NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం:
ఏపీ, యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం (జూన్ 26) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతా­వరణ నిపుణులు అంటున్నారు. ఈ అల్పపీడనం బలపడుతూ.. ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. అదే రోజున అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురవన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు వాతావరణం ఏర్పడనుంది.

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన:
రెండు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మంగళ, బుధవారాల్లో పర్యటించనున్నారు. దీంతో కుప్పంలో కోలాహల వాతావరణం నెలకొంది. సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనకు అధికారులు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేశారట. తొమ్మిది పర్యాయాలు ఎమ్మెల్యేగా కుప్పం నుంచి గెలుస్తున్న చంద్రబాబు నాయుడు.. నాలుగోసారి సీఎం పదవిని అధిష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన చంద్రబాబు.. తన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలపనున్నారు. అంతేకాకుండా తన సొంత నియోజకవర్గానికి భారీ నిధులు, హామీల వర్షం కురిపించనున్నారని తెలుస్తోంది.

రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె:
సోమవారం మధ్యాహ్నం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చలు అసంపూర్ణంగా మారడంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగనుంది. నిన్న సాయంత్రం దాదాపు మూడున్నర గంటల పాటు DME వాణితో చర్చలు జరిపారు. కానీ ఆ చర్చలు కూడా విఫలమయ్యాయి. యథాతథంగా సమ్మె కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు తెలిపారు. కొన్ని సమస్యల పరిష్కారించేందుకు ప్రభుత్వం సానుకూల స్పందించింది. కానీ అన్ని డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని జూడాలు తెలిపారు. సమ్మెతో ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా వైద్యులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం ఇవ్వాళ జూడాలతో మరోసారి చర్చలకు వెళ్లే అవకాశం ఉంది. నెలనెలా ఉపకార వేతనాలు చెల్లించడమే కాకుండా దీర్ఘకాలికంగా ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.

నీట్ పేపర్ లీస్ కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ఛాన్స్:
దేశవ్యాప్తంగా నీట్ ఎంతటి సంచలనం అయిందో తెలిసిందే. రోజుకో చోట పరీక్షపై నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వంపై విద్యార్థులు దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కూడా నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టే ప్రసక్తే లేదని చెబుతోంది. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా యాక్టివ్ మోడ్‌లోకి వచ్చింది. ఈ మొత్తం విషయానికి సంబంధించి ఈడీ త్వరలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ పాత కేసుల్లో అరెస్ట్‌లు చేస్తోందని, వారి నెట్‌వర్క్‌లు, మనీలాండరింగ్ లింక్‌లపై విచారణ జరుపుతోంది.

ఢిల్లీలో అగ్నిప్రమాదం:
ఢిల్లీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రేమ్‌నగర్‌లోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పొగలో ఊపిరాడక భర్త, భార్య, ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారు. తొలుత ఇన్వర్టర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రేమ్ నగర్‌లోని ఓ ఇంట్లో మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం మొదటి అంతస్తులో ఉంచిన ఇన్వర్టర్‌లో మొదట మంటలు చెలరేగగా మంటలు సోఫాలోకి చేరాయి. మంటలు వ్యాపించడంతో పై అంతస్తులో పొగలు కమ్ముకున్నాయి. పై అంతస్తులో నిద్రిస్తున్న కుటుంబం మొత్తం మృతి చెందింది.

డబుల్ ఇస్మార్ట్ ‘మ్యూజిక్ జాతర’ లోడింగ్:
ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను దర్శకుడు పూరీజగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారు. ప్రమోషన్లో భాగంగా ఊర మాస్ పటాక సాంగ్ రెడీ అంటూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే మ్యూజిక్ జాతర లోడింగ్ అంటూ ట్వీట్ చేసారు.

ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం:
టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్‌-8 చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియా.. అజేయంగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. భారత్ నిర్ధేశించిన 206 పరుగుల ఛేదనలో ఆసీస్‌ 7 వికెట్లకు 181 పరుగులే చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (76; 43 బంతుల్లో 9×4, 4×6) మరోసారి భారత్‌ను బయపెట్టగా.. మిచెల్‌ మార్ష్‌ (37; 28 బంతుల్లో 3×4, 2×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌ (2/24), అర్ష్‌దీప్‌ సింగ్ (3/37)లు రాణించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోహిత్‌ శర్మ (92; 41 బంతుల్లో 7×4, 8×6) సెంచరీ మిస్ అయ్యాడు.