Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కళ్యాణ్!
అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. వెంటనే మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి అతడిని పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్దూ ఆవిష్కరించిన సైకిల్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా నడిపారు. సైకిల్‌పై సిద్ధూని కూర్చోబెట్టుకొని క్యాంపు కార్యాలయంలో రౌండ్స్ వేశారు. ఈ సందర్భంగా బ్యాటరీ సైకిల్ గురించి సిద్దూని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతని ఆలోచనలు తెలుసుకుని డిప్యూటీ సీఎం అబ్బురపడ్డారు. సిద్ధూ రూపొందించిన గ్రాసరీ గురూ వాట్సప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు. సిద్ధూ ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని ఆకాంక్షిస్తూ.. రూ.లక్ష ప్రోత్సాహకం అందించారు.

జనసేనలోకి వైసీపీ జెడ్పీటీసీలు:
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన నలుగురు వైసీపీ జెడ్పీటీసీలు జనసేనలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేనాని నలుగురు జెడ్పీటీసీలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చింతలపూడి జెడ్పీటీసీ సభ్యులు పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, పెరవలి జెడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రజనీ జనసేన పార్టీలో చేరారు.

కల్తీ కల్లు కలకలం.. ఆరుకి చేరిన మృతుల సంఖ్య:
హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరినట్లు తెలుస్తోంది. తాజాగా కల్తీ కల్లు సేవించి వాంతులు, విరోచనాలతో కూకట్‌పల్లి రాందేవ్ రావు ఆసుపత్రికి వచ్చే లోపే మౌనిక(25) అనే యువతి మృతి చెందింది. కానీ ముగ్గురు మాత్రమే మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. సీతారం, స్వరూప, మౌనిక మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. నారాయణమ్మ, బొజ్జయ్య అనే ఇద్దరు కూడా కల్తీ కల్లు తాగడం వల్లే చనిపోయినట్లు తెలుస్తోంది. కానీ.. వీళ్లు ఇద్దరూ హాస్పిటల్‌కి వెళ్లకుండా ఇంట్లోనే మృతి చెందారు. బొజ్జయ్య మృతదేహాన్ని వనపర్తి పంపారు. నారాయణమ్మ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈమె కల్లు తాగి చనిపోయింది అని వాళ్ళ అల్లుడు ఆరోపించారు.

ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మాక్ అసెంబ్లీ పెడదాం:
ఓట్లు అన్నీ నీకు వేస్తే.. నీళ్ళు రాయలసీమకు ఇచ్చారు కేసీఆర్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా.. తెలంగాణలో ఆయనకట్టు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. నల్గొండకు కోతలు… రంగారెడ్డి కి నీళ్ళు ఇవ్వలేదన్నారు.. గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకుపోతే తప్పులేదు అన్నారని చెప్పారు. పొద్దున్న క్లబ్.. రాత్రి ఐతే పబ్బుల్లో చర్చ చేయాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేసీఆర్.. మీ సుదీర్ఘ అనుభవం తీసుకుంటామని సీఎం పునరుద్ఘాటించారు. మీరు ఏ రోజు చెప్తే.. ఆ రోజు సభ పెడతామని.. స్పీకర్ అనుమతితో నిపుణులను పిలిచే వెసులు బాటు చేస్తామన్నారు. రాజకీయాల్లో ఎలా ఉన్నా.. నిపుణుల అభిప్రాయాలు కూడా సభ నుంచి ప్రజలకు తెలియాలన్నారు.. కేసీఆర్.. ఎప్పుడు అంటే అప్పుడు సభ పెడతామని పునరుద్ఘాటించారు. 9 ఏళ్లలో మీరు చేసిన నిర్ణయాలు.. ఏడాదిన్నర లో మేము చేసిన ప్రయత్నాలు సభలో చర్చ పెడదామన్నారు. మంచి వాతావరణం లో చర్చ చేద్దామని.. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసే బాధ్యత తనదని సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇక దేశవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్:
ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు భారతదేశం కీలక అనుమతులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు తుది అనుమతులు వచ్చినట్లు అయింది. బుధవారం దేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుండి ఆమోదం పొందింది. జెన్ 1 లోఎర్త్ ఆర్బిట్(LEO) శాటిలైట్స్ ఉపయోగించి ఇంటర్నెట్ సేవలు అందించడానికి మార్గం సుగమం అయింది. దేశంలో చౌకైన ఇంటర్నెట్ సేవలు, కమర్షియల్ శాటిలైట్ బ్రాండ్‌బ్యాండ్ ఆపరేషన్స్ ప్రారంభించడానికి తుది నియంత్రణ అడ్డంకులు తొలిగిపోయాయి.

రాళ్లు, తాయెత్తులు అమ్మే స్థాయి నుంచి కోట్లకు పడగలు:
జమాలుద్దీన్ అలియాస్ ఛాంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మత మార్పిడిలే లక్ష్యంగా ఈ ముఠా పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు యూపీ పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు సైకిల్‌పై ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునే స్థాయి నుంచి ఇప్పుడు కోట్ల రూపాయల నిధులు సంపాదించాడు. ముఖ్యంగా 40 బ్యాంక్ అకౌంట్లలో రూ. 106 కోట్ల నిధులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ బలరాంపూర్ జిల్లాలో ఇటీవల మతమార్పిడి రాకెట్ బయటపడింది. ఈ కేసులో శనివారం లక్నోలోని ఒక హోటల్‌లో చంగూర్ బాబాతో పాటు అతడి సన్నిహితురాలు నీతు అలియాస్ నస్రీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పేదలు, నిస్సహాయులైన కార్మికులు, బలహీన వర్గాలు, వితంతువులను ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం, వివాహ హామీలతో, బెదిరింపులతో ఆకర్షించి నిందితులు మతమార్పిడి చేస్తున్నారు.

