NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఏపీ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఊరట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు ఊరట లభించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసు క్వాష్ చేయాలని పవన్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కేసు విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులపై ప్రభుత్వం రివిజన్ చేస్తోందని కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్.. తదుపరి విచారణ 4 వారాలకి వాయిదా వేస్తునట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది.

కేరళ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం సాయం.. రూ. 5 కోట్లు ప్రకటన

వయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకూ 88 మంది చనిపోయారు. అలాగే వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరికొంత మందిని అధికారులు తీవ్రంగా శ్రమించి రక్షించారు. ఇప్పటికీ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిథిలాల కింద మృతదేహాలు కనిపిస్తుండటంతో.. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం కేరళ ప్రభుత్వానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలిపారు.

అదే బాటలో కాంగ్రెస్ నడవటం బాధాకరం

రైతులందరికీ రుణ మాఫీ చేయనందుకే బీ అర్ ఎస్ అక్కడ కూర్చొందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. అదే బాటలో కాంగ్రెస్ నడవటం బాధాకరమని, రుణ మాఫీ కి 30 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరం అని చెప్పారన్నారు. కానీ అంత బడ్జెట్ పెట్టలేదని, సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 70 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నారన్నారు. కానీ ఇందులో కోత విధించినట్లు తెలుస్తోందని, ఏ ప్రాతిపాదికన రైతులను ఎంపిక చేసారు ? అని ఆయన ప్రశ్నించారు. వరంగల్ సభలో ఎటువంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని ఒప్పుకున్నారని, మెలికలు లేకుండా రుణమాఫీ చేయాలని, ఈ ఏడాది రైతు బంధు పడలేదని, సీజన్ రైతు బంధు విడుదల చేయాలన్నారు. రైతు బందుకు , రైతు భరోసా కు వేర్వేరు నిధులు కేటాయించాలని, రైతు భరోసా పై అసెంబ్లీ లో చర్చ పెడతామని సీఎం చెప్పారని, చర్చ ఎప్పుడు పెడతారో చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఆ అధికారులే భూ రికార్డులను కాల్చివేశారు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగింది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అని ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు.. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగింది.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడింది.. వైసీపీ నేతలు భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.. సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు.. పెద్ద ఎత్తున 22ఏ భూముల రికార్డులు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ధ్వసం చేసారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయట పడతాయని రికార్డులను కాల్చేశారు అని ఆరోపణలు గుప్పించారు. అనేక మంది అధికారులు పెద్దిరెడ్డి కోసం పని చేశారు.. ఆ అధికారులే భూ రికార్డులను కాల్చివేతకు పాల్పడ్డారు.. మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో రికార్డ్స్ కాల్చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

బీజేపీపై మండిపడ్డ అసదుద్దీన్.. ఆ ప్రమాదాలకు ప్రభుత్వం తప్పిదం..!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హీట్ హీట్ గా కొనసాగుతున్నాయి. ఈరోజు లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చించారు. ఈ సందర్భంగా.. ఏఐఎంఐఎం (AIMIM) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం, జార్ఖండ్‌లో జరిగిన రైలు ప్రమాదంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం సహజమే.. కానీ తరచూ జరిగే రైలు ప్రమాదాలను సాధారణ సంఘటనగా పేర్కొనలేమని ఆయన అన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ తప్పిదం ఉందని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాల వల్ల ప్రజలు మృత్యువాత పడుతున్నారని.. రైల్వే ఆస్తులు కూడా దెబ్బతింటున్నాయని చెప్పారు. మరోవైపు.. బీజేపీ కూడా రాజకీయంగా తీవ్ర నష్టాన్ని చవిచూస్తోందని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.

రాష్ట్రం పేరు చదవకపోతే నిధులు ఇవ్వలేనట్లేనా? విపక్షాలపై నిర్మలమ్మ ఆగ్రహం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టాక.. ఆ రగడ మరింత ముదిరింది. బడ్జెట్‌లో ఎన్డీయేతర రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదని విపక్షాలు ధ్వజమెత్తాయి. అంతేకాకుండా ఇటీవల ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా విపక్ష ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. తాజాగా ఇదే అంశంపై మంగళవారం లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. బడ్జెట్‌ ప్రసంగంలో ఏదైనా రాష్ట్రం పేరు ప్రస్తావించనంత మాత్రాన ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరపనట్లు కాదని పేర్కొన్నారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఏ రంగానికి తక్కువ కేటాయింపులు చేయలేదని తెలిపారు. బడ్జెట్‌పై లోక్‌సభలో సమాధానమిచ్చారు. రెండు రాష్ట్రాలకే అధిక కేటాయింపులు చేశామనడం సరికాదన్నారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థ అని.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కోవిడ్ లాంటి మహమ్మారిని అధిగమించామని చెప్పారు. యూపీఏ హయాంలో అయితే ఏ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని తెలిపారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎస్టీలకు ఏమీ చేయలేదు

