విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు (శుక్రవారం) విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుండి విజయవాడ చేరుకుని.. రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9.15 కు విజయవాడలో పాత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్, BSL-3 ల్యాబ్ నిర్మాణానికి కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ కొత్తగా నిర్మించిన IPHL ల్యాబ్స్ ను ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుండి బయల్దేరి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను మన్సుఖ్ మాండవియా సందర్శించనున్నారు. అక్కడ అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పరిశీలించనున్నారు. తరువాత జరిగే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడి నుండి బయల్దేరి మంగళగిరి ఏపీఐఐసీ భవన సముదాయాన్ని చేరుకుంటారు.
నవాజ్ షరీఫ్‌కు ఉపశమనం.. నామినేషన్‌ను ఆమోదించిన ఎన్నికల సంఘం
ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పోటీ చేయగలరా.. అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. దానికి కారణం కూడా లేకపోలేదు. వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేయకుండా నవాజ్ షరీఫ్‌పై సుప్రీంకోర్టు జీవితకాల నిషేధం విధించింది. సార్వత్రిక ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పోటీ చేయడానికి న్యాయపరంగా చిక్కులు ఎదురవుతాయనే అనుమానం ఉన్నా.. పాకిస్థాన్ ఎన్నికల సంఘం నవాజ్ షరీఫ్ నామినేషన్ పత్రాలను ఆమోదించింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా నవాజ్ షరీఫ్ జీవితకాల నిషేధం విధించిన తర్వాత, ఆయన నామినేషన్ పత్రాలను ఎన్నికల సంఘం ఆమోదిస్తుందా లేదా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయని, ఎన్నికల్లో పోటీపై నిషేధం కూడా ముగిసిందని చెబుతున్నారు.
29 వేల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాము
రాష్ట్రంలోని పేద వర్గాలకు జరిగిన లబ్ధి గురించి చెప్పేందుకే ఈ సామాజిక సాధికార యాత్ర చేపట్టినట్టు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. గురువారం పెనమలూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యత్రలో ఎమ్మెల్యే పార్థసారధి, వైసీపీ నేతలు రాజశేఖర్, అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారధి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మొత్తంగా 1.10 లక్షల మందికి 1299 కోట్ల రూపాయలు లబ్ది చేకూరిందని తెలిపారు. పేద వాళ్లకు 29 వేల పైచిలుకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, నియోజకవర్గంలో కాలువ గట్లలో నివసించేవారికి 75%సిమెంట్ రోడ్లు,నీటికుళాయిలు సౌకర్యాలు కల్పించామని చెప్పారు.
సత్యసాయి జిల్లా వైసీపీలో నిరసన గళం.. రోడ్డెక్కిన మద్దతుదారులు
శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు, చేర్పులు ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతోంది. సిట్టింగ్ లను మార్చొందంటూ ఎమ్మెల్యేల మద్దతుదారులు రోడ్డెక్కి తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. వైసీపీ అధిష్టానం నిర్ణయం మేరకు పెనుకొండలో బాధ్యతలు చేపడుతానని మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలు చేసిన వెంటనే శంకరనారాయణ మద్దతుదారులు నిరసన గళం వినిపిస్తున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి శంకర్ నారాయణకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శంకరన్న ముద్దు.. బయట వ్యక్తులు వద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పై విష ప్రచారం చేసిందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వందల కోట్లు వెచ్చించి బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటే నని దుస్ప్రచారం చేసిందన్నారు. ప్రలోభాల మధ్య కూడా ఉత్తర తెలంగాణ లో బీజేపీ ఓట్లు సాధించింది….7 సీట్లు గెలిచిందన్నారు ఈటల రాజేందర్. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ కి ఓటు వేస్తామని ప్రజలు చెప్పారని, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాలేదు…ఇప్పుడు బీజేపీ కి 27 శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థలు చెబుతున్నాయన్నారు. తెలంగాణలో 17 స్థానాల్లో బీజేపీ పోటీ పడ్తుంది… సత్తా చాటుతోందన్నారు. పార్టీ అధిష్టానం ఎక్కడ నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు. మోడీనీ ఆశీర్వదించాలని తెలంగాణ ప్రజల ను కోరుతున్నానన్నారు.
అయోధ్యలో డ్రెనేజ్, రోడ్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపడుతుంది. ఇక ఆలయాన్ని అన్ని హంగులతో ముస్తాబవోతోంది. దేశ నలుమూలల నుంచే కాదు విదేశీయులు సైతం ఈ రామమందిర ప్రారంభోత్సవానికి హాజరకానున్నారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిథ్యనాథ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు, వీధులు పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య నాలుగు రోజులు అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సీఎం క్యాంపు కార్యాలయానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు వచ్చారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాల్లో అతిపెద్ద సంఘం పీఆర్టీయూ.. గత ప్రభుత్వంలో రెండుగా విడిపోయాయని తెలిపారు. అంతేకాకుండా.. రెండు ఎమ్మెల్సీలను గెలుచుకున్న గొప్ప సంఘం పీఆర్టీయూ అని అన్నారు. విడిపోయిన నేతలతో మాట్లాడి రెండు సంఘాలు కలిసేలా చూశామని.. ఒప్పందం ప్రకారం విడిపోయిన రెండు సంఘాలు ఏకమయ్యాయని పేర్కొన్నారు. రెండు సంఘాలు కలవడం వల్ల బలం పెరిగింది.. రాష్ట్రంలో వాలంటీర్లు ఎక్కడా సమ్మె చేయడం లేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు.
