NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం..

కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం క్షమశిక్షణ లేని ఆర్ధిక ప్రణాళికల వల్ల హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడిందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన రూ.4500 కోట్లను గత ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 114,000 ఇళ్ళు పూర్తి చేసిందని.. ఫిబ్రవరి 1న తణుకు నియోజకవర్గం తేతలి గ్రామం నుంచి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆ ఇళ్ళ తాళాలను ఇవ్వడం జరుగుతుందని మంత్రి పార్థసారథి తెలిపారు. భవిష్యత్తులో పీఎంఏవై (PMAY 1.0) కింద మరో 6 లక్షల ఇళ్ళు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. బెజవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రేపు (ఆదివారం) విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించనుంది. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని నగర సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి కంట్రోల్ రూమ్ వైపు నుండి బెంజ్ సర్కిల్ వైపుకు వెళ్ళు అన్నీ వాహనాలను ఆర్టీసీ వై జంక్షన్ నుండి ఏలూరు రోడ్ మీదుగా స్వర్ణ ప్యాలస్, దీప్తి సెంటర్ చుట్టుగుంట, పడవలరేవు, గుణదల, రామవరప్పాడు రింగ్ మీదుగా బెంజ్ సర్కిల్ వైపుకు మళ్లించనున్నారు. ఆర్టీసీ వై జంక్షన్ నుండి బందర్ లాకులు, రాఘవయ్య పార్క్, పాత ఫైర్ స్టేషన్ రోడ్, అమెరికన్ హాస్పిటల్, మసీద్ రోడ్, నేతాజీ బ్రిడ్జ్, గీతానగర్, స్క్యూ బ్రిడ్జ్ మీదుగా బెంజ్ సర్కిల్ వైపుకు పంపించనున్నారు.

షాద్‌నగర్‌ శివలీల హత్య కేసు ఛేదించిన పోలీసులు

షాద్‌నగర్‌ శివలీల (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే శివలీల హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకోమన్నందుకు శివలీలను హత్య చేసిన రౌడీషీటర్‌ దేవదాస్‌జజ గతంలోనూ రెండు హత్యలు, అత్యాయత్నాల కేసులో నిందితుడని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఫరూఖ్‌నగర్ మండలం పిట్టలగడ్డతండాకు చెందిన శివలీల తన భర్త మృతి చెందడంతో తన తల్లి దగ్గర ఉంటూ.. కన్హాశాంతివనంలో కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. కర్నూల్‌కు చెందిన దేవదాస్, గతంలో లైన్‌మెన్‌గా పనిచేసేవాడు. అయితే, ఓ మహిళ హత్య కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లడంతో ఉద్యోగం కోల్పోయాడు. ఆ తరువాత కొంతకాలంగా కన్హాలోనే పనిచేస్తున్నాడు.

తెలంగాణలో సినిమా బెనిఫిట్‌ షోలు రద్దు!

తెలంగాణలో సినిమా బెనిఫిట్‌ షోలు రద్దు చేయనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సినిమా బెనిఫిట్‌ షోలను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 నుంచి ఉదయం 8.40 వరకు సినిమాలను ప్రదర్శించటానికి వీల్లేదని తేల్చి చెప్పింది తెలంగాణ హైకోర్టు. ఏమైనా సినిమాల బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చి ఉంటే వాటిని రద్దు చేయాలని ప్రభుత్వానికి కూడా తాజాగా స్పష్టం చేసింది. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 నుంచి ఉదయం 8.40 వరకూ సినిమాలను ప్రదర్శించటానికి వీల్లేదని హైకోర్టు ఈ సంధర్భంగా వెల్లడించింది. ఇక ఈ క్రమంలో బెనిఫిట్‌ షోల రద్దుకు సంబంధించిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.

అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఇష్యూపై డిప్యూటీ సీఎం కీలక ట్వీట్..

అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఇష్యూపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్‌లో స్పందించారు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వినియోగదారులు లేవనెత్తిన కొన్ని ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. అమెజాన్ వినియోగదారుల గడువు ముగిసిన గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ నాన్ ఆపరేటింగ్ ఖాతాలలోకి పోతుందని గ్రహించామన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ.. తన ఆఫీసు కూడా గడువు ముగిసిన గిఫ్ట్ కార్డ్‌ల నుండి కోల్పోయిన బ్యాలెన్స్‌ల సమస్యను ఎదుర్కొందని తెలిపారు. చాలా మంది వినియోగదారుల సొమ్ము చివరికి ఎటువంటి సహాయం లేకుండా అదృశ్యమవుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

