మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఆదివారం ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయి. కర్ణాటకలోని బెళగావి ఏవియేషన్ అకాడమీకి చెందిన సెస్నా 152 ఎయిర్ క్రాఫ్ట్ గా గుర్తించారు. కాగా.. ఇంజిన్ ఫెయిల్ అవడంతో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శిక్షణ కోసం బయలుదేరి.. సుమారు 40 నిమిషాల తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది.
Read Also: Divvela Madhuri: కారు ప్రమాద ఘటనపై మాధురి ఆసక్తికర విషయాలు..
ఈ ప్రమాదంపై గుణ కాంట్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దిలీప్ రాజోరియా మాట్లాడుతూ.. ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా ట్రైనర్ విమానం కూలిపోయిందని, దీంతో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన ఇద్దరు పైలట్లను ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ఈ విమానం కొన్ని రోజుల క్రితం టెస్టింగ్, మెయింటెనెన్స్ కోసం గునాకు చేరుకుందని రాజోరియా తెలిపారు.
కాగా.. గాయపడిన పైలట్‌లను వి. చంద్ర ఠాకూర్, నగేష్ కుమార్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందినవారు. ఈ ఘటనపై విమానయాన అధికారులు సమగ్ర విచారణ జరుపుతారని పోలీసులు తెలిపారు.