దానిని ఉపయోగించే దేశాలే చూసుకోవాలని స్పష్టంగా సూచించారు. అవసరమైతే అమెరికా సహాయం చేస్తుందన్నారు. అయితే ఇరాన్ ముప్పు తొలగిపోయిన తర్వాత మాత్రం దాని అవసరం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు.
గతగత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆయా దేశాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్లు దిగ్బంధించబడ్డాయి. పైగా ఖతార్‌లోనే అతి పెద్ద గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి చేయడంతో ప్రపంచ దేశాల్లో గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా ఐరోపా దేశాలు విలవిలలాడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తానికి మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగిసేటట్లు కనిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు దాడులు మాత్రం ఆగలేదు. యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Trump-UK: హార్ముజ్ కోసం బ్రిటన్ యూటర్న్.. అమెరికాకు గ్రీన్‌సిగ్నల్
