నాపై ఆరోపణలు చేస్తే మీ ఇంటికొస్తా:
వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నుంచే తాను పోటి చేస్తా అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి, టీడీపీ మహిళా నేత సుధారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి రెండు స్దానాలు అవుతాయిని, ఖచ్చితంగా తాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోటీ చేస్తానన్నారు. అవీనితి చేసిన చెవిరెడ్డి చట్టప్రకారం జైలుకు పోతాడన్నారు. చెవిరెడ్డి, ఆయన సతీమణి ఆస్తుల వివరాలను ఇంటింటికి కరపత్రాలు చేసి పంచుతానని హెచ్చరించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద చెవిరెడ్డికి సుధారెడ్డి బహిరంగంగా ఫోన్ చేయగా.. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మీడియాతో మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సుధారెడ్డి సవాల్ విసిరారు.
ఆ పాపం జగన్ రెడ్డిదే:
విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యుల ప్రశ్నలకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, పెంచదని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారన్నారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నలు అడగడం ఒక వింత పరిస్థితి అని మంత్రి గొట్టిపాటి విమర్శించారు.
ఏటీఎం చోరీ కేసులో ట్విస్ట్:
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో ఏటీఎం చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఏటీఎం చోరీకి ప్రయత్నించిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తేలింది. మంటలను చూసి అక్కడ నుంచి పరారైన దుండగులు.. మహేశ్వరం మండలంలోని రావిర్యాలలోని SBI ఏటిఎంలో చోరీ చేసిన దుండగులే ఈ చోరీకి యత్నయించినట్లు పోలీసులు గుర్తించారు. మైలార్దేవ్పల్లి కంటే 30 నిమిషాల ముందు రావిర్యాలలో ఏటీఎంని గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి సుమారు 30 లక్షల రూపాయల వరకు ఎత్తుకెళ్లారు దుండగులు. అయితే, కార్ లో పరార్ అవుతూ మార్గమద్యంలో SBI ఏటీఎంలో చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు దుండగులు. కాగా, హర్యానా రాష్ట్రానికి చెందిన మేవత్ గ్యాంగ్ గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. చోరీకి పాల్పడిన వారిని పట్టుకునేందుకు రాచకొండ, సైబరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఎయిర్పోర్ట్ భూసేకరణ సర్వేను అడ్డుకున్న రైతులు:
వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. ఎయిర్ పోర్ట్ కు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అలాగే, తమ భూములకు న్యాయపరమైన పరిహారాన్ని చెల్లించాలని ఆందోళనకు దిగారు. దీంతో పాటు నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని గుంటూరు పల్లి రైతుల డిమాండ్ చేశారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మహిళలు భారీగా పాల్గొన్నారు. ఇక, సర్వే కోసం వచ్చిన ఆర్డీవోను అడ్డుకుని ఇప్పుడు సర్వే చేయొద్దని గుంటూరు పల్లి వసూలు కోరారు. అయితే, నిరసన జరిగే ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్:
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మరికొందరికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఇక మావోల శిబిరాన్ని డీఆర్‌జీ సైనికులు ధ్వంసం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తారి జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఖల్లారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదగిరి అడవుల్లో ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. కొండ ప్రాంతంలో 25 నుంచి 30 మంది మావోలు ఉన్నట్లు సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
అయోధ్యపై దాడికి ప్లాన్:
అయోధ్య రామమందిరంపై దాడికి కుట్ర పన్నిన ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన రెహ్మాన్(17)ను హర్యానా-గుజరాత్ పోలీసుల బృందం అరెస్ట్ చేశారు. రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లతో రామమందిరాన్ని పేల్చాలని ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో రెహ్మాన్‌కు సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రెహ్మాన్.. మాంసం దుకాణంతో పాటు ఆటో నడిపిస్తున్నాడు. హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని స్థానిక కోర్టులో హాజరు పరిచారు. రెహ్మాన్‌ను 10 రోజులు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ కొంతకాలంగా అయోధ్యపై దాడికి కుట్ర పన్నినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. రెహ్మాన్.. ఇస్లామిక్ సమావేశాల్లో కూడా పాల్గొన్నట్లు గుర్తించారు. 2024, జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభమైంది. ఆ సమయంలో రెహ్మాన్ అనేక రౌండ్లు వేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా నిఘా కూడా ఉంచినట్లు కనిపెట్టారు. ఇక్కడ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్థాన్ ఐఎస్ఐతో పంచుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా:
మహారాష్ట్రలో ఓ సర్పంచ్ హత్య కేసు కూటమి ప్రభుత్వంలో రాజకీయ దుమారం రేపింది. బీడ్ జిల్లాలో డిసెంబర్ 9న సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్(45) హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఫిబ్రవరి 27న పోలీసులు ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. ఇందులో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే సన్నిహితుడి పేరు ఉంది. అంతేకాకుండా మంత్రిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. దీంతో ధనంజయ్ ముండేను రాజీనామా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశించారు. ధనంజయ్ ముండే రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపించారు. వెంటనే దేవేంద్ర ఫడ్నవిస్ ఆమోదించి.. గవర్నర్ రాధాకృష్ణన్‌కు పంపించారు.