15 ఎంపీ స్థానాలు టార్గెట్‌గా పెట్టుకున్నాం..
15 ఎంపీ స్థానాలు టార్గెట్ గా పెట్టుకున్నామని, నేను ఎంపిగా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి. ఇవాళ ఆయన ఎన్టీవీతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ వద్దని చెబుతుంది… పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని, అసెంబ్లీ ఎన్నికలప్పుడే కాంగ్రెస్ లో చేరేందుకు సోయం బాపు రావు చర్చలు జరిపారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోపు బీజేపీ నుంచి సోయం బాపురావు తో పాటు చాలా మంది బీజేపీ నేతలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు చూస్తున్నారని, మంత్రి వర్గ విస్తరణ సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం.. ఆయన నిర్ణయమే ఫైనల్.. హైకమాండ్ జోక్యం చేసుకోదన్నారు మధుయాష్కి.
వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కాసేపటి క్రితం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన అంబటి రాయుడు వైసీపీలో అధికారికంగా చేరారు. అంబటి రాయుడును పార్టీలోకి సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఇదిలా ఉంటే అంబటి రాయుడు గత కొంతకాలంగా గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో వైసీపీలో చేరతారన్న ప్రచారం జరిగినప్పటికీ.. అధికారికంగా మాత్రం అంబటి రాయుడు పార్టీలో చేరలేదు. ఈరోజు ఆయన పార్టీలో చేరడంతో.. గుంటూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు బహిరంగ సభల షెడ్యూల్ ఖరారు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్ళనున్న బహిరంగ సభల షెడ్యూల్ ఖరారు అయింది. జనవరి 5వ తేదీ నుంచి 25 పార్లమెంట్ సెగ్మెంట్లల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. రెండు రోజుల్లో మూడు బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలి విడతలో జనవరి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బహిరంగ సభల షెడ్యూల్ ఉండనుంది. అంతేకాకుండా.. తొలి విడతలో ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లను కవర్ చేసేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొదటగా ఒంగోలు పార్లమెంట్ నుంచి బహిరంగ సభలని ప్రారంభించనున్నారు అధినేత చంద్రబాబు.
కుప్పంలో రౌడియిజం పెరిగిపోయింది.. వైసీపీ చేసిన అవినీతిని కక్కిస్తా..
కుప్పం నా సొంత ఊరు అని.. కుప్పంలో ఈసారి లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి గుడిపల్లి గుండెకాయ లాంటిదని, అలాంటి తనకే ఇక్కడ రక్షణ లేదన్నారు. కుప్పంలో రౌడియిజం పెరిగిపోయిందని, సామాన్యులకు ఇక్కడ రక్షణ కరువైందని వాపోయారు. ఇక రాష్ట్రంలో వైసీపీ సినిమా అయిపోయిందని.. ఇక 100 రోజు సమయమే ఉందన్నారు.
పోలీసులకు తానే దిక్కు అని చెబుతూ.. వారితో తప్పుడు పనులు చేయించడం తప్పా ఏం చేశాడని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం పని అయిపోయిందని.. ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్‌కు వచ్చేసిందన్నారు. వైసిపి చేసినా అవినీతిని కక్కిస్తానన్నారు. బాబు వస్తేనే జాబు వస్తుంది.. ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత నాదీ అని హామీ ఇచ్చారు. కుప్పానికి నీళ్ళు ఇచ్చే భాద్యత తనదన్నారు. బీసీలను అవమానిస్తే అట్రాసిటీ చట్టం తీసుకువస్తా.. బీసీలకు అన్ని రకాలుగా అండదండలు అందజేస్తాం.. త్వరలో జయహో బీసీ కార్యక్రమం చేపడతామన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8 సీట్లకు వచ్చాం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం లోఅమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణలో 35శాతం ఓట్ల తో 10 పార్లమెంటు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8కి వచ్చామన్నారు అమిత్ షా. ఇది వచ్చే ఎన్నికల్లో 64కావచ్చు .. 95 కూడా కావచ్చు అని, తెలంగాణలో భవిష్యత్తు బీజేపీ దేనని ఆయన ఉద్ఘాటించారు. బీఅర్ఎస్ మునిగింది.. కాంగ్రెస్ మునిగిపోయేందుకు సిద్దంగా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిందని, ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించింది… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి బిజెపి వస్తుంది… 64 రావచ్చు లేక 95 సీట్లు రావచ్చు అన్నారు.
అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న ఇంఛార్జుల మార్పుల కసరత్తు
వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుల- చేర్పుల కసరత్తులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి నేతలు క్యూ కడుతున్నారు. వైసీపీ అధిష్టానంతో నేతల వరుస భేటీలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని, ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. మచిలీపట్నంలో పోటీపై పేర్నినానితో సీఎం చర్చించారు. అలాగే హిందూపురం ఎంపీ సీటు మాధవ్ కు దక్కుతుందా లేదా అనేది అనుమానమే.. మరోవైపు సీఎం జగన్ తో విజయసాయిరెడ్డి, బాలినేని కూడా భేటీ అయ్యారు. ఒంగోలు రాజకీయాలు, పార్టీలో అసంతృప్తులపై చర్చిస్తున్నారు.