NTV Telugu Site icon

Revanth Reddy: ధరణి కంటే మెరుగైన వ్యవస్థను తీసుకొస్తాం..

Revanth

Revanth

Revanth Reddy: పాలకుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి విమర్శించారు. గద్వాలలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. ఈ ప్రాంతాన్ని కేసీఆర్ సంపూర్ణంగా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. మేము నిర్మించిన ప్రాజెక్టులతో ఈ ప్రాంతానికి కష్టాలు వచ్చాయా కేసీఆర్ అంటూ రేవంత్ ప్రశ్నించారు. పాలమూరు జిల్లాను ఆదుకుంది కాంగ్రెస్సేనని ఆయన అన్నారు. కేసీఆర్ చేసిందేమీ లేక అబద్దాలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి సవాల్ విసిరారు. మీరు 24 గంటలు కరెంటు ఇచ్చినట్టు నిరూపిస్తే మేం నామినేషన్లు వేయమని.. లేకపోతే మీరు గద్వాల చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి, బకాయిలు తొలగించి, కేసులు ఎత్తివేశామన్నారు. 18లక్షల పంపుసెట్లకు ఉచిత కరెంటు అందించామన్నారు. నిజంగా కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఉంటే.. తెలంగాణలో పంపుసెట్లు 18 లక్షల నుంచి 25 లక్షలకు ఎలా పెరిగాయని ప్రశ్నించారు.

Also Read: CPM: మరో 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం

రేవంత్ మాట్లాడుతూ.. “బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే సరిత తిరుపతయ్యకు టికెట్ ఇచ్చాం. కాంగ్రెస్ గెలిస్తేనే బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం సాధ్యమవుతుంది. కాంగ్రెస్ వస్తుంది.. ఆరు గ్యారంటీలను ఆమలు చేసి తీరుతుంది.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ మహిళకు చేయూతను అందిస్తాం. కేసీఆర్ ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్ అని ప్రజలు అంటున్నారు. అందుకే ధరణి, 24గంటల కరెంటు విషయంలో కాంగ్రెస్‌పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ధరణి కంటే మెరుగైన సాంకేతికత తీసుకొచ్చి రైతుల భూములను కాపాడుతాం. రైతులకు, కౌలు రైతులకు ఏటా రూ.15వేలు,రైతు కూలీలకు రూ.12వేలు అందిస్తా. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు… ప్రతీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తాం. ఎవరూ బిల్లులు కట్టకండి.. వచ్చే నెల కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంది.” అని రేవంత్‌ పేర్కొన్నారు.