విచారణకు సహకరించని పోసాని..
అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో లో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి విచారణ కొనసాగుతుంది. దాదాపుగా ఐదు గంటల పాటు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సీఐ వెంకటేశ్వర్లు విచారిస్తున్నారు. అయితే, విచారణకు నటుడు పోసాని కృష్ణ మురళి సహకరించడం లేదు.. ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నారు.. ఆయన నోరు విప్పితేనే విచారణ కొనసాగుతుంది అన్నారు.. అలాగే, తాము అడిగిన ప్రశ్నలకు పోసాని తికమక సమాధానం చెబుతూ.. తెలియదు, మర్చిపోయా, గుర్తుకులేదు అంటూ సమాధానమిస్తున్నాడు అని ఓబులవారి పల్లి పోలీసుల వెల్లడించారు.
ముగిసిన కేఆర్‌ఎంబీ మీటింగ్. రెండు రాష్ట్రాలకు కీలక సూచలను చేసిన బోర్డు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వివాదాలను పరిష్కరించేందుకు కృష్ణా నదీ నిర్వహణ మండలి (KRMB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి పంపిణీ, వృధా కాకుండా సరైన వినియోగం, తాగునీటి ప్రాధాన్యత వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. KRMB రెండు రాష్ట్రాలకు తాగునీటి అవసరాలను అత్యంత ప్రాధాన్యతతో చూడాలని సూచించింది. ప్రజలకు తాగునీరు అందించడమే మొదటి బాధ్యతగా పేర్కొంది. రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ వివాదాలు లేకుండా, సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని బోర్డు సూచించింది. నీటిని వ్యవసాయ అవసరాలకు సమర్థవంతంగా ఉపయోగించాలి – ప్రస్తుత ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు కీలక దశలో ఉన్నందున, వ్యవసాయ అవసరాలకు నీటిని సరిగ్గా వినియోగించుకోవాలని బోర్డు పేర్కొంది. వృధా లేకుండా, తగిన ప్రణాళికతో సాగుకు నీరు అందించాలని సూచించింది. నీటి నిల్వలు పొదుపుగా వినియోగించాలి – ప్రస్తుత నీటి నిల్వలు గరిష్టంగా వేసవి వరకు సరిపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని బోర్డు రాష్ట్రాలను ఆదేశించింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రెడిబిలిటీ కోల్పోయింది..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రెడిబిలిటీ కోల్పోయింది అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చారు.. తొమ్మిది నెలల పాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసిన మోసం అర్థమైపోయిందన్నారు. ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు మాత్రమే పూర్తి సమయం వెచ్చిస్తుంది.. ప్రజలు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది.. కేవలం కక్ష సాధింపు కోసమేనా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం రూ. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పిన తర్వాత ఏడు లక్షలు కోట్లకు మాట మార్చారు.. చంద్రబాబు అబద్ధాల కోరు అని మళ్లీ నిరూపితమైంది.. తిరుమల లడ్డూను పరీక్షించకుండా కల్తీ జరిగిందని ప్రభుత్వం ఎలా చెప్పింది.. అధికారం అనే అతి పెద్ద బాధ్యతను విస్మరించి ప్రభుత్వం పాలను చేస్తుంది అని చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు.
‘‘సీజనల్ ప్లూ’’, తీవ్రమైన ‘‘బర్డ్ ఫ్లూ’’ నుంచి రక్షణ కల్పించవచ్చు..
ఇటీవల కాలంలో “బర్డ్ ఫ్లూ” ప్రపంచాన్ని భయపెడుతుంది. H5N1 బర్డ్ ఫ్లూ కేసులు పలు దేశాల్లో నమోదు అయ్యాయి. ముఖ్యంగా మానవుడికి బర్డ్ ఫ్లూ సోకడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాబోయే కాలంలో సంభావ్య ‘‘మహమ్మారి’’గా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా ఒక అధ్యయనంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణ “సీజనల్ ఫ్లూ(H1N1)” ఇన్ఫెక్షన్ల ద్వారా ఏర్పడిన ‘‘రోగనిరోధక వ్యవస్థ’’ బర్డ్ ఫ్లూ తీవ్రతను తగ్గిస్తుందని తెలిపింది.
గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారింది
గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారిందని ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుంటే ఈ మాత్రం పనులు కూడా కనిపించవన్నారు. సీసీ రోడ్లు, చౌరస్తాలో వెలిగే లైట్లు, స్మశాన వాటికలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి..వీటిపై చర్చకు వస్తారా రండని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కోసం 25 ఏళ్లు కొట్లడినాం.. మూత వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం… తెరిచింది బీజేపీ ప్రభుత్వమన్నారు ఈటల రాజేందర్ రెడ్డి. కాజీపేట కొచ్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, చేతిలో ఉన్న పని చేసే దమ్ము రేవంత్ కు లేదు.. కానీ కిషన్ రెడ్డి మీద విమర్శలు చేస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పనులు ఎలా ముందుకు వెళ్తావని, తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుందన్నారు ఈటల రాజేందర్. అంతేకాకుండా.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ దగ్గర బస్ స్టాప్ కట్టలేని దుస్థితి అని, కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ లో పనులు చూసి రావాలని రేవంత్ కు సూచించారు. మోడీని విమర్శించడం సూర్యుడిపై ఉమ్మి వేసినట్లే అని, మోడీ మీద మాట్లాడిన కేసీఆర్ ఏమైపోయారో రేవంత్ కు అదే గతి పడుతుందన్నారు ఈటల రాజేందర్. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితి నెలకొంది.. సిగ్గు అనిపించడం లేదా ? అని ఆయన ప్రశ్నించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద హరీష్ రావు నిరసన… మహేష్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు
ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, మాజీ మంత్రులుగా కనీస మినహాయింపు లేకుండా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్లి నిరసన తెలపడం సిగ్గుచేటని టిడిసిసి చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతి విషయాన్ని రాజకీయ రంగు పులమడం అలవాటైపోయిందని, శవాలపై రాజకీయం చేయడం వారి నైజమని ఆయన ధ్వజమెత్తారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 24 గంటల పాటు రిస్క్యూ టీమ్స్ అహర్నిశలు శ్రమిస్తున్న వేళ, హరీష్ రావు నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లి హడావిడి చేయడం, ఫోటోలకు పోజులు ఇవ్వడం వారి పనికి ఆటంకం కలిగించడమేనని ఆయన విమర్శించారు. కనీసం రక్షణ చర్యలకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ నేతలకు లేకపోవడం దారుణమని అన్నారు.
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పోలీసుల నోటీసులు..
అనంతపురం జిల్లాలో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చారు. సెక్షన్ 35/ త్రి బీఎన్ఎస్ కింద గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చారు. మార్చ్ 5వ తేదీన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని మాజీ ఎంపీ మాధవ్ కు నోటీసులు అందజేశారు. నవంబర్ 2వ తేదీ 2024న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో, గోరంట్ల మాధవ్ పై 72, 79 బీఎన్ఎస్ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఫోక్సో కేసులో బాధితురాలి పేరు గోరంట్ల మాధవ్ చెప్పారని కేసు నమోదు చేశారు.
ఉగాది పండుగ రోజు నుంచి పీ4 విధానం ప్రారంభించనున్న ఏపీ సర్కార్
ఉగాది పండగ రోజున పీ- 4 విధానాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. పేదల అభివృద్ధి కోసం పీ 4 కార్యక్రమం నిర్వహిస్తుంది.. వచ్చే ఆగస్టుకి 5 లక్షల కుటుంబాలకు ధృవీకరణ.. ముందుగా 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్.. పీ-4పై అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సమాజంలో పేదలకు ప్రభుత్వం అండగా ఉండటమే పీ- 4 ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. పీ-4 కోసం నిర్మాణాత్మకమైన స్థిరమైన విధానం ఉండాలి.. అర్హత ఉన్న కుటుంబాలను డేటా బేస్, హౌస్ హోల్డ్, గ్రామసభ ద్వారా గుర్తించాలి అని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూములు ఉన్న వారికి P4 నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు తెలిపారు.
పెండిగ్ చలానా కోసం నా కారు ఆపుతావా? నీకు ఎన్ని గుండెలు..!
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై రెచ్చిపోవడం కామన్ అయిపోయింది. విధులకు ఆటంకం కలిగిస్తే.. తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచించడం లేదు. రాజకీయ నాయకులు, ప్రముఖుల అండతో పబ్లిక్‌లోనే పోలీసులపై చిందులేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పంజాగుట్ట లో కారు ఓనర్ హల్చల్ సృష్టించాడు. పెండింగ్ చలానాలు చెక్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కారు ఆపారు. నాలుగు వేల పెండింగ్ చలానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. “నా కారు ఆపడానికి నీకు ఎన్ని గుండెలు.. కేవలం నాలుగు వేల రూపాయల చలానా కోసం నా కారు ఆపుతావా? రెండు నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయిస్తా..” అంటూ ట్రాఫిక్ ఎస్సై మోజీరామ్‌పై ఓనర్ చిందులేశాడు. నా ఇంట్లో ఉన్న కారుకు 16 వేల పెండింగ్ చలానా ఉంది.. ఎవరూ అడగలేదు.. నన్నే ఆపుతావా? అంటూ వీరంగం సృష్టించాడు. పంజాగుట్ట మెర్క్యూర్ హోటల్ ముందు వాహన తనిఖీలు చేస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. వీడియో రికార్డు చేసిన పోలీసులు వాహనంతో పాటు కారులో ఉన్న ఇద్దరినీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించారు.
హరీష్ రావు ఆరోపణలు అబద్ధాలు.. గోబెల్స్ ప్రచారం
మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, గోబెల్స్ ప్రచారమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీరు అందాల్సి ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనులను పూర్తి చేయకుండా వదిలేసిందని మండిపడ్డారు. ఆ పనులు పూర్తయి ఉంటే నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చేదని పేర్కొన్నారు.
ఈ ప్రమాదాన్ని అందరూ చూడటానికి ప్రభుత్వం పూర్తి అనుమతిని ఇచ్చిందని, ఎవరినీ అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా, అప్పటి ప్రతిపక్ష నాయకులైన తమకు అనుమతులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రెండు, మూడు నెలల్లో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులను పునఃప్రారంభిస్తామని, కొన్ని రోజుల్లో సహాయక చర్యలు పూర్తవుతాయని తెలిపారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడే అనుమతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.