NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చాము.. కంటతడి పెట్టుకున్న సబితారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు గందరగోళంగా జరిగాయి. బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలను విమర్శించారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‌అసెంబ్లీ నుంచి దొంగలా రేవంత్ పారిపోయారని ఆమె మండిపడ్డారు. భట్టి మాటలు బాధకరమని, భట్టి గారు మీ పక్క సీటు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని కంటతడి పెట్టుకున్నారు సబితా ఇంద్రారెడ్డి. మేం ఏ తప్పు చేయలేదని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ మారారని మీకు అనే హక్కు లేదని, మేము పార్టీ మారలేదు.. పార్టీ నుంచి బయటకు మెడ పట్టి గెంటేశారని ఆమె అన్నారు. మా కుటుంబానికి ఓ చరిత్ర ఉందని, ఎన్టీఆర్ ను పక్కకు దించేసినప్పుడు ఇంద్రారెడ్డి… 2014లో టికెట్ ఇవ్వకపోయినా నేను పార్టీకి పనిచేశానన్నారు. రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చారని, మహిళలను మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారన్నారు సబితా ఇంద్రారెడ్డి.

ఏపీకి చంద్రబాబే పెద్ద బ్రాండ్..100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానం

వాళ్లు ఇష్టముంటే వాళ్లొస్తారు.. పరిశ్రమలు పెట్టాలనుకుంటే పెడతారు అనేది గత ప్రభుత్వ పాలసీ అని.. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేయం.. ఛార్టెడ్ ఫ్లైట్ పెట్టేది లేదని గత ప్రభుత్వం చెప్పేసిందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్రంగా విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధిని ఆ తర్వాత ప్రభుత్వం అందుకోలేకపోయిందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా వస్తే.. వాటాలు అడిగే పరిస్థితి ఉందని ఆరోపించారు. ఏపీకి సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామని.. 100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు మొదటి వారంలో పశ్చిమ తీరం వెంబడి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇక బుధవారం మిజోరంలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. రాబోయే ఐదు రోజుల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, విదర్భలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఆగస్టు మొదటి వారంలో ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, కోస్తాంధ్ర, కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు కూడా తగు చర్యలు తీసుకోవాలని తెలిపింది.

నవీ ముంబైలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బృందం పర్యటన

రాజధాని అమరావతిని ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిర్మించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారు. దీనికి తగ్గట్లుగా గతంలోనే మాస్టర్ ప్లాన్‌లు రూపొందించారు. 2019లో మరోసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే అమరావతికి ప్రత్యేక గుర్తింపు వచ్చేదని ప్రభుత్వం చెబుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం వేగవంతం చేయాలని నిర్ణయించింది. తాజాగా రాజధాని నిర్మాణంలో 2019కు ముందు ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారమే ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి నిర్మాణంలో భాగంగా దేశ విదేశాల్లో అభివృద్ధి చెందిన ఆధునిక నగరాల నిర్మాణాల్లో అనుసరించిన విధానాలను గతంలో అధ్యయనం చేసింది ఏపీ ప్రభుత్వం.

మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఇసుక లభ్యత, ధరలపై కీలక చర్చ

ఏపీ మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై చర్చించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014-19 మధ్య 24 శాతం గ్రోత్ సాధించగా.. 2019-24 మధ్య 7 శాతం మాత్రమే ఉందని నిర్ధారించారు. గత ఐదేళ్ల కాలంలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి జరిగిన నష్టంపై సమీక్ష చేపట్టారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలు ప్రభుత్వానికి రూ. 1025 కోట్లు చెల్లించలేదని అధికారులు తేల్చారు. దీనిపై కేసులు నమోదు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. మైనింగ్ శాఖలో అస్తవ్యస్త విధానాల వల్ల తలెత్తిన సమస్యలపై సీఎం సమీక్షలో ప్రస్తావించారు. ఉచిత ఇసుక పాలసీ అమలు, వివిధ ప్రాంతాల్లో ఇసుక లభ్యత, ధరలపై చర్చలు జరిపారు. రవాణా ఖర్చుల కారణంగా కొన్ని చోట్ల అనుకున్నంత తక్కవ మొత్తానికి ఇసుక దొరకని అంశంపైనా చర్చించారు. తవ్వకం, రవాణా ఖర్చులు భారం కాకుండా.. కొత్తగా ఏఏ విధానాలు అవలంభించవచ్చనే అంశంపై అధికారులతో సమీక్షించారు. రీచ్ నుంచి నేరుగా అవసరం ఉన్నవారికి ఇసుక తీసుకువెళ్లగలిగితే భారం ఉండదని సీఎం పేర్కొన్నారు. ఉచిత ఇసుక విధానానికి కట్టుబడి ఉన్నామని.. వినియోగదారులకు భారం కాకుండా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

