Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

సిటిజన్ ఫర్ డెమోక్రసీ.. టీడీపీ, బీజేపీల బినామీ

చంద్రబాబు, బీజేపీ, పవన్ కల్యాణ్‌లు రాజకీయాల కోసం పేద ప్రజల మీద కక్ష తీసుకునే రాజకీయాలు చూస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. పెన్షన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ బీనామి సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసి అని ఆయన ఆరోపించారు. ఈ సంస్థ అధ్యక్షుడు టీడీపీ హయాంలో పదవి అనుభవించారన్నారు. నిమ్మగడ్డ రమేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని.. ఒక లాడ్జిలో కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరితో చర్చలు జరిపిన నికార్సైన వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ అని విమర్శించారు. రాజకీయ ప్రేరేపిత సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసి అంటూ విమర్శించారు. ఈ సంస్థ తరపున కోర్టుల్లో లక్షల రూపాయల ఫీజులు తీసుకునే లాయర్ కపిల్ సిబల్ వాదిస్తారన్నారు. నిమ్మగడ్డ రమేష్ ,భవాని ప్రసాద్‌లు ఎలక్షన్ వాచ్ కాదు.. పసుపు వాచ్ అంటూ ఆరోపణలు చేశారు.

కేజ్రీవాల్ సింహం.. ఎక్కువ కాలం జైలులో ఉంచలేరు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేయడంపై ఈ రోజు రామ్ లీలా మైదానంలో ‘లోక్‌తంత్ర బచావో’ పేరుతో ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన భర్త సింహమని, చాలా కాలం ఆయనను జైలులో ఉంచలేరని ఆమె అన్నారు.

ఇండియా కూటమి నేతృత్వంలో జరిగిన ఆ కార్యక్రమానికి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే, ప్రియాంకాగాంధీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, సంజయ్ రౌత్, తేజస్వీ యాదవ్, హేమంత్ సోరెన్ భార్య కల్పనా సొరెన్ తదితరులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ నా భర్తను జైల్లో ఉంచలేరని, ప్రధాని చేసింది సరైనదా..? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడని చెప్పారు. తాను ఈ రోజు ఓట్లు అడగం లేదని, నేను 140 కోట్ల మంది భారతీయులను కొత్త భారతదేశాన్ని తయారు చేయడానికి ఆహ్వానిస్తున్నాని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఇండియా కూటమికి ఒక అవకాశం ఇస్తే, తాము న్యూ ఇండియాను నిర్మిస్తామని అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని ఆమె చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ప్రజలకు ఆప్ 6 హామీలను ప్రకటించింది.

మార్కాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మార్కాపురం మారుమోగిపోయిందని.. మార్కాపురంలో వచ్చిన స్పందన తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. జనం నాడి తెలిసిపోయిందని.. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందన్నారు. బటన్ నొక్కానని ముఖ్యమంత్రి రోజూ మాట్లాడుతున్నారు.. జగన్‌కి బటన్ నొక్కింది ఎంత.. బొక్కింది ఎంతో సమాధానం చెపే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. వెలుగొండకు ఫౌండేషన్ వేసింది తానేనని.. వెలుగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన చేశారన్నారు. తాను అధికారంలో ఉండి ఉంటే వెలుగొండ నుంచి 2020కే నీళ్లు వచ్చేవన్నారు.

విపక్షంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌కి పొలంబాట పట్టాలని అర్థమైంది

విపక్షంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌కి పొలంబాట పట్టాలని అర్థమైందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనం బాట మరిచిన కేసిఆర్ కు ప్రజల అజెండా ఏంటో తెలియడంలేదన్నారు. అధికారం కోల్పోయిన మూడు నెలలకే రాజకీయంగా పతనమైన తర్వాత కేసిఆర్ జనంలోకి రావాలనుకోవడం విచిత్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల తర్వాత కేసిఆర్ కు ప్రజలు గుర్తుకు వచ్చారని, అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఇబ్బందులు పడ్డ సమయంలో పట్టించుకోని కేసిఆర్, ఒడిపోగానే పర్యటనలు చేస్తున్నారన్నారు అద్దంకి దయాకర్‌. అసెంబ్లీకి రాని కేసిఆర్ వచ్చే ఎన్నికల్లో నష్టపోతామని రాజకీయ లబ్ది కోసం పొలం బాట పట్టారని, నాడు పండిన పంటలు కొనకపోతే రోడ్ల మీద మొలకెత్తిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు.

