NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంత్‌నాగ్‌ జిల్లా సమీపంలోని సింథాన్-కోకెర్నాగ్ రహదారిపై వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. కారు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. కారులో ఉన్నవాళ్లంతా కిష్త్వార్ నుంచి వస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్ము రీజియన్‌లోని కిష్త్వార్‌ నుంచి వస్తున్న JK03H9017 నంబర్‌ గల సుమో వాహనం దక్సమ్‌ సమీపంలో అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు (పోలీస్‌) మృతి చెందారు. మృతుల్లో భార్యభర్తలు ఉండగా.. వారి పేర్లు ఇంతియాజ్, అఫ్రోజాగా గుర్తించారు. ఈ ప్రమాదానికి గురైన ఇంతియాజ్ వృత్తిరీత్యా పోలీసు. పోలీసు అధికారి ఇంతియాజ్ అహ్మద్ తన ఐదుగురు పిల్లలు, భార్య, మరో మహిళతో కలిసి కారులో కిష్త్వార్ నుంచి మద్వా కిష్త్వార్‌లోని తన ఇంటికి వస్తు్న్నారు.

అక్బరుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదు..

అక్బరుద్దీన్ ఆరోపణలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను ప్రచారంలో వినియోగించారని అమిత్ షా, కిషన్ రెడ్డి పై ఫిర్యాదు చేసేందే కాంగ్రెస్ అని ఆయన వెల్లడించారు. ఎవరు ఔనన్నా కాదన్నా మోదీ దేశానికి ప్రధానమంత్రి… ఆయన రాష్ట్రాలన్నింటికి పెద్దన్నలాంటి వారు అని, గుజరాత్, బీహార్ లా తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఆయన్ను కోరామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. వివక్ష చూపకుండా పెద్దన్నలా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేసామని, ఈ మాటలు నేను ఎక్కడో చెవిలో చెప్పలేదు.. ఆదిలాబాద్ సభలో అందరి ముందే చెప్పా అన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. రాజకీయ ప్రయోజనం కోసం కాదు… రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోదీని పెద్దన్నలా వ్యవహరించాలని చెప్పా అని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని మేం మాటలతో కాలయపన చేయమని ఆయన వెల్లడించారు. అక్బరుద్దీన్ కు నేను మాట ఇస్తున్నానని, వచ్చే ఎన్నికల నాటికి మెట్రో రైల్ లో ఓల్డ్ సిటీలో తిరుగుతామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. మేం ఏం చెప్పామో అది చేసి తీరుతామని, కేంద్రం నిధులు ఇచ్చినా…ఇవ్వకపోయినా ఓల్డ్ సిటీ మెట్రో పూర్తిచేస్తామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవవే వచ్చాయి..

ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సమావేశం కొనసాగింది. నీతి ఆయోగ్ భేటీ అనంతరం కేంద్ర మంత్రితో సమావేశమై పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని సీఎం చంద్రబాబు కోరారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవవే వచ్చాయని.. ప్రత్యేకంగా ఏదో ఇచ్చారన్నట్టు కొందరు రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్యాంకాక్‌లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్‌

బ్యాంకాక్‌లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్‌ ఘటన కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురంకు చెందిన మధు కుమార్ అనే వ్యక్తి కిడ్నాప్‌ అయ్యాడు. కిడ్నాప్ చేసిన దుండగులు 8 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. మధు కుమార్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ రీత్యా 24న బెంగళూరు నుంచి బ్యాంకాక్ వెళ్లాడు. తనను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, 8 లక్షలు ఇస్తే వదులుతామంటున్నారని 25న మధుకుమార్ తన అక్కకు మెస్సేజ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని, తన సెల్‌ఫోన్‌ నుంచి అక్క రాజ్యలక్ష్మికి మెసేజ్ చేశాడు. అనంతరం మధుకుమార్ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఈ క్రమంలోనే మధుకుమార్ తల్లిదండ్రులు డోన్‌ రూరల్ పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాపర్ల నుంచి తన కుమారుడిని కాపాడాలని కోరుతున్నారు.

