స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా హైదరాబాద్‌లోని అన్ని ప్రముఖ ప్రదేశాలు వెలిగిపోయాయి. చార్మినార్, పబ్లిక్ గార్డెన్స్, ఫలక్‌నుమా ప్యాలెస్, కాచిగూడ రైల్వేస్టేషన్, ఇతర విశిష్ట భవనాలు త్రివర్ణ కాంతులతో అబ్బురపరుస్తున్నాయి. అయితే నగరంలో ఏ వేడుక జరిగినా, దాని ప్రభావం ముందుగా హుస్సేన్ సాగర్ సరస్సు వెంబడి ఉన్న సుందరమైన రహదారిలో కనిపిస్తుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు దేశభక్తి ఉట్టిపడేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 200 కంటే ఎక్కువగా మువ్వెన్నల జెండాలను ట్యాంక్‌బండ్‌పై అధికారులు ఏర్పాటు చేశారు.
విశాలమైన ప్రాంతంలో ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన వీధి దీపాల ఎత్తులో ఈ జెండాలను అమర్చారు. అయితే.. హుస్సేన్ సాగర్‌పై మువ్వెన్నల జెండాల రెపరెపలతో ట్యాంక్‌బండ్ మరింత శోభాయమానంగా తయారైంది. అంతేకాకుండా.. ట్యాంక్ బండ్ పేవ్‌మెంట్‌పై దాదాపు కిలో మీటర్‌కు ఒక స్పీకర్ అమర్చిన అధికారులు.. ‘జన్మభూమి నా దేశం’, ‘యే దేశ్ హై మేరా’ మరియు ఇతర దేశభక్తి గీతాలు ప్లే చేస్తు దేశభక్తిని మరింత ఉప్పొంగిస్తున్నారు.