పిఠాపురంలో విజయం తథ్యం.. కార్యకర్తలకు పవన్ దిశానిర్ధేశం

ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే సీఎం జగన్, చంద్రబాబు, పవన్ తమ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కూటమిగా మూడు పార్టీలు బరిలో నిలవగా, కాంగ్రెస్‌తో కలిసి వామపక్షాలు మరో కూటమిగా పోటీ చేస్తున్నాయి. వైసీపీ సింగిల్ గా ఎన్నికల్లో తల పడుతోంది. కూటమిలో సీట్ల ప్రకటన దాదాపు పూర్తయింది. ఈ క్రమంలోనే పార్టీల కీలక నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తూ ఎన్నికల ప్రచార బరిలో ముందుకు సాగుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ కూటమి కార్యకర్తలను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.

110 రోజుల్లోనే ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామనుకోలేదు

రైతులకు పంట నష్టపరిహారం అందే వరకు బీఆర్‌ఎస్‌ విశ్రమించేది లేదనిమాజీ సీఎం కే చంద్రశేఖరరావు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకున్నారు . కేవలం 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మేం రైతులకు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టినా ఈ దుస్థితి ఎందుకొచ్చింది? దేశంలోనే ఉత్పత్తిలో నంబర్‌ వన్‌ స్థాయికి ఎదిగిన రాష్ట్రం అనతికాలంలో ఈ స్థాయికి ఎందుకు దిగజారిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు తన సందేశంలో పేర్కొన్నారు. 110 రోజుల్లోనే ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామనుకోలేదని ఆయన అన్నారు. BRS మీ పక్షాన పోరాడుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఇది మా బాధ్యత. అయితే, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా పని చేసేందుకు కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని బీఆర్‌ఎస్ కోరుతున్నట్లు తెలిపారు. కానీ రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపవలసి వచ్చింది.

టీడీపీకి షాక్‌.. పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్‌ తగిలింది. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. కదిరి టికెట్ ఆశించిన అత్తార్ చాంద్‌ బాషా.. టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు చాంద్ బాషా లేఖ రాశారు. రేపు కదిరిలో సీఎం జగన్ సమక్షంలో చాంద్‌ బాషా వైసీపీలో చేరనున్నారు.

‘‘రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు’’.. పప్పులో కాలేసిన ఖర్గే..

2024 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరో ఇబ్బందికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన ప్రసంగంలో ఘోరమైన తప్పు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఇండియా కూటమి రామ్ లీలా మైదానంలో మహార్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ..‘‘రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు’’ అని వ్యాఖ్యానించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వాలంటీర్ వ్యవస్థను చూసి భయపడిపోతున్నారు..

పెన్షన్ పంపిణీపై టిడిపి చెడు ప్రచారాన్ని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఖండించారు. వాలంటీర్ వ్యవస్థను చూసి భయపడిపోతున్నారని.. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ తరపున ఆరుగురు మాట్లాడారని ఆయన తెలిపారు. పెన్షన్ ఆపింది మీరే.. ఇవ్వాలని గొడవలు చేసేది మీరే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని ఉమ ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చెప్పాలన్నారు. చంద్రబాబు 50 రూపాయలు ఇచ్చారని.. రాజశేఖర్ రెడ్డి వచ్చి 200 చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమ అబద్ధాలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారన్నారు.