మా మహిళా శాసనసభ్యులపైన అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారు

మా మహిళా శాసనసభ్యులపైన అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారని, ఈ అవమానం కేవలం సబితక్కకు సున్నితక్కకు జరిగింది కాదు తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానమన్నారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి అని కేటీఆర్‌ విమర్శించారు. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు కానీ కండకావరంతో ముఖ్యమంత్రి ఆడబిడ్డలను అవమానించారని, తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగుల్తదని ఆయన నిప్పులు చెరిగారు. మా ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు అని, ప్రజల దీవెనలు కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లు అని కేటీఆర అన్నారు.

పిన్నెల్లికి మరోసారి చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జిల్లా కోర్టులో మరోసారి చుక్కెదురైంది. పిన్నెల్లికి గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ నెల 18న పిన్నెల్లికి సెషన్స్‌ కోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా కోర్టులో పిన్నెల్లి న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పాల్వాయిగేటులో టీడీపీ ఏజెంట్‌పై దాడి, కారంపూడి సీఐపై దాడి కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఈ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలని గుంటూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నేడు మరోసారి రెండు కేసుల్లోనూ జిల్లా న్యాయస్థానం పిన్నెల్లికి బెయిల్ నిరాకరించింది.

ఖమ్మం టూ సూర్యాపేట వాహనదారులకు తీరనున్న కష్టాలు

ఖమ్మం టూ సూర్యాపేట వాహనదారులకు కష్టాలు తీరనున్నాయి. సూర్యాపేట హైవే పై ఎంట్రీ వద్ద ఫ్లై ఓవర్ కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే.. ఫ్లై ఓవర్ మంజూరుకు ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో చర్చించగా ఆర్ అండ్ బీ ప్రఫోజల్స్ కు ఎన్ఎచ్ఏఐ ఆమోదం తెలిపింది. దీంతో.. ఫ్లై ఓవర్ మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. నేషనల్ హైవే అథారిటీ అధికారులతో చర్చించి సత్వరమే పనులు ప్రారంభించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిలు కోరారు. సూర్యాపేట టూ దేవరపల్లి నేషనల్ హైవేలో భాగంగా నిర్మాణం చేసిన రహదారి ఎంతో సౌకర్యంగా ఉన్నప్పటికీ ఖమ్మం నుంచి సూర్యాపేట వచ్చే వాహనాలు విజయవాడ టూ హైదరాబాద్ హైవే పై ఎంట్రీ వద్ద సూర్యాపేట వైపు మళ్ళీ ముందుకు వెళ్ళాక యూ టర్న్ తీసుకుని హైదరాబాద్ వైపు రావల్సిన పరిస్థితి ఉంది.

ఏపీలో కంపెనీల ఏర్పాటుకు సహకారం అందించండి..

ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు స‌హ‌క‌రించాల‌ని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌ను కోరిన‌ట్లు రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ తెలిపారు. విజ‌య‌వాడ‌లో జెన్నిఫ‌ర్ లార్సన్‌ను మ‌ర్యాద‌పూర్వకంగా కలిసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టే వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని అవకాశాలను వివ‌రించిన‌ట్లు మంత్రి టీజీ భ‌ర‌త్‌ పేర్కొన్నారు. అమెరికాలో తెలుగువాళ్లు ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నార‌న్నారు. ఏపీలో కంపెనీలు విస్తరించేందుకు కృషి చేయాల‌ని కోరాన‌న్నారు. ఈ విష‌యంపై ఆమె సానుకూలంగా స్పందించిన‌ట్లు మంత్రి తెలిపారు.

ప్రధాని మోడీతో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ భేటీ

ఢిల్లీలో ప్రధాని మోడీని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించారు. అనంతరం శివకుమార్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు ప్రకటించకపోవడంతో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్లు తెలిపారు. బెంగళూరు నగరంలో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులకు గ్రాంట్లు అందించాలని ప్రధానిని కోరినట్లు పేర్కొన్నారు. నీటిపారుదల, నీటి రంగాలకు నిధులు కేటాయించలేదన్నారు. అయితే బెంగళూరు ప్రాజెక్టులకు మద్దతు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు.