NTV Telugu Site icon

Top Headlines@9AM: టాప్‌ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

*నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్‌ ఎప్పుడంటే?

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయసభలూ మంగళవారానికి వాయిదా పడతాయి. అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పటివరకు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. ఈ సమావేశానికి సభానాయకుడు జగన్‌, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు హాజరవనున్నారు. 10 ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీడీపీ సిద్ధమైనట్లు సమాచారం. ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలని ఈ సమావేశంలో టీడీపీ పట్టుబట్టాలని భావిస్తోంది. చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని టీడీపీ కోరే అవకాశం ఉంది. మంగళవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అలాగే ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి పట్ల శాసనమండలిలో సభ్యులు సమావేశమై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అదేవిధంగా త్వరలో సార్వత్రిక ఎన్ని­కలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటికీ, ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు (ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు) ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. ఈ సమావేశాలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పట్టుబడితే.. దానికి సభానాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశంలో సమ్మతిస్తే.. అదనంగా మరొక రోజు సమావేశాలు కొనసాగే అవకాశం ఉందంటున్నారు.

 

*సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు – పవన్ వరుస భేటీలు.. జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే?
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఒకేరోజు రెండుసార్లు భేటీకావడం, సుదీర్ఘంగా చర్చలు జరపడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటలపాటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్‌ సమావేశమయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఆదివారం రాత్రి మళ్లీ భేటీ అయ్యారు. రెండు పార్టీల పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై విస్తృత చర్చ జరిగినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చర్చలు ఇప్పటికే కొలిక్కి వచ్చాయని అంటున్నారు. ఉమ్మడి సభల నిర్వహణపై రెండు దఫాల చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ఈ నెల 8వ తేదీన చంద్రబాబు – పవన్ మరోసారి భేటీ కానున్నారు. అన్ని అంశాల పైనా ఎనిమిదో తేదీన జరిగే భేటీపై మరింత టీడీపీ – జనసేనలు క్లారిటీకి రానున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వరుస భేటీలు నిర్వహించడంతో జనసేన పోటీ చేయనున్న స్థానాలపై ఒక క్లారిటీ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల లిస్ట్‌ను పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే అవకాశాలున్న స్థానాలు ఇవేనని ప్రచారం జరుగుతోంది. ఇంకా మరిన్ని స్థానాల్లో స్పష్టత రావాల్సి ఉంది. తర్వాత భేటీలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. తెనాలి, భీమిలి, నెల్లిమర్ల లేదా గజపతి నగరం, విశాఖ నార్త్ లేక సౌత్, చోడవరం లేక అనకాపల్లి, పెందుర్తి లేదా యలమంచిలి, పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు, పి. గన్నవరం, రాజానగరం, రాజమండ్రి (రూరల్) లేదా తూ.గోలో మరో సీటు, అమలాపురం, నరసాపురం. భీమవరం, తాడేపల్లిగూడెం లేదా తణుకు, ఏలూరు లేదా కైకలూరు, దర్శి లేదా చీరాల, పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, రాజంపేట లేదా రైల్వే కోడూరు, తిరుపతి లేక చిత్తూరు జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా కొన్ని స్థానాల గురించి స్పష్టత రావాల్సి ఉంది.

 