జనసేన రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షణ కమిటీ నియామకం

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల పర్యవేక్షణకు అయిదుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియమించారు. ఈ కమిటీలో బి.మహేందర్ రెడ్డి, పి.హరిప్రసాద్, వములపాటి ఆజయ్ కుమార్, మరెడ్డి శ్రీనివాస్, ప్రొఫెసర్ కె. శరత్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. మరెడ్డి శ్రీనివాస్ పరాపురం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు చూడనున్నారు. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలలో సమాయత్తం కావడం, సమన్వయం, ప్రచార వ్యవహారాలు నుంచి పోల్, బూత్ మేనేజ్మెంట్ తదితర అంశాలను ఈ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. కమిటీ సభ్యులతో ఈ రోజు పిఠాపురంలో పవన్ కల్యాణ్ సమావేశమై దిశానిర్దేశం చేశారు.

“సుప్రీంకోర్టుకు వెళ్లినా వారు బెయిల్ పొందలేరు”.. ఇండియా కూటమిపై ప్రధాని ఫైర్…

ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు విరుచుకుపడ్డారు. అవినీతిపై పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. అవినీతికి పాల్పడిన వారి హోదాతో సంబంధం లేదకుండా చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా మోడీ పూర్తి శక్తితో పోరాడుతున్న సమయంలో ప్రతిపక్షాలు అన్నీ కలిసి ‘ఇండి కూటమి’ని ఏర్పాటు చేశారని, వారు మోడీని భయపెడదామని భావిస్తున్నారు, కానీ నేను నా భారతదేశం, నా కుటుంబాన్ని అవినీతిపరుల నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటానని ప్రధాని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన తొలి ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ప్రధాని నియంతృత్వ విధానాలను అవలంభిస్తున్నారని, ప్రతిపక్షాలను బెదిరించేందుకు హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారని, దీనిని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఇండియా కూటమి ఢిల్లీలో మహా ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమం తర్వాత ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసే పార్టీ…

కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసే పార్టీ అని, కాంగ్రెస్ నాయకులని మాదిగ పల్లెలోనికి రానివ్వదు అని నేను మాదిగ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అన్నారు ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. ఇవాళ ఆయన హనుమకొండ జిల్లా హరిత హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నుండి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయారన్నారు. వరంగల్ లో ఎక్కువ శాంతం మాదిగలు ఉన్న మాదిగలను అణిచివేస్తున్నారన్నారు మందకృష్ణ. కడియం శ్రీహరి కూతురికి సీట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు కోల్పోయిందన్నారు మందకృష్ణ.

మా పొత్తుతో జగన్‌కు నిద్రపట్టడం లేదు..

నాలుగు లక్షల కోట్ల ప్రజాధనాన్ని విధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. బాపట్ల ప్రజాగలం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తన బాధంతా ప్రజల ఆస్తి లూటీ అవుతుందని.. సంపదను నాశనం చేసి మీ నెత్తిన 13 లక్షల కోట్ల అప్పులు పెట్టాడని ఆరోపించారు. ఈ అప్పులన్నీ ఎవరు కడతారని ప్రశ్నించారు. పన్నుల రూపంలో ప్రజలే కట్టాలి అడిగితే సమాధానం చెప్పే వాళ్ళు లేరు అదే తన బాధ అని పేర్కొన్నారు. పోలవరం ఈ రాష్ట్రానికి రెండో కన్ను పోలవరం పూర్తి అయితే గోదావరి కృష్ణ నదుల అనుసంధానం జరిగేదన్నారు. నాగార్జునసాగర్ ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లి నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరానికి నీళ్లు అందించే వాళ్ళమన్నారు. టెండర్లు మార్చి రివర్స్ టెండరింగ్ అన్నాడు.. రివర్స్ టెండర్రింగ్‌తో గోదావరిలో పోలవరాన్ని ముంచేశాడన్నారు.

Exit mobile version