ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా పేరు మార్చుకుని జాతీయ రాజకీయాల్లోకి రానుంది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ ఎస్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం కూడా ప్రారంభించిన ఆ పార్టీ.. ఏయే రాష్ట్రాల్లో తాము విస్తరించేందుకు అవకాశం ఉందనే అంశంపై లెక్కలు వేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీకి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి, జనసేన తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణతో టీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ మేరకు లక్ష్మీనారాయణతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేశారని సమాచారం.
Also Read : Sunil Kanugolu : పరారీలో సునీల్ కనుగోలు.. పలు కేసులు నమోదు..
అయితే.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉండే టీఆర్‌ఎస్ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్‌ను మార్చినట్లు ప్రకటించింది. ‘ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ “భారత రాష్ట్ర సమితి” (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మారిన సందర్భంగా @trspartyonline గా ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ పేరును @BRSparty గా మార్చడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గమనించగలరు.’ అని ట్విట్టర్‌లో హ్యాండిల్ అప్డేట్ ఇచ్చారు టీఆర్‌ఎస్ శ్రేణులు. ఇదిలా ఉంటే.. రెండు రోజులుగా బీఆర్ఎస్ కార్యాలయంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్న కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 12.45 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. బీఆర్‌ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పలువురు మంత్రులు, నేతలు పాల్గొన్నారు.