*నేడు రాంచీకి రేవంత్.. న్యాయ్‌ యాత్రలో పాల్గొననున్న సీఎం..
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జార్ఖండ్ వెళ్లనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలో ఆయన పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి వెళ్లనున్నారు. మధ్యాహ్నం రాంచీలో జరిగే సభకి సీఎం హాజరు కానున్నారు. అనంతరం రాహుల్‌గాంధీ చేపట్టిన ‘న్యాయ్‌ యాత్ర’ ప్రస్తుతం ఝార్ఖండ్‌లో కొనసాగుతోంది. ఇందులో పాల్గొనేందుకు రేవంత్‌రెడ్డి ఆ రాష్ట్రం వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి బయలు దేరారు. జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొనడంతో ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో క్యాంపు నిర్వహించారు. వీరంతా సమీర్ పేటలోని లియోని రిసార్ట్‌లో ఉంటున్నారు. బలపరీక్ష నేపథ్యంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయం నుంచి తమ రాష్ట్రానికి వెళ్లినవిషయం తెలిసిందే. దీంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాంచీకి వెళ్లారు. దీంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించాల్సి ఉండగా.. ఈ మేరకు ముందుగా టూర్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. కానీ జార్ఖండ్ రాజకీయ పరిణామాల దృష్ట్యా కొడంగల్ పర్యటనను రద్దు చేసుకున్న రేవంత్ రెడ్డి జార్ఖండ్ వెళ్లనున్నారు. హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల సంకీర్ణ ప్రభుత్వం ఇవాళ శాసనసభలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ కూటమికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను రెండు రోజులు ముందే హైదరాబాద్ శివారులోని సమీర్‌పేటలోని రిసార్ట్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం రాంచీకి కూడా వెళ్తారు. రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్‌మున్షీ, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌లు వారి భద్రతా విధులను పర్యవేక్షిస్తున్నారు.

 

*తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు..
తెలంగాణ రాష్ట్రంలో ఇటివల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ వస్తుంది. తాజాగా రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో పది మందికి ప్రభుత్వం పోస్టింగులను ఇచ్చింది. ఇందులో టీఎస్పీఎస్సీ సెక్రెటరీగా నవీన్ నికోలస్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గా అనిత రామచంద్రన్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా హనుమంతరావు ఉన్నారు. అలాగే, బీసీ వెల్ఫేర్ కమీషనర్ గా బాలమాయదేవిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు హార్టీ కల్చరర్ డైరెక్టర్ గా అశోక్ రెడ్డి, ఫిషరీస్ కమీషనర్ గా బి. గోపి, స్త్రీ శిశుసంక్షేమ, ఎస్సీ వెల్ఫేర్ కమీషనర్ గా నిర్మల కాంతి వెస్లీ, సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా సీతా లక్ష్మీ, ఛీఫ్ రేషనింగ్ గా ఫనీంధ్రను రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది.

 

*తహశీల్దార్ రమణయ్య హత్య కేసు.. చెన్నైలో నిందితుడు?
ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మమ్మరం చేశారు. చెన్నైలో నిందితుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసుల ప్రత్యేక బృందం చెన్నైకి వెళ్లింది. హత్య జరిగిన మరుసటి రోజు 12 గంటల వరకు విశాఖలోనే నిందితుడు ఉన్నాడు. ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కి నిందితుడు పారిపోయినట్లు తెలిసింది. నిందితుడు విమానాశ్రయంలో ఉండగా గుర్తించకపోవడంపై సీపీ రవి శంకర్‌ తీవ్రంగా మండిపడ్డారు. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫల్యంపై జాయింట్ సీపీ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. తహశీల్దార్ రమణయ్య హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు కొన్ని నిమిషాల ముందు భార్య వద్ద కీలక ఫైల్‌ను జాగ్రత్తగా ఉంచమని రమణయ్య చెప్పినట్లు విచారణలో తేలింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 

*నేడు జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష.. హైదరాబాద్ నుంచి రాంచీకి పయనం..
జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో జెఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో బస చేశారు. ఇక, చంపయ్‌ సోరెన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు రిసార్టులో బస చేసిన దాదాపు 40 మంది ఎమెల్యేలు రాంచీకి చేరుకున్నారు. మొత్తం 81 మంది సభ్యులు ఉండే ఆ రాష్ట్ర అసెంబ్లీలో.. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(28), కాంగ్రెస్‌(16), ఆర్జేడీ(1) కూటమికి 45 సీట్లు ఉండగా.. సీపీఐ(ఎంఎల్‌)కు ఒక ఎమ్మెల్యే ఆ కూటమికి బయటి నుంచి సపోర్టు ఇస్తుంది. అయితే, బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ బల పరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు రావాలి.. సంఖ్యాపరంగా ఆ కూటమికి బలపరీక్షలో నెగ్గే బలం ఉంది అయిన్నప్పటికీ.. పరిస్థితి అంత సజావుగా ఏమీ సాగడం లేదు.. సీనియర్‌ ఎమ్మెల్యే లాబిన్‌ హెమ్‌బ్రామ్‌ ఈ బలపరీక్షలో ఓటు వేయడానికి పలు డిమాండ్లను పార్టీ చీఫ్‌ శిబు సోరెన్‌ ముందు పెట్టారు. మద్య నిషేధం, అటవీ సంరక్షణకు, నీటి సంరక్షణకు కఠినమైన చట్టాల్లాంటి 2019 ఎన్నికల హామీలను అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విష్ణుపూర్‌ ఎమ్మెల్యే చమ్రాలిండా ఇటీవల జేఎంఎం నిర్వహించిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టాడు. అయితే, విష్ణుపూర్‌ ఎమ్మెల్యే అనారోగ్యం బారిన పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చమ్రాలిండా ఎవరికీ అందుబాటులో లేకూండా పోయినట్లు తెలుస్తుంది. ఇక, నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ఆయన గైర్హాజరయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే, హైదరాబాద్‌లోని రిసార్ట్‌కు 40 మంది ఎమ్మెల్యేలు రాగా.. వీరిద్దరినీ కలిపితే 42 మంది. మిగతా నలుగురి గురించి తెలియదు. జేఎంఎం వర్గాలు మాత్రం.. తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పుకొస్తున్నారు. కాగా.. ఇవాళ పరీక్షలో హేమంత్‌ సోరెన్‌ ఓటు వేసేందుకు రాంచీలోని ప్రత్యేక కోర్టు పర్మిషన్ ఇచ్చింది.

 

*గోవాలో గోబీ మంచురియాపై నిషేదం.. ఎందుకో తెలుసా..?
గోబీ మంచురియా డిష్ పై గోవాలో భారీ గొడవలు జరుగుతున్నాయి. గోబీని అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేయడం వల్ల ఈ డిష్‌లో ప్రమాదకర కలర్స్ వాడటంతో పాటు దుస్తులు ఉతకడానికి ఉపయోగించే పౌడర్‌‌ను సాస్‌ తయారీలో ఉపయోగించడంపై అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో అక్కడి స్థానిక సంస్థలు ఒక దాని తర్వాత మరొకటి ఈ డిష్ పై నిషేదం విధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రసిద్ధ బోడ్గేశ్వర ఆలయ జాతర దగ్గర గోబీ మంచురియాను నిషేధించాలని మపుసా మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిలర్ తారక్ ఆరోల్కర్ వెల్లడించారు. అయితే, గత నెలలో ఓ తీర్మానాన్ని ప్రవేశ పెట్టాగా, సభ్యులందరూ ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేశారు. దీంతో వెంటనే గోబీ నిషేధం అమల్లోకి వచ్చింది. గోవాలో గోబీపై గతంలోనూ కొన్ని కౌన్సిల్స్ నిషేధం విధించాయి. శ్రీ దామోదర దేవాలయ వాస్కో సప్త జాతరలో గోబీ మంచురియాను విక్రయించే స్టాళ్లను నియంత్రించాలని 2022లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మోర్ముగావ్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పోండాలోని కపిలేశ్వరి, సాతేరి దేవి జాతర సమయంలోనూ గోబీ తయారు చేసే షాప్స్ పై ఎఫ్​డీఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం గోవాలో గోబీ మంచురియాపై నిషేదం విధించారు.