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వల్లే తన తల్లిదండ్రులకు పోడు భూమి యాజమాన్యం దక్కిందంటూ బీఆర్‌ఎస్‌ సభ్యుడు అనిల్‌ కుమార్‌ జాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డీ అనసూయ అలియాస్‌ సీతక్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం పట్టా, ఏ దయ వల్ల కాదని ఆమె అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోడు భూముల యజమానులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడంతో సీతక్క తల్లిదండ్రులు గతేడాది ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో 1.17 ఎకరాలకు పట్టా పొందారు. మంగళవారం అసెంబ్లీలో గ్రాంట్‌ల డిమాండ్లపై జరిగిన చర్చలో సీతక్క జోక్యం చేసుకుంటూ.. మాజీ ముఖ్యమంత్రికి రావాల్సిన పట్టాలు తన తల్లిదండ్రులకు అందాయని జాదవ్‌పై సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా తన తల్లిదండ్రులు భూమిలో సాగు చేసుకుంటున్నారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల చట్ట ప్రకారం పట్టాలు అందలేదని ఆమె అన్నారు.

ఛాంబర్‌కు వెళ్లినంత మాత్రానా పార్టీలో చేరినట్లా

ఛాంబర్‌కు వెల్లినంత మాత్రానా పార్టీ లో చేరినట్లా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేటీఆర్ కూడా నా ఛైర్ దగ్గర కు వచ్చి మాట్లాడాడు..ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనా అని ఆయన వ్యాఖ్యానించారు. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అలాగే కలిసి ఉంటాడు , ఆయన ఎక్కడికి వెళ్లాడని, జగదీష్ రెడ్డి నేను అన్న మాటలకు ఒప్పుకున్నాడన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలో ప్రధాని ని కలుస్తా..రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతా అని, బీఆర్ఎస్ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్ల కు సబ్సిడీ ఇస్తామని, ఉప్పల్ – నారపల్లి ఫ్లై ఓవర్ కు త్వరలోనే రీ టెండర్ అని ఆయన వ్యాఖ్యానించారు. వర్షాకాలంలో ప్రయానికులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతులు చేపడంతామని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్ష నాయకుడు కుడా అంతే అని, సభకు హాజరుకాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించనట్టే అన్నారు. దేశంలో అర్ధరాత్రి వరకు సభ నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, 83 ఏండ్ల ఖర్గే,ఆరోగ్యం బాగాలేకపోయినా సోనియా పార్లమెంటుకు హాజరవుతున్నారన్నారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.

వయనాడ్‌ ఘటనలో 122 చేరిన మృతుల సంఖ్య..

కేరళలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 122 మంది చనిపోయారు. అలాగే 142 తీవ్రగాయాలతో ఉన్న వారిని రెస్క్యూ టీం అధికారులు కాపాడారు. మరోవైపు.. ముండకై తేయాకు పరిశ్రమలో పనిచేస్తూ గల్లంతైన 600 మంది కార్మికుల కోసం ఆర్మీ అధికారులు గాలిస్తున్నారు. వారంతా అస్సాం, పశ్చిమబెంగాల్ నుండి వచ్చి తేయాకు తేటలో పనిచేస్తున్నారు. వయనాడ్లో భారీ ప్రళయం ధాటికి ‘టీ ఎస్టేట్’ పూర్తిగా కొట్టుకు పోయింది.

దళితులకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు చేపట్టండి..

సాంఘీక సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆర్థికంగా అత్యంత వెనుకబాటులో ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిథి, సివిల్ సర్వీస్ శిక్షణ కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్, చంద్రన్న పెళ్లి కానుక లాంటి పథకాల ద్వారా వేల కుటుంబాలకు లబ్ది చేకూరిందని.. అయితే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలను నీరు గార్చిందని సీఎం చంద్రబాబు అన్నారు.