*ఫిబ్రవరి 8 వరకు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యాయి. ఇవాళ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశమైంది. ఈ బీఏసీ సమావేశంలో నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 8 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నేడు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశమైంది. 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. బుధవారం (ఫిబ్రవరి 7న) అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీఏసీ సమావేశం అనంతరం స్పీకర్‌తో సీఎం జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. బీఏసీ సమావేశాన్ని టీడీపీ బాయ్‌కాట్ చేసింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఏసీని టీడీపీ బహిష్కరించింది.టీడీపీ సభ్యులు లేకుండానే బీఏసీ సమావేశం జరిగింది.
*మేడారం బెల్లం మొక్కులకు ఆబ్కారీ ఆంక్షలు.. కొనాలంటే ఆధార్ తప్పనిసరి…
మేడారం జాతరలో బెల్లం కొనుగోలు చేసే వారి నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ నిబంధనలు రూపొందించింది. ఆధార్ కార్డుతో పాటు బెల్లం కొనుగోలుదారులు ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, బెల్లం బెల్లం ఎందుకు కొనుగోలు చేస్తున్నారో తెలిపే పూర్తి వివరాలతో ప్రతిరోజు జిల్లా అధికారులకు నివేదిక పంపాలని ఆదేశించారు.ఈ మేరకు జిల్లా అధికారుల నుంచి బెల్లం వ్యాపారులకు ఉత్తర్వులు అందాయి. మేడారం జాతర సందర్భంగా నెలకు 40 నుంచి 50 టన్నుల వ్యాపారం జరుగుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి ఇక్కడికి ఎక్కువగా బెల్లం రవాణా అవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మేడారం జాతర పేరుతో దాదాపు వెయ్యి టన్నుల బెల్లం వ్యాపారం సాగుతుందని అంచనా. అక్కడి నుంచి బెల్లం పక్కదారి పట్టే అవకాశం ఉండడంతో ఎక్సైజ్ శాఖ బెల్లం విక్రయాలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. జాతర సమీపిస్తుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దఎత్తున బెల్లం తెప్పించి ఎక్కడికక్కడ హోల్ సేల్ దుకాణాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సమ్మక్క మొక్కులకు అధిక బంగారంగా కొంత బెల్లం, గుడుంబా తయారీకి కొందరికి సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కొన్నిచోట్ల బెల్లం పట్టుబడిన ఘటనలు కూడా దందాకు నిదర్శనం. డిసెంబర్ 25న నర్సంపేట-నెక్కొండ రహదారిలోని అమీన్ పేట వద్ద 15 క్వింటాళ్ల బెల్లంను పోలీసులు పట్టుకున్నారు. జనవరి 9న దత్తపల్లిలో 30క్వింటాళ్ల బెల్లం, 50కిలోల పటికను, 10న మరిపెడ మండల కేంద్రంలో 17క్వింటాళ్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు.జనవరి 23న నర్సింహులపేట మండలం వంతడపాల స్టేజీ వద్ద కూడా 20 క్వింటాళ్ల బెల్లం పట్టుబడింది. బెల్లం దందా జోరుగా సాగుతున్నందునే ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడారం సమ్మక్క-సారలమ్మకు భక్తులు సమర్పించే బంగారంపై ఆధార్‌కార్డు జిరాక్స్ సమర్పించాలనే నిబంధన ఎత్తివేయాలని ములుగు జిల్లా సామాజికవేత్త సుతారి సతీష్ డిమాండ్ చేశారు.బెల్లం పక్కదారి పట్టకుండా కొనుగోలుదారుల నుంచి ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశిస్తే జాతరకు భక్తులు దూరమవుతారన్నారు.భక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వారి జీవితాలకు ఆటంకం కలిగించడం సరికాదని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని, విచ్చలవిడిగా బెల్లం విక్రయాలపై నిఘా ఉంచాలని కోరారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు.
*అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి గవర్నర్ ప్రసంగించారు. విజయవాడలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని.. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టిందని.. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. రైతుల, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్థికంగా లబ్ధిపొందారని గవర్నర్ ప్రసంగించారు. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించామన్నారు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని అసెంబ్లీలో గవర్నర్ తెలిపారు. స్కూళ్లలో మౌళిక సదుపాయాలు కల్పించామని.. నాడు-నేడు పథకంలో భాగంగా స్కూల్ మెయింటనెన్స్ ఫండ్ అందిస్తున్నామన్నారు. జగనన్న గోరుముద్ధ పథకం ద్వారా 16 రకాల వంటకాలను మధ్యాహ్న భోజనంలో పిల్లలకు అందిస్తున్నామన్నారు. జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు యూనిఫాం, బుక్స్ అందిస్తున్నామన్నారు. గోరుముద్ద పథకం కింద రూ.4,416 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. విద్యాకానుక కింద రూ.3367 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 294 ప్రభుత్వ బడులను అప్‌గ్రేడ్ చేశామన్నారు. 8,9 తరగతుల విద్యార్థులకు 9.5 లక్షల ట్యాబ్‌లు అందించామన్నారు. .. జగనన్న వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి 20 వేలు అందిస్తున్నామన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం తీసుకొచ్చామన్నారు. రూ.1,208 కోట్లతో 104, 108 వాహనాలు 1704 అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలోని 1.48 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నామన్నారు. 2019 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద 36 లక్షల మందికి లబ్ధి చేకూరిందని గవర్నర్ తెలిపారు. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసిందన్నారు. రైతులే రాష్ట్రానికి వెన్నెముక.. రైతులకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది.. వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 అందిస్తున్నామన్నారు.