భవనంపై నుంచి దూకి ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు నగర పరిధిలోని ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది. భవనంపై నుంచి దూకి విజయనగరం జిల్లాకు చెందిన సాయి కార్తీక్‌ నాయుడు(19) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి ట్రిపుల్‌ ఐటీలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 2 రోజుల క్రితం అధ్యాపకులు మందలించడంతో మనస్తాపానికి గురై భవనం 9వ అంతస్తు నుంచి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆస్పత్రికి తరలించేలోపే విద్యార్థి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. విద్యార్థి మృతి చెందడంతో ట్రిపుల్ ఐటీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. చదువులో ఒత్తిడా.. వేరే కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

మమత వ్యాఖ్యలను ఖండించిన నీతి ఆయోగ్ సీఈవో

నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్ కట్ చేశారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించిన ఆరోపణలను నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్.సుబ్రహ్మణ్యం ఖండించారు. సమావేశంలో అక్షర క్రమం పాటించామన్నారు. కానీ భోజన విరామానికి ముందే మాట్లాతానని చెప్పారని గుర్తుచేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఏడు నిమిషాల సమయం ఇచ్చామని.. కానీ ఆమె అదనంగా సమయం అడిగారని పేర్కొన్నారు. మమతకు సమయం ఇవ్వలేదని అనడంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు.

ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం నీతి ఆయోగ్ సమావేశం జరిగింది, సీఎం మమత ప్రసంగిస్తుండగా మైక్ కట్ అయింది. దీంతో ఆమె సమావేశాన్ని వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారని ఆరోపించారు. ఎన్డీయేతర ముఖ్యమంత్రుల్లో తానొక్కదాన్నే హాజరైతే.. కనీసం తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎన్డీఏ ముఖ్యమంత్రులకు మాత్రం 20 నిమిషాల సమయం ఇచ్చారని ఆరోపించారు.

కాశ్మీర్‌లో మరో 2000 మంది బీఎస్ఎఫ్ జవాన్ల మోహరింపు..

జమ్మూ కాశ్మీర్ ఇటీవల కాలంలో ఉగ్రదాడులు పెరగడం, సరిహద్దు వెంబడి చొరబాటు ప్రయత్నాలు ఎక్కువ కావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూలోని భారత్-పాకిస్తాన్ వెంబడి భద్రతను పటిష్టం చేసేందుకు ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి సిబ్బందిని మోహరించనున్నారు.దాదాపుగా 2000 మంది భద్రతా బలగాలను తరలించనున్నారు.

10ఏళ్లు..విదేశాల్లో 633 మంది భారతీయ విద్యార్థుల మృతి..అత్యధికంగా ఇక్కడే..

విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం.. గత ఐదేళ్లలో 41 దేశాల్లో కనీసం 633 మంది భారతీయ విద్యార్థులు మరణించారు. కెనడాలో అత్యధికంగా 172 మరణాలు సంభవించాయి. హింసాత్మక దాడుల్లో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరణానికి గల కారణాలలో సహజ కారణాలు, ప్రమాదాలు, వైద్య అత్యవసర పరిస్థితులు కూడా ఉన్నాయి. లోక్‌సభ వర్షాకాల సమావేశంలో కేరళ ఎంపీ కొడికున్నిల్‌ సురేష్‌ అడిగిన ప్రశ్నపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌సింగ్‌ ఈ సమాచారాన్ని అందించారు.

భారత్‌కు శుభవార్త.. ఫైనల్‌కు స్టార్‌ షూటర్‌

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు శుభవార్త వెలువడింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత స్టార్‌ షూటర్‌ మను భాకర్‌ ఫైనల్‌కు చేరుకుంది. అంతకుముందు.. ఈ ఈవెంట్‌లో భారత పురుషుల ఆటగాళ్లు క్వాలిఫయర్‌లకు మించి పురోగతి సాధించలేదు. మను అద్భుత ప్రదర్శన చేసి లక్ష్యాన్ని కచ్చితంగా చేధించింది. బంగారు పతకాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. టాప్ 8లో ఉన్న షూటర్ మను భాకర్‌ ఫైనల్ రౌండ్‌లో చోటు దక్కించుకుంది. మను మొత్తం 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు చేరుకుంది.