యూపీ మహిళకు ఉరిశిక్ష అమలు:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో భారత మహిళకు ఉరిశిక్ష అమలైంది. చిన్నారి మృతి కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ మహిళ షహజాది ఖాన్‌ను ఉరితీసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాకు చెందిన ముప్పై మూడేళ్ల మహిళ నాలుగు నెలల చిన్నారిని చంపిన ఆరోపణపై అబుదాబిలో మరణ శిక్షను ఎదుర్కొన్నది. యుఎఇ చట్టాలు, నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 15, 2025న షహజాదీ ఖాన్‌ను ఉరితీశారని విదేశాంగ మంత్రి కోర్టుకు తెలిపారు. కూతురు కోసం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. షహజాది ఖాన్ ఉరిశిక్ష గురించి ఫిబ్రవరి 28న యుఎఇలోని భారత రాయబార కార్యాలయానికి అధికారిక సమాచారం అందిందని అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) చేతన్ శర్మ తెలిపారు.
ఇజ్రాయెల్-జోర్డాన్ బోర్డర్‌లో కాల్పులు:
జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వ్యక్తిపై ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కేరళలోని తిరువనంతపురం జిల్లాకు చెందిన 47 ఏళ్ల థామస్ గాబ్రియేల్ మరణించాడు. గాబ్రియేల్.. కేరళలో రిక్షా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. టూరిస్ట్ వీసా మీద జోర్డాన్‌కు వెళ్లాడు. అక్కడ నుంచి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిపై కాల్పులు జరపగా.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని స్వస్థలం తీసుకొచ్చేలా సాయం చేయాలని కేంద్రాన్ని గాబ్రియేల్ కుటుంబ సభ్యులు కోరారు.
రేలంగి మావయ్యగా సూపర్ స్టార్ రజినీకాంత్:
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి పరిచయం అక్కర్లేదు. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో డైరెక్టర్‌గా సూపర్ హిట్ అందుకున్న అయిన దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని ఏకంగా మహేష్ బాబు-వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే క్లాసిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలు మహేష్ బాబుతో ఇలాంటి సినిమా ట్రై చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇక బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను ఇప్పటికి టీవీలో, యూట్యూబ్‌లో చూస్తూనే ఉన్నారు ఆడియన్స్. అయితే ఈ మూవీని మార్చి 7 రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా, పాత వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చి ఫ్యాన్స్‌ని ఆశ్చర్య పరుస్తుంది. ఈ వీడియో లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రేలంగి మామయ్య పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘ఇంత కీలకమైన రేలంగి మావయ్య క్యారెక్టర్‌ని అంతకంటే ఎక్కువ ఇమేజ్ ఉన్న స్టార్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో రజని అయితే బాగుంటుందని దిల్ రాజు తో చెప్పాను. శంకర్ రికమండేషన్ ద్వారా ఆయన అపాయింట్మెంట్ దొరికింది. ఆయనను కలవడానికి నేను చెన్నై వెళ్లాను. ముందు మేకప్ లేకుండా వచ్చిన రజని చూసి ఠక్కున గుర్తుపట్టలేదు. ఆయన ఒక గంట టైం ఇచ్చారు కథ చెప్పాను ఆయనకు బాగా నచ్చింది. కానీ ఆ టైం లో అనారోగ్యం కారణంగా రజనీకాంత్ నో అన్నారు’ అని శ్రీకాంత్ తెలిపారు. ప్రజంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