 

*పాన్ మసాలా, గుట్కా, పొగాకు కంపెనీలకు షాక్.. ఈ పని చేయకపోతే రూ.లక్ష జరిమానా
పాన్ మసాలా, గుట్కా, పొగాకు తయారీ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. GST విభాగం ఇప్పుడు ఈ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలకు కొత్త సలహాను జారీ చేసింది. ఈ కంపెనీలు లేదా తయారీదారులు తమ ప్యాకింగ్ మెషినరీని GST అధికారంతో నమోదు చేసుకోకపోతే వారికి రూ.లక్ష జరిమానా విధించబడుతుంది. ఈ నియమాలు ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. పొగాకు తయారీ రంగంలో లూప్ హోల్స్ అంటే పన్ను ఎగవేతను నిరోధించడమే దీని ఉద్దేశ్యం.ఫైనాన్స్ బిల్లు, 2024 కేంద్ర జీఎస్టీ చట్టానికి సవరణలను చేసింది. అలాంటి ప్రతి యంత్రం నమోదు చేయకపోతే రూ.లక్ష జరిమానా విధించే నిబంధన ఉంది. కొన్ని సందర్భాల్లో ఇటువంటి యంత్రాలు కూడా జప్తు చేయబడతాయి. GST కౌన్సిల్ సిఫార్సు ఆధారంగా, పన్ను అధికారులు పొగాకు తయారీదారుల ద్వారా యంత్రాలను నమోదు చేయడానికి ప్రత్యేక విధానాన్ని గత సంవత్సరం నోటిఫై చేశారు. ఇప్పటికే ఉన్న ప్యాకింగ్ మెషీన్ల వివరాలు, కొత్తగా ఇన్‌స్టాల్ చేసిన మెషీన్‌లతో పాటు ఈ మెషీన్ల ప్యాకింగ్ సామర్థ్యం ఫారమ్ GST SRM-Iలో ఇవ్వాలి. అయితే, దీనికి ఎలాంటి జరిమానా విధించలేదు. పాన్ మసాలా, గుట్కా లాంటి ఉత్పత్తులకు సంబంధించిన యంత్రాలను నమోదు చేయాలని జిఎస్‌టి కౌన్సిల్ గత సమావేశంలో నిర్ణయించినట్లు రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు, తద్వారా వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని మనం గమనించవచ్చు. అయితే నమోదు చేయడంలో విఫలమైనందుకు ఎలాంటి జరిమానా విధించలేదని మల్హోత్రా పిటిఐకి తెలిపారు. అందువల్ల కొంత శిక్ష విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకోసమే ఫైనాన్స్ బిల్లులో యంత్రాలు నమోదు చేయకుంటే రూ.లక్ష వరకు జరిమానా విధించే నిబంధన పెట్టారు. పాన్ మసాలా, గుట్కా వ్యాపారంలో పన్ను ఎగవేతలను అరికట్టేందుకు గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ఆర్థిక మంత్రుల కమిటీ నివేదికను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. పాన్ మసాలా, చూయింగ్ పొగాకు ఉత్పత్తులపై పరిహారం సెస్ విధించే విధానాన్ని మొదటి దశ ఆదాయ సేకరణను పెంచడానికి ప్రకటన విలువ నుండి నిర్దిష్ట రేటు ఆధారిత లెవీకి మార్చాలని GOM (మంత్రుల బృందం) సిఫార్సు చేసింది.

 

*స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
బంగారం ప్రియులకు శుభవార్త. ఆదివారం తగ్గిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఫిబ్రవరి 5) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100గా ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల ధర రూ.63,380 గా ఉంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,250 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,530గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100గా.. 24 క్యారెట్ల ధర రూ.63,380గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.58,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.64,040గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.63,380గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,380గా ఉంది. నేడు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం కిలో వెండి ధర రూ.75,500లుగా కొనసాగుతోంది. నేడు ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,500గా ఉంది. ముంబైలో రూ.75,500 ఉండగా.. చెన్నైలో రూ.77,000గా కొనసాగుతోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,000లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,500 ఉంది.