NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలపై కీలక చర్చ..

కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని సీఎం తెలిపారు. మీడియా నిండా వాళ్లు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయన్నారు. దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులను మంత్రులే గైడ్ చేయాలని సూచించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది, ఎమ్మెల్యేలదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. నీటమునిగిన నివాసాలు

గుజరాత్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో కుండపోత వర్షం కురవడంతో పలు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునుపెన్నడూ లేనంతగా రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లులు కొట్టుకుపోయాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. రంగంలోకి దిగిన సహాయ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌.. అధికారులతో సమీక్ష నిర్వక్షించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సీఎం గారూ, మేం ఎవరి సొమ్ము తినడం లేదు.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ సింగ్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ధ్వజమెత్తారు. సీఎం మోహన్ యాదవ్ ‘‘ఖానా బజానా’’ వ్యాఖ్యలపై బీజేపీపై ఓవైసీ ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలపై విరుచుపడిన ఓవైసీ ‘‘”హమ్ కిసీ కె బాప్ కా నహీ ఖాతే. యే దేశ్ హుమారా హై, ముఖ్యమంత్రి ఆప్ హుమే అప్నీ జెబ్ సే నహీ ఖిలా రహే” అని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ దేశం అందిరికి చెందుతుందని, ముఖ్యమంత్రి మా బిల్లులను చెల్లించడం లేదని, మా ఖర్చుల్ని మేమే భరిస్తున్నామని, ఎవరి సహాయం కోరడం లేదని అన్నారు.

ఏపీ విషయంలో కేంద్రం స్పందిస్తున్న తీరు చూస్తుంటే సంతోషం వేస్తోంది..

పోలవరంకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో.. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ, పోలవరం విషయంలో కేంద్రం చొరవ చూపుతోందని అన్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని తన చర్యల ద్వారానే చెబుతోందని తెలిపారు. కేంద్రం స్పందిస్తున్న తీరు చూస్తుంటే సంతోషం వేస్తోందని.. పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేలా కేంద్రం షెడ్యూల్ విడుదల చేయడం సంతోషం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. పోలవరానికి రూ. 12,127 కోట్లను ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని.. పోలవరం పూర్తి అయితే దక్షిణాది రాష్ట్రాలకు తాగు, సాగు నీటి సమస్య తీరుతుందని చంద్రబాబు తెలిపారు.

రెస్టారెంట్‌లో దారుణం.. ఫుడ్ ఆర్డర్‌పై ఘర్షణ.. కస్టమర్‌ హత్య

రెస్టారెంట్‌లో కడుపారా తిని ఆస్వాదిద్దామనుకుని వెళ్తే ఏకంగా ప్రాణాలే పోయాయి. ఆర్డర్ త్వరగా తీసుకురామని అడిగిన పాపానికి కస్టమర్ హత్యకు గురయ్యాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని కేతన్స్ ఫుడ్ కోర్ట్ అనే రెస్టారెంట్ దగ్గర తెల్లవారుజామున 3:30 గంటలకు హర్నీత్ సింగ్ సచ్‌దేవా అనే కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడు. అది వచ్చేందుకు ఆలస్యం కావడంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రెస్టారెంట్ యజమాని దాడి చేయడంతో హర్నీత్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆ సమయం వరకు రెస్టారెంట్ నిర్వహించడంపై పోలీసులు ఆరా తీశారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోందని చెప్పారు.

కవితకు బెయిలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలది అనైతిక వాదన

కవిత బెయిల్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల స్పందనపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవితకు బెయిలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలది అనైతిక వాదన అని ఆయన తెలిపారు. వీళ్ల రాజకీయం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీద బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో కవిత మీద మోపబడిన అభియోగాలకు ఎలాంటి నైతికత లేదు అని, కేవలం రాజకీయ కక్ష్యతో మోపబడిన కేసు ఇది అని ఆయన విమర్శించారు. దేశంలో కొట్లాడుతున్న జాతీయ రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఒక్కటిగా పనిచేస్తున్నాయని, కేంద్రమంత్రి హోదాలో బండి సంజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు సిగ్గుచేటు అన్నారు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ వ్యాఖ్యల విషయంలో స్పందించాలని, మనీష్ సిసోడియా బెయిల్, కేజ్రివాల్ అరెస్ట్ విషయంలో నిందితులకు మద్దతు పలికిన కాంగ్రెస్ కవిత బెయిల్ విషయంలో నీచ రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి. రేవంత్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం స్పందించక పోవడం చూస్తుంటే ఆ పార్టీకి రేవంత్ తో సంబంధాలు ఉన్నయా ? లేవా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి.

గతంలో జగన్ చేసిన కృషి వల్లే పోలవరానికి నిధులు..

ఈ రోజు కేంద్రం నుండి విడుదలైన రూ.12 వేల కోట్లు గతంలో వైఎస్ జగన్ చేసిన కృషి వల్లే వచ్చాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అసత్యాలను చెప్తున్నారన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తి పడ్డారని.. అందుకే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. 2024లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత విదేశీ నిపుణులు వచ్చి పరిశీలించారని.. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రాజెక్ట్ లో అన్ని కట్టడాలు ఒక్కసారే కట్టడం వల్లే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది… ఇది నిపుణులు చెప్పిన మాట అని అంబటి రాంబాబు తెలిపారు. నది డైవర్షన్ పూర్తి కాకుండా.. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాంలు వేయకూడదని చెప్పారన్నారు. అలాంటి తప్పే గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు.

నాగచైతన్య, శోభితలకు లేని సమస్య మీకెందుకు? మహిళా కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం

వేణు స్వామికి నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వేణు స్వామిపై మహిళా కమిషన్ కు ఓ ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు జారీ చేయగా.. దానిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్డును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నాగచైతన్య శోభితలకు లేని సమస్య మీకెందుకంటూ ఫిలిం జర్నలిస్టులను ప్రశ్నించింది. మహిళా కమిషన్ నోటీసులు చెల్లవంటూ కోర్టు తీర్పు వెలువరించింది.

న్యాయం గెలుస్తది నిజం నిలబడుతుంది..

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆమెకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అయితే.. ఈ సందర్భంగా కవితపై పార్టీ శ్రేణులు పూలవర్షం కురిపించాయి. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిని చూసిన కవిత పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినదించారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో సాయంత్రం జూబ్లీహిల్స్‌ని నివాసానికి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని ఆమె అన్నారు. న్యాయబద్ధమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని, నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి.. కచ్చితంగా ఒక రోజు న్యాయం గెలుస్తుందన్నారు. నిజం నిలకడమీద తెలుస్తుందని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నానని ఆమె అన్నారు. కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తా అని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా క్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని, నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా అని కవిత వ్యాఖ్యానించారు.

చిన్నారితో ఎన్నికల ప్రచారం.. బీజేపీకి ఈసీ నోటీసులు

ఎన్నికల ప్రచార వీడియోలో చిన్నారిని ఉపయోగించుకున్నందుకు హర్యానా బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. బీజేపీ హర్యానా అనే హ్యాండిల్ ప్రచార వీడియోలో చిన్నారిని ఉపయోగించడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల ప్రచారం, ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో పిల్లలను ఉపయోగించడాన్ని ఎన్నికల సంఘం నిషేధించిన విషయం విదితమే. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించినందకు ఈ మేరకు చర్యలు తీసుకుంది.