TPCC Protest: హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ధర్నాలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వెంకట్, మాజీ ఎంపీ విహెచ్ సహా అనేకమంది కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తీసుకొచ్చిన కుల గణన అజెండా మోడికి గుదిబండలా మారింది. అందుకే గాంధీ కుటుంబంపై కుట్రలు చేస్తున్నాడు. సొంత పార్టీ పత్రికకు కాంగ్రెస్ అప్పు ఇచ్చిందంటే అది మనమే మన సంస్థకు డబ్బులు ఇచ్చినట్టే. ఇందులో మనీ లాండరింగ్ ఎక్కడ ఉందో మాకు అర్థం కావడం లేదని అన్నారు. గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా అణచివేయాలనే కుట్రగా ఈ కేసులను వాడుతున్నారని ఆరోపించారు.
అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ED ఛార్జీషీట్‌లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు చేర్చడంలో మోడీ భయం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ప్రభుత్వం ఏర్పరచుకున్న మోడీ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భయపడుతున్నాడని, అందుకే గాంధీ కుటుంబంపై అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నారని విమర్శించారు.
ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై కక్ష సాధింపు చర్యలకు మోడీ దిగుతున్నాడని అన్నారు. చట్టం అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం. బీజేపీ లీడర్ కిషన్ రెడ్డి మాకు చట్టం గురించి ఉపదేశించాల్సిన అవసరం లేదని అన్నారు. విచారణను ఎవరూ అడ్డుకోవడం లేదని, మేము మీ పార్టీ లాగా మూర్ఖులు కాదని మరిచిపోవద్ద అన్నారు. ఈ ధర్నా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. మోదీ ప్రభుత్వంపై విమర్శలతోపాటు, గాంధీ కుటుంబానికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు తమ గొంతు ఎత్తారు.