మిర్చి యార్డ్‌లో 14 మిర్చి టిక్కీలు మాయం:
గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతులకు చెందిన 14 మిర్చి టిక్కీలు మాయం అయ్యాయి. మిర్చి యార్డ్‌కు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చిన సమయంలో మిర్చి బస్తాలు మెట్టు కట్టిన చోట తోపులాట జరిగింది. భయంతో రైతులు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. కాసేపటికి తమ బస్తాల వద్దకు వచ్చి చూసుకున్న రైతులకు షాక్ తగిలింది. ఇద్దరు రైతులకు చెందిన 14 మిర్చి టిక్కీలు మాయమయ్యాయి. మిర్చి టిక్కీలు మాయమవడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. గుంటూరు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు సానుగంటి చైతన్య మిర్చి టిక్కీలు దొంగిలించినట్లు యార్డ్ అధికారులు గుర్తించారు. చైతన్య ఇసుజు ట్రక్కులో మిర్చి టిక్కీలు తీసుకెళ్తున్నట్లు యార్డ్ సీసీటీవీలలో కనబడింది. రెండు రోజుల క్రితం సరుకు అమ్ముకోవడానికి గుంటూరు మిర్చి యార్డ్‌కు పల్నాడు జిల్లా వెల్దుర్దికి చెందిన నారాయణ, వెంకట సుబ్బయ్య అనే రైతులు వచ్చారు. నారాయణ, వెంకట సుబ్బయ్యకు చెందిన 14 మిర్చి టిక్కీలను చైతన్య ఎత్తుకెళ్లాడు.
ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతుల దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. తమ హయాంలో వ్యవసాయం ఓ పండగలా మారిందని, రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నేడు గుంటూరు మిర్చి యార్డ్‌కు జగన్ వచ్చారు. మిర్చి రైతుల కష్టాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ:
సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలో జరుగుతున్న లింగమంతుల జాతరలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం సెక్యూలర్ విధానాన్ని పాటిస్తుందని, అన్ని మతాలను గౌరవిస్తుందని పేర్కొన్నారు. మాది సెక్యూలర్ ప్రభుత్వమని, మాకు అన్ని పండుగలు సమానమేనని అన్నారు. ప్రజలందరికీ సమాన న్యాయం అందించడమే మా ధ్యేయం అని తెలిపారు.
ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం:
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భారత దేశానికి అపారమైన సేవలు అందించిన శివాజీ మహారాజ్ వీరత్వం, పరిపాలనా నైపుణ్యం స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి అర్పించారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, పరిపాలనా విధానాలు నేటితరానికి మార్గదర్శకంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సేవలో ప్రతి నాయకుడు పని చేయాలని నేతలు సంకల్పం వ్యక్తం చేశారు.
ముస్తాబైన రాంలీలా మైదాన్:
దేశ రాజధాని కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి రాంలీలా మైదానం ముస్తాబైంది. ఏర్పాట్లను భారతీయ జనతా పార్టీ పూర్తి చేసింది. భద్రతా కారణాలతో గ్రౌండ్ ను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ హస్తగతం చేసుకుంది. రేపు మధ్యాహ్నం 12. 05 గంటలకు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్త సీఎం చేత చేయించనున్నారు. రాంలీలా మైదానంలో సుమారు 30 వేల మంది కూర్చునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే, మూడు పెద్ద స్టేజీలతో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయగా.. మెయిన్ స్టేజీ మీద ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ సీఎం కూర్చోనున్నారు.
5 రాష్ట్రాలకు కేంద్రం నిధుల విడుదల:
గత ఏడాది సంభవించిన విపత్తులు, వరదలకు సంబంధించిన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు (ఫిబ్రవరి 19) ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు రూ.1554.99 కోట్ల అదనపు సాయాన్ని ఆమోదించింది. 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాతో పాటు నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో సంభవించిన విపత్తులకుగానూ మోడీ సర్కార్ ఆయా రాష్ట్రాలకు విపత్తు సాయంపై అందజేసింది. ఏపీ, తెలంగాణలో ఆకస్మిక వరదలు రావడంతో పాటు కొండ చరియలు విరిగి పడటం లాంటి ప్రకృతి విపత్తులు జరిగిన మిగితా మూడు రాష్ట్రాలకు కలిపి నిధులు రిలీజ్ చేసింది. తాజాగా, కేంద్ర ప్రభుత్వం అదనంగా కేటాయించిన మొత్తం నిధులు రూ. 1554.99 కోట్లలో ఏపీకి రూ. 608.08 కోట్లు, తెలంగాణకు రూ. 231. 75 కోట్లు.. త్రిపురకు రూ. 288.93 కోట్లు, ఒడిశాకు రూ. 255.24 కోట్లు, నాగాలాండ్ కు 170. 99 కోట్ల రూపాయలను విడుదలకు నిర్ణయం తీసుకుంది. కాగా, గతేడాది వరదలు, విపత్తు కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు ఇప్పటికే కొన్ని నిధులు విడుదల చేయగా.. నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించి నివేదికలు ఇచ్చిన మరో ఐదు రాష్ట్రాలకు అదనంగా నిధులను కేటాయించింది. అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కార్ SDRFలో భాగంగా 27 రాష్ట్రాలకు రూ. 18,322.80 కోట్లు విడుదల చేయగా.. NDRF కింద 18 రాష్ట్రాలకు రూ. 4,808.30 కోట్లు రిలీజ్ చేసింది.
బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని షేక్ హసీనా ప్రతిజ్ఞ:
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను త్వరలో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా.. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించింది. తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు ముహమ్మద్ యూనస్ ఒక టెర్రరిస్ట్ అంటూ ఆరోపించారు. గతేడాది ఆగస్టు 5వ తేదీన వారు నన్ను చంపడానికి యత్నించారని చెప్పారు.. కానీ, నేను బతికి బయటపడ్డాను అని ఆమె పేర్కొన్నారు. బంగ్లాలో అలర్లపై వేసిన అన్ని విచారణ కమిటీలను యూనస్ క్యాన్సిల్ చేశాడని చెప్పుకొచ్చింది. తనకు ఎదురు తిరిగిన వారిని చంపడానికి టెర్రరిస్టులను విడుదల చేశాడు.. వారు ఇప్పుడు బంగ్లాదేశ్‌ను సర్వ నాశనం చేస్తున్నారు.. ఈ ఉగ్రవాదుల ప్రభుత్వాన్ని గద్దె దించాలని డిమాండ్ చేసింది. అవామీ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సహాయం చేసేందుకు చేయగలిగినదంతా చేస్తానని షేక్ హసీనా హామీ ఇచ్చింది.
భారత్కి 21 మిలియన్ డాలర్లు ఎందుకివ్వాలి:
భారత దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి అందిస్తున్న 21 మిలియన్ డాలర్ల సహయాన్ని ఇటీవల యూఎస్ నిలిపి వేసిన విషయం మన అందిరికి తెలిసిందే. ఈ నిర్ణయాలకు సంబంధించిన దస్త్రాలపై ప్రిసిడెంట్ ట్రంప్ మంగళవారం నాడు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అసలు ‘ఇండియాకు 21 మిలియన్ డాలర్ల సాయం ఎందుకివ్వాలి అని ప్రశ్నించారు. వాళ్ల దగ్గరే చాలా డబ్బులు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాపై వాళ్లు భారీగా ట్యాక్సులు వేస్తున్నారని ఆరోపించాడు. నాకు భారత దేశం అన్నా, ఆ దేశ ప్రధాని అన్నా గౌరవం ఉంది అని చెప్పుకొచ్చాడు.
రక్తదానం చేసిన మణిశర్మ:
తెలుగు చిత్రపరిశ్రమలో ఎవరెస్ట్ శిఖరం మెగాస్టార్ చిరంజీవి. వెండితెరపై నటనతో పాటు డాన్సులతోనూ అలరించే ఆయన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించి తన అభిమానుల సహకారంతో ఎనలేని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి మానస పుత్రిక అయిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఎందరో రక్తదానం చేస్తుంటారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ రక్తదానం చేసి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా మణిశర్మ రక్తదానం చేయటం ఇది రెండోసారి కావటం విశేషం.
అగ్ర హీరోలతో పోటీకి సిద్ధం అవుతున్న నవీన్:
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నవీన్ పొలిశెట్టి కూడా ఒకడు.పేరుకి హీరో అయినప్పటికి ‘జాతి రత్నాలు ’ మూవీలో తన కామెడీ టైమింగ్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, మంచి యాక్టర్ అనిపించుకున్నాడు. చివరిసారిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నవీన్ పొలిశెట్టి. ఈ మూవీ అనుష్క తో అతని కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.ఇక ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.ఇప్పటికే మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోమో, టీజర్‌లతో ఆకట్టుకున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడింది. అంతేకాదు రిలీజ్‌కి ముందే నాగ వంశీ ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసి సినిమాను ప్రాఫిట్ జోన్లో పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఈ మూవీ రైట్స్ ఎంత ధర పలికాయి అన్న విషయం మాత్రం బయటకు రాలేదు. ఇక తాజాగా ఈ మూవీపై ఒక రూమర్ వినిపిస్తుంది. ఏంటంటే ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో రిలీజ్‌కి రాబోతుందట. ఆల్రెడీ ఈ రేస్ లో ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్ర తారల సినిమాలు కూడా ఉన్నాయి. దీని బట్టి నవీన్ చేస్తుంది పెద్ద సాహసం అనే చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో.
దెబ్బకి దిగొచ్చిన పాక్:
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆథిత్యం వహిస్తుంది. ఈ మెగా టోర్నీ నేటి నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఈ ఈవెంట్ కు ముందు ఇటీవల కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ ఘటన వివాదానికి దారి తీసింది. దీంతో భారత జాతీయ జెండాను ఆ స్టేడియంలో ప్రదర్శించకపోవడంతో పాక్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దెబ్బకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. ఇక, దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ స్టేడియంలో ఇండియన్ ఫ్లాగ్ ను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. అయితే, ఇటీవల కరాచీ స్టేడియంలో అన్ని జట్ల జాతీయ పతాకలను ప్రదర్శించగా.. అందులో భారత జెండా లేదు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాక్ తీరుపై పలువురు మండిపడ్డారు. దీనిపై పీసీబీ రియాక్ట్ అయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్‌లు ఆడటానికి పాక్‌కు భారత్ రావట్లేదు. కరాచీ, రావల్పిండి, లాహోర్ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడుతున్న టీమ్స్ జెండాలను మాత్రమే ఎగుర వేశామని తేల్చి చెప్పింది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్ జెండాను కూడా పాక్ ప్రదర్శించలేదని పేర్కొనింది. దీనిపై పీసీబీ అధికారికంగా ప్రకటన చేయాల్సిన అవసరం లేదని బోర్డు వర్గాలు తెలిపాయి.