భారత జెండాను చూసి ఖలిస్తానీలకు మంట.. మరోసారి హైకమిషన్ పై దాడి..
యూకేలోని భారత హైకమిషన్ పై ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి దాడికి యత్నించారు. దీంతో పోలీసులు హైకమిషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఖలిస్తాన్ నాయకుడు అమృత్ పాల్ సింగ్ అణిచివేతకు వ్యతిరేకంగా బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి భారత రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేశారు. అయితే ఈ సారి కూడా భారత దౌత్యసిబ్బంది జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆదివారం ఇదే విధంగా కొంతమంది భారత హైకమిషన్ పై దాడి చేసి భారత జెండాను కిందికి దించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో హైకమిషన్ సిబ్బంది భారీ జెండాతో వారికి బుద్ధి చెప్పింది. అయితే ఈ చర్యతో అక్కడి ఖలిస్తానీ మద్దతుదారులు ఉడికిపోతున్నారు. బుధవారం మరోసారి దాడికి తెగబడ్డారు.
వదిలేసిందన్న కోపంతో ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త
రోజూ గొడవలతో విసిగిపోయిన భార్య భర్తను వదిలేసింది. ఆ తర్వాత ఆమె వేరే పెళ్లి చేసుకుంది. అయితే ఆరేళ్లు గడిచినా భర్త మనసులో నుంచి ఈ ఫీలింగ్ పోలేదు. అసలు తననెందుకు వదిలేసిందో తెల్సుకోవాలనుకున్నాడు. భార్య గుట్టు బయటకు తీయాలని నిర్ణయించుకుని ఆరేళ్లు ఓపిక పట్టాడు. రోజూ గొడవలతో విసిగిపోయిన భార్య భర్తను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంది. అయితే ఆగ్రహించిన భర్త ఆరేళ్ల తర్వాత భార్యపై పగ పెంచుకున్నాడు. మద్యం మత్తులో భార్య ఇంటికి చేరిన అతడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఇది మాత్రమే కాదు, ఆమె రెండున్నరేళ్ల కొడుకును కత్తితో పదే పదే పొడిచాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని హెనూర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. షేక్ సోహైల్ మద్యం మత్తులో విడిపోయిన భార్యతో గొడవకు దిగాడు. గొడవ తీవ్రస్థాయికి చేరడంతో కోపంలో నిందితుడు ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత రెండున్నరేళ్ల బాలుడిపై దాడి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడి పేరు షేక్ సోహైల్ కాగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
పండగ పూట విషాదం.. విశాఖలో కూలిన కుప్పకూలిన భవనం
కొత్త సంవత్సరం విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్ సమీపంలోని రామజోగి పేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారికి ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. మరో ఆరుగురిని రక్షించి కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు పురాతన భవనం కూలినట్టు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. వారికి ఎటువంటి ప్రాణాప్రాయం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరగడంతో తమకేమీ గుర్తులేదని గాయపడిన వారు అంటున్నారు. వారు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేని పరిస్థితి నెలకొంది.
పుతిన్‌ను విమర్శించిన పాప్‌స్టార్ మృతి
రష్యా-ఉక్రెయిన్ యద్ధాన్ని విమర్శించి పాప్ స్టార్ డిమానోవా(35) ఓ నది ప్రమాదంలో మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఆయన అసలు పేరు డిమిత్రి స్వర్గునోవ్. ఆయన ప్రముఖ సంస్థ క్రీమ్ సోడా వ్యవస్థాపకుడు. డీమానోవా తన సోదరుడు ముగ్గరు స్నేహితులతో కలిసి మార్చి 19న గడ్డకట్టిన వోల్గా నది దాటుతుండగా మంచులో పడిపోయి మరణించారు. అతడి ఇద్దరు స్నేహితులను రక్షించగా.. మూడో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు.
నేడు 4 జిల్లాల్లో కేసీఆర్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదీ
సీఎం కేసీఆర్ నేడు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వానతో పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అదేవిధంగా పంటలు నష్టపోయి రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు. తెలంగాణలో వడగళ్ల వానలు, అకాల వర్షం కారణంగా వరి, జొన్న, ఉద్యాన పంటలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. మామిడి పండు చాలా వరకు రాలిపోయి భారీ నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పంట నష్టంపై అధికారులు కేసీఆర్‌కు నివేదిక ఇచ్చారు. ఇందులో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్ నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. జూన్ నెలకు సంబంధించిన ఈ టిక్కెట్లను ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ రిలీజ్ చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు. జూన్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ్టి నుంచి విడుదల చేయనుంది టీటీడీ పాలకమండలి. గురువారం, శుక్రవారం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లతో పాటుగా అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు ఉంటాయి.
ఏపీలో నేడు ఎమ్మెల్యే కోట.. ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్
ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలీంగ్ జరగనుంది. దీనికి సంబంధించి వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభ ప్రాంగణంలో పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగబోతోంది. ఉన్నది ఏడు స్థానాలు. కానీ బరిలో నిలిచింది 8మంది. ఒకవైపు ఏడుగురు, మరోవైపు ఒకే ఒక్కరు. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175. ఇందులో వైఎస్సార్‌సీపీకి 151 మంది సభ్యులు ఉండగా.. టీడీపీకి అధికారికంగా 23 మంది, జనసేనకు ఒకరు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీకి 19 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అలాగే జనసేనకు ఉన్న ఒక సభ్యుడు కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. ఒక్కో ఎమ్మెల్సీ గెలుపొందడానికి 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్న నేపథ్యంలో ఏడు స్థానాలకు అభ్యర్థులను బరిలో దించింది. ఈ క్రమంలో వాస్తవంగా చూస్తే.. ఒక్క స్థానం గెలవడానికి కూడా టీడీపీకి బలం లేదు.