మునుగోడు ఉప ఎన్నిక ఉత్కంఠగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే.. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓట్లర్లు ఇబ్బందులకు గురయ్యారు. అయితే.. మరో వైపు ఓటర్లు బీజేపీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని టీఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీపై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ కి టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వికాస్ రాజ్‌తో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణం, నారాయణపేట లోని జనగామ, చండూరు, మర్రిగూడలోని తమ్మలపల్లి వంటి గ్రామాల్లో భారీ ఎత్తున బీజేపీ మద్యం, నగదును పంపిణీ చేస్తుందన్నారు. అక్రమంగా బీజేపీ మద్యం డబ్బులు పంపిణీ చేయడాన్ని వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న రాత్రి నుంచి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ధర్నాలు, నిరసనలు చేయడంతో పాటు ఈరోజు భారీగా నగదు పంపిణీ చేస్తూ… క్షేత్రస్థాయిలో అధికారులపైన బెదిరింపులకు దిగుతున్నారని వికాస్ రాజ్ కు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.
Also Read : Posani Krishna Murali: పోసానికి కీలక పదవి ఇచ్చిన సీఎం జగన్..
ఈ విషయంలో ఎలక్షన్ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని వికాస్ రాజ్ ని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రూ.8 కోట్లను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా పలువురిని అరెస్ట్ చేశారు. ఇంకోవైపు టీఆర్‌ఎస్ పార్టీ నేతలే ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రచార సమయం ముగిసినా ఇంకా మునుగోడు నియోజకవర్గంలో స్థానికేతరులు ఉన్నారని, డబ్బు, మద్యం విచ్చల విడిగా పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా.. ఈ నెల 6న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు అధికారులు.