వచ్చే ఐదేళ్లలో మురుగు నీరు కనపడకుండా చేస్తామన్న కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వాసులకు మురుగునీటి సమస్య నుండి ఉపశమనం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. గత 10 సంవత్సరాలలో కొత్త మురుగు కాలువలు వేయడానికి చాలా పని జరిగిందని ఆయన అన్నారు. కొన్ని ప్రాంతాలు మిగిలి ఉన్నాయి. రాబోయే 5 సంవత్సరాలలో ఢిల్లీలోని అన్ని ప్రాంతాల మురుగునీటి కాలువలను మరమ్మతు చేస్తామన్నారు. ప్రజలు మురుగునీటి సమస్య నుండి బయటపడటానికి పాత పైపులైన్లన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన మారుస్తారు. దాదాపు అన్ని కాలనీలలో మురుగునీటి కాలువలు ఏర్పాటు చేశామన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం వర్చువల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘‘ 2015లో మా ప్రభుత్వం మొదటిసారిగా ఏర్పడినప్పుడు, మాకు అనేక సమస్యలు వారసత్వంగా వచ్చాయి. వాటిలో అతిపెద్ద సమస్యలలో ఒకటి మురుగునీటి వ్యవస్థ. ఢిల్లీలో 1,792 మురికివాడల కాలనీలు ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కారణంగా 2015 కి ముందు ఈ కాలనీలలో ఎటువంటి అభివృద్ధి జరుగలేదు. ఆ అడ్డంకులన్నింటినీ దాటుకుని అన్ని మురికివాడల కాలనీలలో పనిచేయడం ప్రారంభించామని కేజ్రీవాల్ తెలిపారు.

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. పద్మశ్రీ వీరికే!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డును మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అలాగే పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మశ్రీకి 30 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపారం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు అలాగే పౌర సేవలు వంటి విభిన్న రంగాలలో అత్యుత్తమ ప్రతిభను ఈ అవార్డు గుర్తిస్తుంది.

నకిలీ నోట్లను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

హనుమకొండ జిల్లాలో నకిలీ నోట్లను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక లక్షకు నాలుగు రెట్లు అధికంగా నకిలీ నోట్లు అందజేస్తామని నకిలీ నోట్ల విక్రయాలకు పాల్పడతున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను కేయూసి పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి భారీ మొత్తంలో అసలు వోట్లు 34లక్షల 84వేల రూపాయలతో పాటు, 21లక్షల రూపాయల నకిలీ నోట్లు, నకిలీ నోట్ల ముద్రణకు అవరమైన తెల్లకాగితాలు, ఒక కారు, ఆటో, తొమ్మిది సెల్ఫోన్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాలకు ఏడు పద్మ అవార్డులు.. ఎవరెవరికంటే ?

కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక గౌరవాలకు ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ఈ తెలుగు వ్యక్తులు, పద్మ అవార్డుల ద్వారా గౌరవించబడ్డారు.

దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి: వైద్య రంగంలో ఆయన చేసిన అగ్రగామి సేవలకు గాను పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ఆయన వైద్య శాస్త్రంలో చేసిన ప్రగతిశీల పరిశోధనలు భారతదేశం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చాయి.

నందమూరి బాలకృష్ణ: తెలుగు సినిమా రంగంలో నటుడిగా, నిర్మాతగా ఆయన చేసిన అద్భుత కృషికి గుర్తింపు తెలియజేయడానికి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు.

పద్మశ్రీ
కేఎల్ కృష్ణ: విద్యా. సాహిత్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు పద్మశ్రీ అవార్డు.
మాడుగుల నాగఫణి శర్మ: కళారంగంలో తన అసాధారణ కృషి, అభిరుచికి గుర్తింపు.
మంద కృష్ణ మాదిగ: ప్రజా వ్యవహారాల్లో ఆయన చేసిన సేవలకు ఆయన పద్మశ్రీ అవార్డు పొందారు.
మిరియాల అప్పారావు: తెలుగు సాహిత్యం, కళారంగంలో విశేష కృషి.
వి రాఘవేంద్రాచార్య పంచముఖి: సాహిత్యం, విద్యా రంగంలో చేసిన అద్భుత సేవలకు గాను పద్మశ్రీ అవార్డు.

ప్రేమకు అభ్యంతరం చెప్పాడని ప్రియురాలి తండ్రి దారుణ హత్య..

తన ప్రేమకు అభ్యంతరం చెబుతున్నాడని ప్రియురాలి తండ్రిని ప్రియుడు హత్య చేసిన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. ప్రేమకు అంగీకరించడం లేదని ప్రాణాలు తీసేంత బరి తెగిస్తున్నారు కేటుగాళ్లు.. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడొద్దని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఈ దారుణాలు ఆగడం లేదు. తమకు కావాల్సిందల్లా ఒకటే అమ్మాయి.. అమ్మాయి కోసం పేరెంట్స్‌ను హత మారుస్తున్నారు.. వివరాల్లోకి వెళ్తే………

నెల్లూరులోని శ్రీనివాస్ నగర్‌లో మహబూబ్ బాషా అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహబూబ్ బాషా కుమార్తెను సాదిక్ అనే వ్యక్తి గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరి ప్రేమను మహబూబ్ బాషా అంగీకరించకపోవడంతో సాదిక్ ఆగ్రహానికి గురయ్యాడు. బేకరీలో ఉద్యోగిగా పని చేసే మహబూబ్ బాషా కోసం కాపు కాచి కత్తితో దాడి చేశాడు. దీంతోజజ తీవ్రంగా గాయాలపాలైన మహబూబ్ బాషా అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరోవైపు నిందితుడు సాదిక్.. నవాబ్ పేట పోలీస్ స్టేషన్‌లో లొంగి పోయాడు.