50 రోజులు పూర్తి చేసుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’:
విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ఇప్పటివరకు రూ. 303 Cr+ గ్రాస్ దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా చరిత్రలో తన పేరును లిఖించింది. సీనియర్ నటులలో రూ. 300 కోట్ల గ్రాసర్‌ను అందించిన మొదటి హీరోగా వెంకీ మరో రికార్డు నెలకొల్పాడు. హిట్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన, సంక్రాంతికి వస్తున్నాం హాస్యం, భావోద్వేగం మరియు సాపేక్షమైన కథనాన్ని మిళితం చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే కథలు రాయడంలో అనిల్ రావిపూడి యొక్క నేర్పు మరోసారి ఫలించింది. తాజాగా ఈ సినిమా మరో రేర్ ఫీట్ సాధించింది. కనీసం రెండు లేదా మూడు వారాలు ఆడితే గగనం అవుతున్న ఈ రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం 50 రోజుల థియేట్రీకల్ రన్ ఫినిష చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 92 సెంటర్స్ లో ఈ సినిమా అర్ధశత దినోత్సవ వేడుక చేసుకుంటుంది. అటు నిర్మాతలు, ఇటు పంపిణీదారులు మరియు ఎగ్జిబిటర్లకు కనివిని ఎరుగని స్థాయిలో తెలుగు సినిమా చరిత్రలో అత్యంత లాభదాయకమైన వెంచర్‌లలో ఒకటిగా నిలిచి రికార్డుల కెక్కింది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా సంక్రాంతికి వస్తున్నాం లాభాల పంట పండించింది. ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందోనని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
దుబాయ్ మా సొంతగడ్డ కాదు:
దుబాయ్ తమ సొంతగడ్డ కాదు అని, ఇక్కడ భారత్ ఎక్కువ మ్యాచ్‌లేమీ ఆడలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దుబాయ్ పిచ్ ప్రతిసారీ భిన్న సవాళ్లను విసురుతోందని, తాము ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కోసారి ఒక్కో రకంగా స్పందించిందన్నాడు. దుబాయ్ మైదానంలో నాలుగు పిచ్‌లు ఉన్నాయని, సెమీ ఫైనల్ దేనిపై ఆడిస్తారో తెలియదని హిట్‌మ్యాన్ చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఒకే మైదానంలో ఆడుతోందని, భారీ లాభం పొందుతోందని కొందరు మాజీలు, క్రికెటర్లు అంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో సెమీస్ పోరుకు ముందు మీడియా సమావేశంలో రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘దుబాయ్ పిచ్ భిన్న సవాళ్లను విసురుతోంది. భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కో రకంగా స్పందించింది. దుబాయ్ మా సొంతగడ్డ కాదు. మేం ఇక్కడ ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదు. మాకూ ఈ మైదానం కొత్తే. ఇక్కడ నాలుగు పిచ్‌లు ఉన్నాయి. సెమీ ఫైనల్ ఏ పిచ్‌పై ఆడిస్తారో తెలియదు. అయితే ఎక్కడ ఆడినా.. పరిస్థితులకు తగ్గట్లు అన్వయించుకోవడం కీలకం. సెమీస్‌లో ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. ఆస్ట్రేలియా మంచి ప్రత్యర్థి. కఠిన సవాల్ తప్పదు. గత మూడు మ్యాచ్‌లలో ఎలా ఆడామో.. ఈ మ్యాచ్‌లోనూ అలానే ఆడతాం. న్యూజిలాండ్‌పై వరుణ్ చక్రవర్తి ప్రదర్శన చేశాడు. సెమీస్‌లోనూ నలుగురు స్పిన్నర్లతో ఆడాలన్న ఉత్సాహం కలుగుతోంది. కూర్పు పరంగా తలనొప్పి తప్పదు. అన్నీ ఆలోచించి సరైన కూర్పుతోనే బరిలోకి దిగుతాం’ అని రోహిత్ శర్మ చెప్పాడు.