*జగన్ అర్జునుడు.. అభిమన్యుడు కాదు..
ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఆయన తెలిపారు. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు మేనిఫెస్టో లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. మేనిఫెస్టోను వెబ్‌సైట్ నుండి తొలగించిన చంద్రబాబును ప్రజలు నమ్మరని మంత్రి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజల దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామన్నారు. సీట్లు అడుక్కోవడానికి చంద్రబాబు దగ్గరకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుని ఆయన వెంట వెళ్లొద్దన్నారు. జగన్ సక్సెస్ ఫుల్ సీఎం.. చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం అని ఆయన అన్నారు. మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. టీడీపీ, జనసేన ఇంకా సీట్లు కోసం కొట్టుకుంటున్నాయన్నారు. సీట్లు రాని వారు ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. బాలశౌరి అన్యాయాలు, అక్రమాలు చేశాడు కాబట్టే అక్కడ పడ్డాడని ఆయన విమర్శించారు. అందరిని ముంచిపోయాడని ఆయన ఆరోపించారు. జగన్ అర్జునుడు.. అభిమన్యుడు కాదని.. ప్రతిపక్షాల పద్మ వ్యూహాలను ఛేదించి బయటకు వస్తాడన్నారు. లోకేష్‌ను ఎక్కడ దాచేశారని.. జగన్ అర్జునుడు అనగానే వీళ్లకు ఎందుకు గుచ్చుకుందని ప్రశ్నించారు. వాళ్ళు చేస్తున్న దుష్ట చతుష్టయం పన్నాగాలు వివరించటానికే సీఎం అర్జునుడు, అభిమన్యుడు ప్రస్తావన తెచ్చారన్నారు.
*త్వరలో 500 ఎలక్ట్రిక్ బస్సులు.. తీరనున్న సీట్ల కొరత..
తెలంగాణలో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మి పథకంలో భాగంగా వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. దీంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ పథకం అమల్లోకి రాకముందు రోజుకు 12 లక్షల మంది మహిళలు మాత్రమే బస్సుల్లో ప్రయాణించేవారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత… ఆ సంఖ్య దాదాపు 30 లక్షలకు చేరింది. బస్సులు కిక్కిరిసి ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో గతంలో 4.50 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించగా, ఇప్పుడు వారి సంఖ్య రెట్టింపు అయింది. పురుషులే కాదు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు కూడా బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. అయితే త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందించింది. నగరంలో త్వరలో 500 ఎలక్ట్రిక్ సిటీ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల మార్చి నుంచి కొన్ని బస్సుల రాకపోకలు ప్రారంభమవుతాయని గ్రేటర్ జోన్ అధికారులు వెల్లడిస్తున్నారు. జూన్, జూలై నాటికి 500 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేస్తామని చెప్పారు. నగర ప్రయాణికులకు మెట్రో తప్పితే ఏసీ ప్రయాణం స్వర్గంగా మారింది. సిటీ బస్సుల్లో ఏసీ లేదు, సీటు కూడా దొరకదు. త్వరలో 500 ఎలక్ట్రిక్ బస్సులతో ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండదు. ఈ బస్సుల్లో ప్రయాణికులు సీట్లు పొందే అవకాశం ఉంది. పాస్ తీసుకున్న విద్యార్థులకు, జనరల్ పాస్ తీసుకున్న వారికి కూడా ఈ బస్సులను కేటాయించే అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో అందుబాటులోకి వస్తే.. కొన్ని కాలేజీలకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
*మే 10 నాటికి మాల్దీవుల నుంచి భారత సైన్యం వెళ్లి పోవాల్సిందే..
