విశాఖ నగరానికి మంచినీటి ముప్పు:
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వాటర్ సప్లై కార్మికులు సమ్మె చేపట్టడంతో.. విశాఖ నగర వాసులు నానా అవస్థలకు గురవుతున్నారు. కార్మికుల నిరవధిక సమ్మె కారణంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. పంపింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు కార్మికులు విధుల బహిష్కరించి.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్ ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు తెలిపారు. జీవీఎంసీ వాటర్ సప్లై కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె కారణంగా విశాఖలోని మూడు లక్షల ఇంటి కులాయిలు సహా పలు కీలక పరిశ్రమలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దాదాపు 30 గంటలుగా పంపింగ్ ప్రక్రియ స్థంభించిపోవడంతో పలు కాలనీల ప్రజలు మంచినీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏలేరు, తాటిపూడి, గోస్తని, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే నీటిని కార్మికులు నిలిపివేశారు. దాంతో ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ట్యాంకులు ఖాళీ అయ్యాయి. తిరిగి ట్యాంకులను నింపాలంటే సుమారు 10 గంటలు సమయం పడుతుంది.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు:
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించింది.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది నెల్లూరు నాల్గో అదనపు కోర్టు.. అయితే, ఈ కేసులో కాకాణికి బెయిల్ వచ్చినా.. ఇంకా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.. ఎందుకంటే.. మరో నాలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.. మిగిలిన నాలుగు కేసుల్లో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్టు ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు.. మరోవైపు, కృష్ణపట్నం సమీపంలో అనధికార టోల్గేట్ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డ కేసులో రెండు రోజులపాటు కష్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు.. ఈ నెల 30వ తేదీ నుంచి రెండు రోజులు పాటు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని విచారించనున్నారు ముత్తుకూరు పోలీసులు.. మొత్తంగా.. ఓ కేసులో బెయిల్ వచ్చినా.. మరో నాలుగు కేసుల్లో బెయిల్ రాకపోవడంతో.. రిమాండ్ ఖైదీగానే ఉండనున్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్:
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ నేటి (జూన్ 28) నుంచి అందుబాటులోకి రానుంది. పీజేఆర్ ఫ్లైఓవర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాదాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం ఈజీ అవుతుంది. ట్రాఫిక్ కష్టాలు తొలగడానికి ఆస్కారం ఉంది.
నేడు జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ ధర్నా:
నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయం దగ్గర ధర్నా చేయనున్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పిలుపునిచ్చారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయనున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చే కుట్రను అడ్డుకోవాలని గులాబీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక, కార్పొరేటర్లకు మద్దతుగా ధర్నాలో గ్రేటర్ హైదరాబాద్ కి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోనున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ కార్పొరేటర్ల ధర్నాకు పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని కోరారు.
నేడు జూరాలకు మంత్రి ఉత్తమ్ :
ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నాలుగు గేట్ల రోప్‌లు తెగిపోయాయి. మొత్తం 67 రేడియల్ గేట్లు ఉండగా.. ఎనిమిది గేట్ల రోప్‌లు నీటి ప్రవాహానికి తుప్పుపట్టాయి. వీటిలో నాలుగింటిని ఇటీవలే మార్చగా.. 8, 12, 19, 27 గేట్ల రోప్‌లు మార్చాల్సి ఉంది.. ఈలోపే అవి తెగిపోయాయి. కృష్ణా నదికి ముందస్తు వరద నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం 12వ నంబర్ గేటు నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. మరికొన్ని గేట్ల వద్ద రబ్బరు సీళ్లు సైతం దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా.. 12 గేట్ల ద్వారా అంతే మొత్తాన్ని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు.
ప్రధాని మోడీ 5 దేశాల పర్యటన:
ప్రధాని నరేంద్రమోడీ బ్రెజిల్‌లో జరిగి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సౌత్‌లోని అనేక కీలక దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ దేశాలతో భారత్ సంబంధాలను మరింత విస్తరించేందుకు జూలై 2 నుంచి 9 వరకు 5 దేశాల్లో పర్యటిస్తారు. ఎనిమిది రోజుల పర్యటనలో ప్రధాని మోడీ బ్రెజిల్‌తో పాటు ఘనా, ట్రినిడాడ్ టొబాకో, అర్జెంటీనా, నమీబియా దేశాలను సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పర్యటనలో మొదటి దశలో ప్రధాని మోడీ జూలై 2 నుంచి 3 వరకు ఘనాలో పర్యటిస్తారు. మూడు దశాబ్దాల కాలంలో భారత నుంచి ఘనాకు వెళ్తున్న మొదటి ప్రధానిగా మోడీ రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై చర్చలు జరుగుతాయి.
పెళ్లితో ఒక్కటైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్:
ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(61), ప్రియురాలు, జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ (55) వివాహం అట్టహాసంగా జరిగింది. 200 మంది అత్యంత ప్రముఖుల మధ్య ఇటలీలోని వెనిస్‌లో పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోను శుక్రవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో సాంచెజ్ పోస్ట్ చేశారు. ఆమె తెల్లటి లేస్ గౌను ధరించగా.. బెజోస్ క్లాసిక్ టక్సేడోలో కనిపించారు. ఇద్దరూ కూడా చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించారు. ఈ వేడుక శాన్ జార్జియో మాగియోర్ అనే పచ్చని ద్వీపంలో జరిగింది. వెనీషియన్ సరస్సు మీదుగా డోగేస్ ప్యాలెస్ కనిపిస్తోంది. అత్యంత సన్నిహితులు.. ప్రియమైన అతిథులు దాదాపు 200 మంది మోటార్ బోట్ ద్వారా ప్రత్యక్షమయ్యారు. కిమ్ కర్దాషియన్, ఓప్రా విన్‌ఫ్రే వంటి హాలీవుడ్ ప్రముఖుల హాజరయ్యారు. మూడు రోజుల పాటు చాలా గ్రాండ్‌గా ఈ వివాహ వేడుకలు జరిగాయి.
యూఎస్ సుప్రీంకోర్టులో ట్రంప్‌కు భారీ విజయం:
అమెరికా సుప్రీంకోర్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారీ విజయం లభించింది. వ్యక్తిగతంగా న్యాయమూర్తులు ట్రంప్ అధికారాలను కట్టడి చేయడాన్ని సుప్రీంకోర్టు పరిమితం చేసింది. జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేయాలనే ట్రంప్ ప్రయత్నంపై 6-3తో తీర్పు ఇచ్చింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తులు దేశవ్యాప్తంగా జారీ చేసిన నిషేధాలు చట్ట సభలు కోర్టులకు ఇచ్చిన అధికారాలను మించిపోయేలా ఉందని కోర్టు పేర్కొంది.
ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య:
ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం రాత్రి చిక్కడపల్లిలోని జవహర్‌నగర్‌లోని తన నివాసంలో స్వేచ్ఛ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిక్కడపల్లి పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. యాంకర్ స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ తెలిపారు.
‘కాంటా లగా’ ఫేమ్ షఫాలీ జరివాలా మృతి:
నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) గుండె పోటుతో మరణించారు. షఫాలీ జరివాలా శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురికాగా.. వెంటనే ఆమె భర్త పరాగ్ త్యాగి అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం కోసం షఫాలీ మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని షఫాలీ కుటుంబ సభ్యులు ఇంకా ధ్రువీకరించలేదు.