Site icon NTV Telugu

Fire Crackers Blast: బాణసంచా ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

Sagar

Sagar

Fire Crackers Blast: నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమం అనంతరం జరిగిన బాణసంచా పేల్చడంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆదివారం రాత్రి హుస్సేన్ సాగర్‌లో బాణసంచా పేల్చేందుకు రెండు బోట్లలో బాణసంచా సామగ్రిని తీసుకెళ్లారు. టపాసులు పేల్చడం క్రమంలో, నిప్పు రవ్వలు తిరిగి అదే బోట్లపై పడటంతో, బోట్లలోని బాణసంచా పేలిపోయి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బోట్లలో మొత్తం ఏడుగురు ఉన్నారు. వారిలో నలుగురికి గాయాలు అయ్యాయి.

Also Read: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండవ రోజు తగ్గిన బంగారం ధరలు

గాయపడిన వారిలో గణేశ్‌, ప్రవీణ్‌, ప్రణీత్‌, సునీల్‌ అనే వ్యక్తుల పేర్లు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గణపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడిన అనంతరం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గణపతి పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఆయన 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సమయంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం పై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Exit mobile version