గుండెపోటు మరణాలు, ఆస్పత్రులకు పోటెత్తిన జనాలు:
కర్ణాటక రాష్ట్రాన్ని ఇప్పుడు ‘‘గుండెపోటు’’ భయం కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఆకస్మిక గుండెపోటు కారణాలతో మరణించారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో, గుండె సంబంధిత పరీక్షల కోసం ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మైసూరులోని ప్రముఖ ఆస్పత్రి అయిన జయదేవా ఆసుపత్రికి గుండెపోటు పరీక్షల కోసం వేలాది మంది తరలివస్తున్నారు. ముఖ్యంగా, హసన్ జిల్లాలో ఇటీవల పలువురు యువకులు ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. ఈ వార్తలు మీడియాలో విస్తృతంగా రావడంతో ప్రజలు బయపడుతున్నారు. దీంతోనే ఆస్పత్రులకు పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది. అయితే, జీవనశైలిలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహార అలవాట్లతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ ఆరుగురి నుంచే చైనా కొత్త అధ్యక్షుడు:
చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా జిన్‌పింగ్ మిస్సవ్వడం చూస్తే, ఆ దేశంలో కొత్త నాయకుడు రాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. చైనాలో అధ్యక్షుడి కన్నా శక్తివంతమైన పార్టీ పోలిట్‌బ్యూరో జిన్‌పింగ్ అధికారాలకు కత్తెర వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్‌పింగ్ హాజరుకాలేదు. గత 10 ఏళ్లలో బ్రిక్స్‌కు హాజరుకాకపోవడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మీడియా వ్యాప్తంగా వస్తున్న వార్తల ప్రకారం, త్వరలో జిన్‌పింగ్ గద్దె దిగిపోవడం ఖాయమని, కొత్తగా మరో అధ్యక్షుడు చైనా పగ్గాలు చేపడుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే, తర్వాత చైనాకు కాబోయే అధ్యక్షుడుల్లో ఆరుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

పాకిస్తాన్‌ను బకరా చేసిన భారత్:
ఆపరేషన్ సిందూర్’’లో భారత్, పాకిస్తాన్ పై సాధించిన విజయం ఇప్పుడు పలు వార్ కాలేజీల్లో, పలు దేశాల ఆర్మీల్లో అధ్యయన అంశంగా మారింది. పాకిస్తాన్‌ వైమానిక దళాన్ని కేవలం 4 రోజుల్లోనే భారత్ సైన్యం అచేతనంగా మార్చింది. అయితే, ఈ సంఘర్షణ సమయంలో భారత్, పాకిస్తాన్‌ని బకరా చేసిందని ఇప్పుడు అమెరికా వైమానిక దళ మాజీ F-15E, F-16 పైలట్ అయిన ర్యాన్ బోడెన్‌హైమర్ చెప్పారు. భారత్ నిర్వహించిన వైమానిక పోరాటం ఆధునిక ఎయిర్ కాంబాట్‌లో ఒక పురోగతిగా అభివర్ణించారు.

నరసింహుడి ఉగ్రరూపం చూస్తే గూస్‌బంప్స్ పక్కా:
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ‘కేజీయఫ్‌’, ‘సలార్‌’ వంటి భారీ యాక్షన్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న మొట్టమొదటి యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’. అశ్విన్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 25న 3డీ ఫార్మాట్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

దీపావళికి రేస్ లోకి ‘K-ర్యాంప్’:
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘K-ర్యాంప్’. ఆయన నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటుండగా, తాజాగా కేరళ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించిన సీన్స్ మూవీలో ఐ ఫీస్ట్ గా ఉండబోతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన హీరో కిరణ్ అబ్బవరం ఫస్ట్ లుక్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ‘K-ర్యాంప్’ మూవీ దీపావళికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నటీనటులు – కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.

ఇంగ్లండ్ జట్టులోకి స్టార్ పేసర్‌:
లండన్‌ టెస్ట్ మ్యాచ్‌ కోసం తుది జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. ఫాస్ట్‌ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తుది జట్టులోకి వచ్చాడు. పేసర్ జోష్ టంగ్‌ స్థానంలో ఆర్చర్‌ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు. ఈ ఒక్క మార్పు మినహా.. రెండో టెస్టులో ఆడిన మిగతా జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది. ఆర్చర్‌ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో భారత్ ప్లేయర్స్ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఆర్చర్‌ వేసే బంతులు నేరుగా బ్యాటర్ల తల మీదకు దూసుకొస్తాయి. చాల మంది బ్యాటర్లకు ఆర్చర్‌ బౌలింగ్‌లో దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

Galaxy Z Fold 7 విడుదల:
సామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల రంగంలో సామ్‌సంగ్ తాజా ఆవిష్కరణ. జూలై 9, 2025న న్యూయార్క్‌లో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ స్లిమ్ డిజైన్, అధునాతన హార్డ్‌వేర్, AI-ఆధారిత ఫీచర్‌లతో స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌లో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 8 Elite ప్రాసెసర్ అమర్చారు.

 

Exit mobile version