NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిన తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర పోలీసులు 2024 జనవరి 1 నుండి 2024 జూలై 25 వరకు 21,193 మొబైల్ పరికరాలను విజయవంతంగా రికవరీ చేసి, దేశంలో రెండవ స్థానంలో నిలిచారు. మొబైల్ ఫోన్ల దొంగతనాలను అరికట్టడానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డి ఓ టి) సి ఈ ఐ ఆర్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్‌ను అధికారికంగా 2023 మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పోర్టల్ 2023 ఏప్రిల్ 19 నుండి ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో సిఐడి అదనపు డిజిపి శిఖా గోయెల్, , సీఈఐఆర్ పోర్టల్‌కు నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో గల 780 పోలీస్ స్టేషన్‌లు ఈ పోర్టల్‌ను ఉపయోగిస్తున్నాయి. 2024లో 206 రోజుల్లో 21,193 పోగొట్టుకున్న/దొంగిలించబడిన మొబైల్ పరికరాలను రికవరీ చేయడంలో పోలీసులు విజయం సాధించారు. గత 8 రోజుల్లోనే 1000 పరికరాలను రికవరీ చేసి, వాటిని ఫిర్యాదుదారులకు అప్పగించారు. ప్రతిరోజు సగటున 82 మొబైల్‌లను రికవరీ చేస్తున్నారు.

రామయ్య సాహసమే ఉద్యోగులకు స్పూర్తి.. లైన్మెన్ను అభినందించిన మంత్రి

సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఇందుకు లైన్ మెన్ రామయ్య చేసిన సాహసమే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన కొనియాడారు. ప్రజావసరాలను తీర్చడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపించామని చెప్పారు. భారీ వర్షాలకు అల్లూరి జిల్లా సున్నంపాడు, దేవరపల్లికి విద్యుత్ నిలిచిపోయింది. అక్కడి ప్రజలు బాహ్య ప్రపంచంతో ప్రజాసంబంధాలను కోల్పోయారు.

16 ఏళ్ల వయసులోనే మను భాకర్ కు అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణం..

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం సాధించింది. భారత స్టార్ షూటర్ మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. 22 ఏళ్ల మను భాకర్ భారత్‌కు షూటింగ్‌లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా నిలిచింది. ప్రముఖ భారతీయ క్రీడా షూటర్ మను భాకర్ పిస్టల్ షూటింగ్‌లో తన అసాధారణ నైపుణ్యంతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. హర్యానా రాష్ట్రం ఝజ్జర్ జిల్లాలోని గోరియా గ్రామంలో మను ఫిబ్రవరి 18, 2002న జన్మించింది. తండ్రి, రామ్ కిషన్ భాకర్ నేవీలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. షూటింగ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అత్యంత ఆశాజనకమైన యువ అథ్లెట్‌లలో ఒకరిగా మను నిలిచింది. షూటింగ్‌లోకి రాకముందు బాక్సింగ్, టెన్నిస్, స్కేటింగ్ వంటి క్రీడలపై మను ఆసక్తి కనబరిచింది. ఆమె అంతర్జాతీయ అరంగేట్రం 2017లో జరిగింది. ఆకట్టుకునే ప్రదర్శనతో త్వరగా తనదైన ముద్ర వేసుకుంది.

అక్కడ పోటీ చేస్తే.. ఒవైసీ డిపాజిట్ గల్లంతు అవుతుంది

ఏఐఎంఐఎం ఫ్లోర్‌లీడర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీకి కొండంగల్‌ సీటును ఆఫర్‌ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బోనాల పండుగలో పాల్గొనేందుకు పాతబస్తీకి వచ్చిన సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒవైసీ పోటీ చేస్తే డిపాజిట్ గల్లంతు అవుతుందని అన్నారు. అవాస్తవ లక్ష్యాల కోసం ఒవైసీ తెలంగాణ బడ్జెట్‌ను తుంగలో తొక్కారు. ఓడిపోయేలా చూస్తాం అని అన్నారు. ఎఐఎంఐఎంను అవకాశవాద పార్టీగా అభివర్ణించిన బిజెపి ఎంపి, మజ్లిస్ ఎల్లప్పుడూ తన స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పార్టీతో చేతులు కలుపుతుందని అన్నారు.

