NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

సీబీఐకి అనుమతి నిరాకరణ.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ముడా ల్యాండ్ స్కాం నేపథ్యంలో కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు కర్ణాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంచలనంగా మారింది. ఈ కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐ విచారణ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు సిద్ధరామయ్య పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, సీబీఐతో దర్యాప్తు చేయాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో సీబీఐ దర్యాప్తు అనుమతి ఇస్తూ గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ని ఉపసంహరించుకోవాలని కర్ణాటక క్యాబినెట్ గురువారం నిర్ణయం తీసుకుంది. సీఎం సిద్ధరామయ్యకు ఈ కేసులో ఉచ్చుబిగిస్తున్న సమయంలో ఈ నిర్ణయం వచ్చింది.

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హైడ్రా దూకుడు పేదలపై కాకుండా బాధితులతో చర్చించండని కిషన్‌ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇతర భాగస్వామ్య పక్షాలను పరిగణలో తీసుకోండని, 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లు అక్రమమని సర్కార్ కూల్చివేస్తే వారి బాధ ఎవరికి చెప్పుకోవాలన్నారు కిషన్‌ రెడ్డి. అక్రమంగా భూములు అమ్మినవారినీ బాధ్యులను చేయాలి, వారి పై చర్యలు తీసుకోవాలని, రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రోడ్డునపడేస్తే వాళ్ల బతుకులు ఏమై పోతాయన్నారు. పాలకుల, అధికారుల అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజల నుంచి దళారులు దోచుకున్నారని, అన్ని అనుమతులున్న భవనాలను నేలమట్టం చేయడం బాధకరమన్నారు కిషన్‌ రెడ్డి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చే అనుమతులను తప్పు అని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని, మూసీ పరివాహ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వేలాది మంది జీవనోపాధి ఇక్కడే ఉంటుందన్నారు. దుందుడుకు విధానాలతో ముందుకు వెళ్లవద్దని లేఖలో రేవంత్ కు సూచించారు కిషన్ రెడ్డి.

ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ పనితీరుపై మంత్రి పయ్యావుల సమీక్ష

ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ పనితీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించారు. తమ విభాగంలో చేపడుతున్న కార్యక్రమాలపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ అంశాల్లో రియల్ టైంలో సమాచారం తీసుకుంటూ ప్రణాళికలను రూపొందించుకుంటున్న తీరును మంత్రికి అధికారులు వివరించారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు.. ప్రస్తుత ఏపీ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ప్రణాళిక విభాగం అధికారులకు మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. ఏయే రంగాల్లో ఫోకస్ పెడితే ఏపీ అభివృద్ధి జరుగుతుందోననే అంశంపై డీటైల్డ్ నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

రెడ్ బుక్ పని ప్రారంభమైంది… తప్పుచేసిన వారిని వదలం..

“మాజీ ముఖ్యమంత్రి జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు. మనం ఏమతానికి చెందిన వారమైనా అన్నిమతాలను గౌరవించాలి. మేం చర్చి, మసీదులకు వెళ్లినపుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటాం. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని” రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రెడ్ బుక్ పని ప్రారంభమైంది..తప్పుచేసిన వారిని వదలమన్నారు. శ్రీకాకుళంలో స్కూలు పరిశీలన అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ… తిరుమల లడ్డూ నాణ్యతా లోపంతో పాటు అనేక సమస్యలను భక్తులు యువగళం పాదయాత్రలో తన దృష్టికి తెచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రక్షాళన చేయాలని ఈవోకు చెప్పామన్నారు. నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ 250 కోట్లు ఉండాలన్న నిబంధనను వైవీ సుబ్బారెడ్డి రూ.150కోట్లకు తగ్గిస్తూ ఎందుకు సవరించారని మంత్రి ప్రశ్నించారు. తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశామని, ఆ కమిటీ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఇప్పుడు తిరుమల లడ్డూ క్వాలిటీ బాగుందని వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా చెబుతున్నారన్నారు.

ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణం

ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణమంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోర్త్ సిటీ పేరుతో తన సోదరులకు వేల కోట్లు లబ్ధి చేసే కుట్ర అని, ఫార్మాసిటీ వ్యవహారంలో ప్రభుత్వం పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫార్మాసిటీ ఉన్నట్టా? లేనట్టా స్పష్టం చేయండని, కోర్టులో మాత్రం ఫార్మాసిటీ కొనసాగుతుందంటూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తే రైతుల భూమి వారికి అప్పగించాలని, ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సహా మంత్రులు చాలా సందర్భాల్లో ప్రకటించారన్నారు. అదే నిజమైతే రైతుల నుంచి సేకరించిన భూమిని వారికి తిరిగి ఇచ్చేయాలని, ఇదే ప్రభుత్వం ఒకవైపు ఫార్మాసిటీ రద్దు చేశామంటూనే…హైకోర్టులో మాత్రం ఫార్మాసిటీ రద్దు కాలేదని చెబుతోందన్నారు కేటీఆర్‌. ఫ్యూచర్ సిటీ, ఏఐ సీటీ, ఫోర్త్ సిటీ అంటున్నారు. దాని కోసం ఒక్క ఎకరం భూమినైనా సేకరించిరా? ఒక్క ఎకరాం సేకరించకుండా ఫార్మా సిటీ భూములను ఇతర అవసరాలకు ఎలా మళ్లిస్తారు? అని ఆయన ప్రశ్నించారు.

మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి మళ్లీ ప్రోత్సాహం

మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత తెలుగు దేశం ప్రభుత్వంలో క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చామని… నాడు పలు స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపడితే.. గత ప్రభుత్వం అన్ని పనులు నిలిపివేసింద‌ని చంద్రబాబు నాయుడు అన్నారు. నాడు ప్రారంభమై కొంతమేర పూర్తి అయిన స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు, క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాసకేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని….క్రీడలు అంటే కేవలం పోటీల్లో పాల్గొనే వాళ్లకు సంబంధించిన‌ విషయంగానే చూడవద్దని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వాళ్లు కూడా క్రీడల్లో భాగస్వాములు అయ్యేలా చేయాలన్నారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్‌కు ఆహ్వానం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను టీటీడీ ఆలయ అధికారులు అందజేశారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో అందించారు. తిరుమల ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. అక్టోబర్‌ 4 నుంచి 12 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏటాది వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ చూస్తే.. ప్రముఖంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల వేళ పలు రకాల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా , అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది.

ప్రత్యామ్నాయం, పునరావాసం తర్వాతనే ఇండ్లు కూల్చాలి

ఎలాంటి ప్రత్యామ్నాయం, పునరావాసం కల్పించకుండానే హైదరాబాదు మూసీ నది పరిసర ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేదల ఇండ్లు, గుడిసెలను హైడ్రా అధికారులు వెంటనే తొలగించేందుకు పూనుకోవడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా పునరావాసం కల్పించిన తర్వాతనే ఇండ్లను కూల్చే పనిని చేపట్టాలని, మూసీ అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నదన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాదులోని చాదర్‌ఘాట్‌, మూసానగర్‌, శంకర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఎఫ్‌టిఎల్‌ జోన్‌లో దశాబ్దాలుగా వున్న 2వేలకు పైగా పేదల ఇండ్లు కూల్చడానికి హైడ్రా ప్రస్తుతం సర్వే చేసి మార్కింగ్‌ చేస్తున్నదన్నారు.

ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం.. అరెస్ట్ నుంచి రక్షణ పొడిగింపు

మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. అరెస్ట్ నుంచి ఆమెకు రక్షణను అక్టోబర్ 4 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఐఏఎస్ ఉద్యోగం సంపాదించేందుకు ఆమె అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ఆమెపై యూపీఎస్సీ వేటు వేసింది. భవిష్యత్‌లో జరిగే ఏ పరీక్షలకు హాజరుకాకుండా నిషేధం విధించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా ఆమెను ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేసింది. అయితే ఆమె అక్రమాలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ధర్మాసనాన్ని కోరగా అంగీకరించింది. ఆ గడువు నేటితో ముగియడంతో.. గురువారం మరొకసారి జస్టిస్ చంద్ర ధారి సింగ్ పొడిగించారు. దీంతో ఆమెకు కోర్టులో ఉపశమనం లభించింది.

రూ.130 కోట్లతో తయారు చేసిన సూపర్ కంప్యూటర్లను ప్రారంభించిన మోడీ..

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. నేషనల్ సూపర్‌కంప్యూటింగ్ మిషన్ (NSM) కింద భారతదేశం యొక్క శాస్త్రీయ, సాంకేతిక పురోగతి సాధనలో ఈ చర్య ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 130 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ సూపర్‌ కంప్యూటర్లను పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో శాస్త్రోక్తమైన పరిశోధనలను సులభతరం చేసేందుకు ఇవి ఉపయోగపడుతాయని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాస్త్రవేత్తలు.. ఇతరులను ఉద్దేశించి మోడీ చెప్పారు. వాతావరణ మరియు వాతావరణ పరిశోధన కోసం రూపొందించిన రూ. 850 కోట్ల హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజును సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో “చాలా పెద్ద విజయం”గా అభివర్ణించారు. సాంకేతికత, కంప్యూటింగ్ సామర్థ్యంపై ఆధారపడని రంగం ఏదీ లేదని మోడీ అన్నారు. “ఈ విప్లవంలో, మన వాటా బిట్‌లు, బైట్‌లలో కాకుండా టెరాబైట్‌లు, పెటాబైట్‌లలో ఉండాలి. అందువల్ల, మేము సరైన వేగంతో సరైన దిశలో పయనిస్తున్నామని ఈ విజయం రుజువు చేస్తుంది’ అని ఆయన అన్నారు. సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఆవిష్కరణ, అభివృద్ధిలో మాత్రమే కాదు.. చివరి వ్యక్తి యొక్క ఆకాంక్షలను నెరవేర్చడంలో కూడా ఉందని మోడీ తెలిపారు.