NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

తెరుచుకున్న ఏపీఎండీసీ కార్యాలయం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ), మైనింగ్ డైరెక్టర్ కార్యాలయాలు తెరుచుకున్నాయి. మైనింగ్ శాఖ ఇంఛార్జి బాధ్యతలను సోమవారం యువరాజ్ చేపట్టగా.. ఈ రోజు రెండు కార్యాలయాలు తెరవటానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మైనింగ్ డైరెక్టర్ కార్యాలయం ఓపెన్ చేయగా.. ఉద్యోగులు విధుల్లో చేరారు. మరోవైపు ఏపీఎండీసీ కార్యాలయం కొద్దిసేపట్లో ఓపెన్ కానుంది. విధుల్లో చేరేందుకు ఉద్యోగులు కార్యాలయం ముందు ఎదురు చూస్తున్నారు. జూన్ 9న ఏపీఎండీసీ, మైనింగ్ డైరెక్టర్ కార్యాలయాలను సీఐడీ సీజ్ చేసిన విషయం తెలిసిందే. మైనింగ్ శాఖ కీలక డాక్యుమెంట్లు బయటకు వెళ్తాయనే సమాచారంతో సీఐడీ రెండు కార్యాలయాలను సీజ్ చేసింది. అప్పటి నుంచి సిబ్బంది విధుల్లోకి రాలేదు.

ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ:
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. నేడు తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలతో పవన్ సమావేశం అయ్యారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు, అసెంబ్లీ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలకు జనసేనాని అవగాహన కల్పించారు. వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్.. దీక్షా వస్త్రాలు ధరించి ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో పవన్ భేటీ అయ్యారు. సభలో రూల్ పొజిషన్, జీరో అవర్, ప్రశ్నోత్తరాలు, బిల్లుల ఆమోదం వంటి సాంకేతిక అంశాలను జనసేన ఎమ్మెల్యేలకు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. సభకు వచ్చే ముందు నియోజకవర్గంలో సమస్యలను అధ్యయనం చేసి రావాలని ఎమ్మెల్యేలకు పవన్ సూచనలు చేశారు.

ఆషాఢ మాసం బోనాలకు పకడ్బందీ ఏర్పాట్లు:
బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో అమ్మవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, గతంలో జరిగిన ఇబ్బందులు పునరావృతం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఇప్పటికే పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. నగరంలో బోనాల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా:
ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. పార్టీ మారే ఆలోచన ఇప్పటివరకు ఐతే లేదని, బీజేపీ నుంచి ఎవరు తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు. తన నిర్ణయం తాను తీసుకోవాలని తనకు పార్టీ నుంచి సంకేతం అందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి శ్రీధర్ బాబు వచ్చి మాట్లాడారని, డిప్యూటీ సీఎం కూడా నాతో చర్చించారన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరిగేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానన్నారు. తనతో కాంగ్రెస్ ఇంచార్జీ మున్షీ మాట్లాడారని వెల్లడించారు. ఏ పార్టీ నుంచి తనకు కాల్స్ రాలేదని తెలిపారు. సోమవారం మంత్రి శ్రీధర్ బాబు,విప్ లు ధర్మపురి వేములవాడ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయి తొందరపడద్దని బుజ్జగించే ప్రయత్నం చేశారు.

శ్రీ చైతన్య హాస్టల్లో విద్యార్థి అనుమానాస్పద మృతి:
కొంపల్లిలోని శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్లో ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. శ్రీ చైతన్య పాఠశాల K4 క్యాంపస్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న మల్లికార్జున్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఆ విద్యార్థి నిన్ననే హాస్టల్లో చేరాడు. ఈరోజు ఉదయం శవమైకనిపించాడు. నిన్న రాత్రి భోజనం చేసి నిద్ర పోయిన విద్యార్థి.. ఉదయం నిద్ర లేకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హాస్టల్ వార్డన్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. విద్యార్థికి హార్ట్ ఎటాక్ వచ్చిందని స్కూలు సిబ్బంది అంటున్నారు. మృతుడు మెదక్ జిల్లా చిలువేరు గ్రామానికి చెందిన మల్లికార్జున్ గా పేర్కొన్నారు.

యువతి ప్రేమను నిరాకరించడంతో ఆర్మీ జవాన్ ఆత్మహత్య:
వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లిలో విషాదం నెలకొంది. కుంట చింటూ (20) అనే ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతి తన ప్రేమను నిరాకరించడంతో మనస్థాపం చెంది.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుండాల్ గ్రామానికి చెందిన యువతికి తను ప్రేమిస్తున్నట్లు చింటూ తెలిపాడు. చింటూ తనను ప్రేమిస్తున్న విషయాన్ని ఆ యువతి తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కొత్తపల్లి గ్రామానికి వెళ్లిన యువతి కుటుంబీకులు చింటూని బెదిరించి వెళ్ళిపోయారు. గ్రామంలో తన తండ్రి పరువు పోయిందని మనస్థాపానికి గురై.. గ్రామ శివారులోని తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2023లో ఇండియన్ ఆర్మీలో సెలక్టై బెంగళూరులో శిక్షణ పూర్తి చేశాడు చింటు. గుజరాత్ లో ఉద్యోగంలో జాయిన్ కావలసి ఉండగా.. సెలవుపై గ్రామానికి వచ్చాడు. చింటూ మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

సలార్ బుకింగ్స్ దాటేసిన కల్కి:
ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. ప్రభాస్ కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన కొన్ని నిముషాల్లోనే చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. గత ఏడాది వచ్చిన సలార్ అడ్వాన్సు బుకింగ్స్ ను కల్కి రిలీజ్ ఒకరోజుకు ముందుగానే క్రాస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. దీనితో కల్కి సినిమాపై క్రేజ్ ఏ రేంజ్ లో వుందో తెలుస్తుంది.

సెమీస్‌కు చేరిన అఫ్గాన్‌.. ఆస్ట్రేలియా ఔట్:
టీ20 ప్రపంచకప్‌ 2024లో పసికూన అఫ్గానిస్థాన్‌ సంచలనం సృష్టించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన సూపర్‌-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఊహించని విజయం సాధించింది. బంగ్లాను 105 పరుగులకే ఆలౌట్‌ చేసి.. 8 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం) విజయం సాధించింది. ఈ విజయంతో నేరుగా గ్రూప్‌ 1 నుంచి అఫ్గాన్‌ సెమీస్‌ చేరింది. అఫ్గాన్‌ విజయంతో సెమీస్‌ రేసు నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఇప్పటికే గ్రూప్‌ 1 నుంచి భారత్‌ నాకౌట్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇదే గ్రూప్‌లో ఉన్న బంగ్లా కూడా ఇంటిదారి పట్టింది.

టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ షెడ్యూల్ ఇదే:
టీ20 ప్రపంచకప్‌ 2024 సెమీస్‌లో ఆడే జట్లు ఏవో తేలిపోయాయి. సూపర్‌-8 గ్రూప్‌ 2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ చేరుకోగా.. తాజాగా సూపర్‌-8 గ్రూప్‌ 1 నుంచి భారత్, అఫ్గానిస్థాన్‌ సెమీస్‌కు అర్హత సాధించాయి. టీ20 ప్రపంచకప్‌ 2024 తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో అఫ్గానిస్థాన్‌ తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ గురువారం (జూన్ 27) ఉదయం 6 గంటలకు ఆరంభం అవుతుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ మ్యాచ్ జరగనుంది. ఇక రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లండ్ టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గురువారం రాత్రి 8 గంటలకు గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో స్టార్ అవుతుంది. సెమీస్‌లలో గెలిచిన జట్లు జూన్ 29న ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.