‘బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సన్నిహితంగా ఉండేవారు. ఒవైసీ కేసీఆర్‌ను ‘మామయ్య’ అని పిలిచేవారు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ కాంగ్రెస్‌కు దగ్గరైంది. ఒవైసీ, రేవంత్ ఇప్పుడు అన్నదమ్ములయ్యారు. మజ్లిస్ గోడమీద పిల్లిలా ఉంది. అది ఎటువైపు దూకుతుందో తెలియడం లేదు” అన్నాడు. పాతబస్తీలో బోనాల పండుగ నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించలేదని, రంజాన్ సందర్భంగా ప్రభుత్వం రూ.33 కోట్లు విడుదల చేయగా, పాతబస్తీలో బోనాల వేడుకలకు రూ.5 లక్షలు మాత్రమే విడుదల చేసిందని విమర్శించారు. “కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను బిచ్చగాళ్లుగా చూస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి వీధిలో బోనాలు జరుపుకుంటాం.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తా…

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్వర్గీయ జైపాల్ రెడ్డి ఒక సిద్ధాంతకర్తగా పనిచేశారని, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది,కానీ అధికారంలోకి రాలేదన్నారు. 2014 ఎన్నికల్లో స్వర్గీయ జైపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ప్రకటించినుంటే అధికారంలోకి వచ్చేదని, కల్వకుర్తి 100 వంద పడకల ఆసుపత్రి.. 180 కోట్లతో నియోజకవ్గంలోని రోడ్ల నిర్మానాణానికి మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మాడ్గుల మండలంలో 10 కోట్లతో పాఠశాల కనీస వసతులు కల్పి్స్తామన్నారు.

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ వంటశాల

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. కొడంగల్‌లో భారీ వంటశాల ఏర్పాటు చేసేందుకు హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మెగా వంటశాల ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని 28 వేల మంది పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించనున్నారు. ఇవాళ హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ లో పైలట్ ప్రాజెక్టుగా ఓ సెమీ రెసిడెన్షియల్ స్కూలు స్థాపించడంపై రేవంత్ రెడ్డితో చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు చర్చలు జరిపారు.

కుమారస్వామి ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం.. మీడియాతో సమావేశంలో ఘటన..
బెంగళూర్‌లోని గోల్డ్ ఫించ్ హోటల్‌లో బీజేపీ-జేడీఎస్ పాదయాత్ర గురించి కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతున్న సమయంలోనే ఆయన ముక్కు నుంచి రక్తం ధారాళంగా కారింది. ఉన్నట్లుండి జరిగిన ఈ సంఘటనతో అక్కడ ఉన్న వారంతా ఏమైందనే భయాందోళన వ్యక్తం చేశారు. ముక్కు నుంచి రక్తం కారి ఆయన చొక్కాపై పడింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి ఆయనను తరలించారు. ఈ దృశ్యాలు అన్ని అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం, చికిత్సపై వివరాల కోసం వేచి చూస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై జేడీఎస్ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. తమ నేతకు ఏం జరిగిందనే ఉత్కంఠ వారిలో ఉంది.

కేంద్ర పథకాలను అమలు చేయాల్సిందే..బీజేపీ పాలిత రాష్ట్రాలకు మోడీ టాస్క్

ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు ఆదివారం వరుసగా రెండో రోజు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై లోతుగా చర్చించారు. 13 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 15 మంది డిప్యూటీ సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉమ్మడి సమన్వయంపై ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. ఈ ముఖ్యమైన సమావేశంలో అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడంపై చర్చించారు. దీంతో పాటు నూతన విద్యా విధానంపై మాట్లాడారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరై ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అదే సమయంలో.. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. రెండు రోజుల ‘ముఖ్యమంత్రి మండలి’ శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే.

పడవ ప్రమాదంలో గల్లంతైన యువకుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా..

అంబేద్కర్ కోసం జిల్లా గంటి పెదపూడి పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. పడవ ప్రమాదంలో గల్లంతైన బాధ్యత కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. నదిలో వరద ఉధృతి తగ్గేంత వరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. మరోవైపు పి.గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద బోటు ప్రమాద సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన చదలవాడ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులను కలెక్టర్ పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా రేపు బాధిత కుటుంబానికి అందజేస్తామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.