Site icon NTV Telugu

Munugode Bypoll : మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయం.. 10 వేల దాటిన టీఆర్‌ఎస్‌ ఆధిక్యం

Kusukuntla

Kusukuntla

Munugode Bypoll : రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ రాజకీయాల్లో సైతం ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికకు ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోరు జరిగినా.. ప్రధానంగా మాత్రం బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్యే పోటీ సాగింది. అయితే.. ఈ ఉప ఎన్నికకు ఈ నెల 3న పోలింగ్‌ జరుగగా.. నేడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. అయితే.. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఆధిక్యం ప్రదర్శించారు. అయితే.. ఆ తరువాత 2,3,4 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం ప్రదర్శించినా.. మిగితా అన్ని రౌండ్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆధిక్యం ప్రదర్శించారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి 10309 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే.. మొత్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థికి ఈవీఎంలో 96,598 రాగా.. పోస్టల్‌ బ్యాలెట్‌లో 408 ఓట్లు వచ్చాయి.
Also Read : Ashu Reddy: ఛీఛీ.. అవకాశాల కోసం ఇంతగా దిగజారాలా..
అలాగే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి 86,485 ఓట్లు ఈవీఎంలో రాగా.. 212 ఓట్లు పోస్టల్‌ బ్యాలెట్‌లో వచ్చాయి. అయితే.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఈవీఎంలో 23,864 ఓట్లు రాగా.. 42 ఓట్లు పోస్టల్‌ బ్యాలెట్‌లో రావడంతో.. డిపాజిట్‌లు కోల్పోవడం గమనార్హం. అయితే.. మొత్తంగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి.. 97,006 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 86,697 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 23,906 ఓట్లు పోల్‌ అయ్యాయి. ముందు నుంచి మునుగోడు స్థానం కాంగ్రెస్‌ది కావడంతో ఈ సారి కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రజలు పట్టం కడుతారని భావించారు. కాంగ్రెస్‌ పార్టీని వీడి.. బీజేపీలోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని సైతం కాదని మునుగోడు ప్రజలు ఈ సారి కూసుకుంట్లను గెలిపించారు.
Also Read : మీ జీవిత భాగస్వామి ఇలా ఉంటే కష్టమేనండోయ్‌..

మునుగోడు ఫలితాలపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ప్రజల తీర్పును గౌరవిస్తానని, టీఆర్‌ఎస్‌ కౌరవ ఎమ్మెల్యేలందరూ కలిసి ఓడించారని, నన్ను ఒక్కడిని ఓడించడానికి టీఆర్‌ఎస్ మొత్తం దిగివచ్చిందని ఇది నా నైతిక విజయమన్నారు. ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు అమిత్‌ షా, మోడీలకు చెంపపెట్టు తీర్పు ఇచ్చారన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసి.. కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన వ్యక్తి తగిన బుద్ధి చెప్పారన్నారు. అయితే.. మునుగోడులో ఆధర్మం గెలిచిందని, ప్రజాస్వామ్యం అపహాస్యమైందని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా.. ముందునుంచి మునుగోడులో డబ్బు, మద్యం విచ్చలవిడిగా సరఫరా అయ్యిందనే అన్నీ పార్టీల నేతల వాదన. వామపక్షాలు టీఆర్‌ఎస్‌తో కలిసి రావడం, సంక్షేమ పథకాలు సైతం టీఆర్‌ఎస్‌కు బలం చేకూర్చాయనే చెప్పాలి.

Exit mobile version