భారత్- మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాల కారణంగా సంబంధాలు రోజు రోజుకు క్షిణిస్తున్నాయి. అయితే, మాల్దీవుల వ్యవహారాలలో భారతదేశ ప్రభావాన్ని తగ్గించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జూ దృష్టి సారించాడు. అందులో భాగంగానే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత సైనికుల ఉనికి ప్రధాన వివాదాంశంగా ప్రస్తావించాడు. అయితే, ఇవాళ రాష్ట్రపతి హోదాలో మాల్దీవుల అధ్యక్షుడు ఆ దేశ పార్లమెంట్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మహ్మద్ ముయిజ్జూ మాట్లాడుతూ..తాన భారత వ్యతిరేక వైఖరికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. మాల్దీవుల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి ఏ దేశాన్ని అనుమతించేది లేదని తెలిపారు. మే 10 నాటికి భారత దళాలు మాల్దీవులను విడిచిపెట్టనున్నారు. కాగా, మాల్దీవులలో ఉన్న భారతీయ దళాలు మార్చి 10 నాటికి బయలు దేరుతాయి.. మిగిలిన సైనికులు మే 10 నాటికి పూర్తిగా ఈ దేశం వదిలి వెళ్లిపోతారని ప్రెసిడెంట్ ముయిజ్జూ వెల్లడించారు. అలాగే, న్యూఢిల్లీలో భారత్- మాల్దీవుల మధ్య జరిగిన సమావేశంలో బలగాల ఉపసంహరణపై ఇరు పక్షాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. మాల్దీవులకు మానవతా సేవలను అందించే భారతీయ విమానయాన సర్వీసులను ప్రారంభించడానికి రెండు దేశాలు పరస్పరం ఒప్పుకున్నాయి. అలాగే, భారత సైనికుల స్థానంలో పౌరులు ఉంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదించింది. ఇక, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరితో తీవ్ర విమర్శలకు దారి తీసింది. ముయిజ్జూ సర్కార్ చైనాకు అనుకూలంగా పని చేయడంతో తీవ్ర స్థాయిలో ఆ దేశ ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల భారతదేశంతో మాల్దీవుల సాంప్రదాయకంగా సన్నిహిత సంబంధాల పూర్తిగా దెబ్బ తినే ప్రమాదం ఉందని ఆరోపించారు. వెంటనే మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత్‌కు క్షమాపణ చెప్పాలని ఆ దేశ ప్రతిపక్షా పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
*పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దాడి.. 10 మంది పోలీసులు మృతి, ఆరుగురికి గాయాలు
ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రాజకీయ పార్టీలన్నీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సమయంలో పాకిస్థాన్‌లో పలు చోట్ల హింస, ఉగ్రవాద ఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి.. బలూచిస్థాన్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల పేలుడు ఘటన ఇంకా చల్లారలేదు.. మరోసారి ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో భీభత్సం సృష్టించారు. ఎన్నికలకు ముందు ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలోని పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు భారీ దాడికి పాల్పడ్డారు. సీనియర్ పోలీసు అధికారి అనిసుల్ హసన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఉగ్రదాడిలో పది మంది పోలీసులు మరణించగా, 6 మంది గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ ఆసుపత్రిలో చేర్పించారు. సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడ్డారని అధికారి తెలిపారు. ఈ సమయంలో గుర్తు తెలియని ఉగ్రవాదులు మొదట స్నిపర్ షాట్‌లు పేల్చి చౌదవాన్ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పోలీసులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో పాటు హ్యాండ్ గ్రెనేడ్‌లను ప్రయోగించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో స్వాబీ ఎలైట్ పోలీసు యూనిట్‌కు చెందిన ఆరుగురు పోలీసులు ఉన్నారని, ఎన్నికల సమయంలో స్థానిక పోలీసులకు సహాయం చేయడానికి ఈ ప్రాంతంలో మోహరించినట్లు చెబుతున్నారు. దాడి తర్వాత ఇక్కడ యంత్రాంగం అప్రమత్తమైంది. దక్షిణ వజీరిస్థాన్ గిరిజన జిల్లా, డేరా ఘాజీ ఖాన్‌కు వెళ్లే రహదారులపై భారీ శోధన ఆపరేషన్ నిర్వహించబడుతోంది. వచ్చే, వెళ్లే ప్రతి వ్యక్తిని నిశితంగా పరిశీలిస్తున్నారు. జూలై 4 ఆదివారం బలూచిస్తాన్‌లోని నుష్కీ జిల్లాలోని పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ECP) కార్యాలయం వెలుపల మరో బాంబు పేలుడు జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. అయితే ఈసీపీ కార్యాలయం గేటు బయట జరిగిన పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నేరస్తులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
*గ్రామీ విజేతలుగా శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్..
సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా అందించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఇవాళ అట్టహాసంగా జరిగాయి. లాస్ ఏంజిల్స్ లో 66వ గ్యామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన సంగీత కళాకారులు హాజరయ్యారు. అయితే, ఈ అంతర్జాతీయ సంగీత వేదికపై ఇండియన్ మ్యూజిక్ ఆర్టిస్టులు శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ జయకేతనం ఎగరవేశారు. వీరు కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌గా అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఈ పాటను 8 మంది కలిసి కంపోజ్ చేయగా.. అందులో జాన్ మెక్ లాగ్లిన్(గిటార్), జాకీర్ హుస్సేన్(తబ్లా), శంకర్ మహదేవన్(సింగర్), వి సెల్వగనేశ్(పెర్కషనిస్ట్), గనేశ్ రాజాగోపాలన్(వయోలిన్ విద్వాంసుడు) ఉన్నారు. ఇక, భారతీయ సంగీతం గొప్పదనాన్ని విశ్వ వేదికపై చాటిన వీరికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
